TTD Brahmotsavams : బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి !
బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. భక్తులకు పలు రకాల సూచనలు అధికారులు చేస్తున్నారు.
TTD Brahmotsavams : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 27 నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. రెండేళ్ళుగా కోవిడ్ ప్రభావంతో బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు . కోవిడ్ ప్రభావం పూర్తి స్ధాయిలో అదుపులోకి రావడంతో ఈ ఏడాది ఆలయం వెలుపల నిర్వహించాలని నిర్ణయించారు. గత రెండేళ్ల తరువాత నిర్వహించే ఉత్సవాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనాకు వచ్చింది.. ఈ క్రమంలో తిరుమలలో అందుకు తగ్గ ఏర్పాట్లను టిటిడి చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాలు కనుల విందుగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు
సెప్టంబర్ 27నుండి ప్రారంభమయ్యే మహా సంరంభరానికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రెండు నెలల నుంచే టీటీడీ ఏర్పాట్లను మొదలుపెట్టింది.. ప్రధానంగా శ్రీవారి వాహనసేవలు జరిగే ఆలయ మాడ వీధులతో పాటు తిరుమలను ఇప్పటికే సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.. రంగు రంగుల హారివిల్లులతో పాటు పుష్ప, విద్యుత్ దీపకాంతులతో తిరువిధులను దేదీప్యమానంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనసేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది తలైతకుండా పటిష్టంగా బారికేడ్స్ వ్యవస్ధను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆలయ ముందు భాగంలో ఉండే ఖాళీ స్ధలంలో కూడా వేలాదిగా భక్తులు వాహనసేవలలో స్వామి వారి వైభోగాని తిలకించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు.
సామాన్య భక్తులకే పెద్ద పీట !
తిరుమలలోని ప్రధాన మార్గాలలో భారీ ఆర్చీలను నిర్మించడంతో పాటు కాటేజీలు, కార్యాలయాలు, భక్తజన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా ఆలంకరిస్తు్ననారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తొమ్మిది రోజుల పాటు 16 వాహనాల పై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ ఏడాది వాహనసేవల సమయంను ఉదయం 8గంటలకు నిర్వహిస్తే, రాత్రి 7గంటలకే వాహనసేవలను ప్రారంభించాలని టీటీడి నిర్ణయించింది.. సెప్టంబర్ 26న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంను శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.
ఇదీ బ్రహ్మోత్సవాల షెడ్యూల్ !
27వ తేదీ సాయంత్రం 5:15 గంటలు నుంచి 6:15 నిమిషాల వరకు శ్రీవారికి ధ్వజారోహణ కార్యక్రమంను అర్చకులు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు..దీంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం అవుతాయి.. అదే రోజు సాయంత్రం 7గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.. రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేషవాహనంతో బ్రహ్మోత్సవాల వేడుకలు మొదలు కానుంది..28వ తేదీ ఉదయం 8గంటలకు చిన్నశేషవాహనం, రాత్రి 7గంటలకు హంసవాహనం, 29వ తేది ఉదయం 8గంటలకు సింహవాహనం, రాత్రి 7గంటలకు ముత్యపు పందరి వాహనం, 30వ తేది ఉదయం 8గంటలకు కల్పవృక్షవాహనం, రాత్రి 7గంటలకు సర్వభూపాల వాహనం, అక్టోబర్ 1వ తేది ఉదయం 8గంటలకు మోహిని అవతారం, రాత్రి 7గంటలకు గరుడవాహనం, 2వ తేది ఉదయం 8గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరధం, రాత్రి 7గంటలకు గజవాహనం, 3వ తేది ఉదయం 8గంటలకు సూర్య ప్రభవాహనం, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనం, 4వ తేది ఉదయం 7గంటలకు రధోత్సవం, రాత్రి 7గంటలకు ఆశ్వవాహనం, 5తేది ఉదయం 6గంటలకు చక్రస్నానం, రాత్రి 9గంటలకు ధ్వజావరోహాణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి..
సిఫార్సు లేఖలతో దర్శనం రద్దు !
మరో వైపు బ్రహ్మోత్సవం సమయంలో సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.. అంతేకాకుండా ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్టు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టిటిడి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.. కేవలం సర్వదర్శనం మాత్రమే అనుమతిస్తాంమని టిటిడి ప్రకటించింది.. గదుల కేటాయింపు కేంద్రాలను బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది..