Devshayani Ekadashi 2025: తొలి ఏకాదశి ఎప్పుడు? ఉపవాసం నియమాలు, విశిష్టత, ఈరోజు పేలాల పిండి ఎందుకు తినాలి!
Deva Sayana Ekadashi 2025: ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగ సందడి మొదలవుతుంది. ఈ రోజు ఏం చేయాలి? విశిష్టత ఏంటి? తెలుసుకుందాం..

Devshayani Ekadashi 2025 Date: ఏటా ఆషాఢమాసం పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో ఈ రోజు నుంచి పండుగలు ఆరంభమవుతాయి అందుకే తొలి ఏకాదశి అంటారు. సాధారణంగా ఏకాదశి శ్రీ మహావిష్ణువికి అంకితం చేసిన రోజు. అయితే మిగిలిన ఏకాదశిల కన్నా తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే.. ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లి నాలుగు నెలల పాటూ విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఈ కాలంలోనే చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో వివాహం, గృహారంభం, గృహప్రవేశానికి సంబంధించిన శుభకార్యాలు నిర్వహించరు. సాధారణంగా ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు..తొలి ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఆచరించడం అత్యంత పుణ్యఫలం.
2025 లో తొలి ఏకాదశి ఎప్పుడు?
జూలై 05 శనివారం సాయంత్రం 6 గంటల 22 నిముషాలకు ఏకాదశి ఘడియలు ప్రారంభమవుతాయి
జూలై 06 ఆదివారం రాత్రి 8 గంటల 21 నిముషాల వరకూ ఏకాదశి ఉంది...ఆ తర్వాత ద్వాదశి ఘడియలు మొదలయ్యాయి
జూలై 07 సోమవారం రాత్రి 10 గంటల 13 నిముషాల వరకూ ద్వాదశి ఘడియలున్నాయి
ఏకాదశి రోజు మొత్తం ఉంది కాబట్టి జూలై 06 ఆదివారమే తొలిఏకాదశి జరుపుకోవాలి. జూలై 05 శనివారం రాత్రి నుంచి ఉపవాస నియమాలు పాటించాలి. జూలై 06 తొలిఏకాదశి మొత్తం ఉపవాసం పాటించాలి. జూలై 07 ద్వాదశి రోజు ఉపవాసం విరమించాలి.
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి
వేకుల జామున నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. ఇంటిని దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకుని పూజ పూర్తిచేయాలి. పూజలో తులసీదళాలు వినియోగించడం అత్యంత పుణ్యఫలం. రోజంతా ఉపవాస నియమాలు పాటించాలి. విష్ణు స్తోత్రం, విష్ణు సహస్రనామం పఠించాలి. అనారోగ్యంతో ఉండేవారు పండ్లు తీసుకోవచ్చు. ఏకాదశి రోజు ఉపవాసంతో పాటూ రాత్రి జాగరణ చేయాలి. ఈ సమయంలో దైవనామస్మరణ చేయాలి.
శయన ఏకాదశి
శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీరసాగరంపై నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశిని దేవశయన ఏకాదశి అని అంటారు. అంటే ఈ రోజు నుంచి పగటి సమయం కన్నా రాత్రి సమయం ఎక్కువ ఉంటుందని ఆంతర్యం. వాతావరణంలో వేడి తగ్గుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుల వల్ల వ్యాధులు విజృంభిస్తాయి. అందుకే ఈ రోజంతా ఉపవాసం ఉంటారు. పేలపిండిని తింటారు. పేలపిండిని బెల్లం, ఏలకులతో కలపి తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది..అనారోగ్యం దరిచేరదని చెబుతారు.
గోపూజ
గోవులకి ఎప్పుడు పూజ చేసినా ఉత్తమమే. తొలి ఏకాదశి రోజు గోపూజ చేయడం మరింత మంచిది. ఈ రోజు గోపూజ చేసినవారి కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం
పేలాల పిండి ఎందుకు తినాలి?
తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పకుండా తినాలి అని చెబుతారు. పేలాలు పితృదేవతలకు ప్రీతికరమైనవి. ఈ రోజు వారిని గుర్తుచేసుకోవడంతో పాటూ బయట వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు పేలపిండి తింటారు. ఆలయాల్లోనూ, ఇంటివద్ద కూడా పేలపిండిని ప్రసాదంగా పంచుతారు
గమనిక: ఆధ్యాత్మిక వేత్తలు చెప్పిన విషయాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని అనుసరించేముందు మీకు నమ్మకమైన పండితుల సలహాలు స్వీకరించండి...






















