TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Andhrapradesh News: జులై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ గురువారం విడుదల చేసింది. ఈ నెల 20 వరకూ ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని.. భక్తులు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపింది.
TTD Released Srivari Seva Tickets: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల వరకూ సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం లక్కీ డిప్ ఆధారంగా అధికారులు టికెట్లు కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు నగదు చెల్లించి టికెట్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ బంగారు వాకిలి వద్ద ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.
ఇక, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
ఆ టికెట్లు ఎప్పుడంటే.?
అలాగే, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి జులై నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల 23న ఆన్ లైన్ లో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా జులై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు జులై నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఆ టికెట్లతో పాటే గదుల కోటాను సైతం ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అటు, శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ స్లాట్‌లు ప్రకారం భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read: LLB: ఇంటర్ తర్వాత మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు