ఆదిలాబాద్ జైనాథ్ ఆలయం: దెయ్యాలు కట్టిన గుడి రహస్యాలు! విశేషాలు, కార్తీక మాసం ప్రత్యేకత & ప్రయాణ వివరాలు!
Sri Narayana Swamy Temple: భూతాలు కట్టిన గుడి ఇది.. మన తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన ఆలయం. అదే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నారాయణ జైనాథ్ ఆలయం

Sri Narayana Swamy Temple Jainath, Adilabad
సాధారణంగా ఏదైనా పురాతన గుడి గురించి చెప్పేటప్పుడు అది ఫలానా రాజులు కట్టించారనో లేక దేవతలు కట్టారనో వర్ణనలు ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఒక గుడి ని మాత్రం భూతాలు, దెయ్యాలు కట్టిన గుడి గా చెబుతుంటారు. అదే ఆదిలాబాద్ లోని జైనాధ్ గ్రామం లోని లక్ష్మీ నారాయణ టెంపుల్. పూర్తి నల్లని రాతితో కట్టిన ఈ దేవాలయం గంభీరంగా ఒక్కోసారి ఒళ్ళు జలదరించేలా కనిపిస్తుందని భక్తులు చెబుతుంటారు.
స్థలపురాణం
దేవదేవుని ఆశీస్సుల కోసం రాక్షసులు ఈ గుడిని రాత్రికి రాత్రే కట్టారని ఇక్కడి స్థల పురాణం. అందుకే గుడి మొత్తాన్ని నల్లని రాతితో రాక్షసులు నిర్మించారని పురాణ కథనం.
అసలు చరిత్ర వేరే ఉంది
చారిత్రికంగా ఈ గుడిని పల్లవుల కాలంలో 4-9 CE మధ్య నిర్మించారు. చరిత్రకారుల ఆధారాల ప్రకారం ఇది. మొదట్లో జైన దేవాలయం. గుడిలో అడుగుడుగునా జైన సంప్రదాయాలు,వాస్తు కళ కనిపిస్తుంది. అయితే 12 వ శతాబ్దంలో చాళుక్య రాజు త్రిభువన మల్లుడి సామంతుడిగా ఈ ప్రాంతాన్ని పాలించిన జగద్దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయం లో మరో శాసనం ఉంది. బహుశా ఆయన కాలం లో ఇది జైన్ ఆలయం నుంచి పూర్తిగా లక్ష్మి నారాయణ ఆలయం గా మార్చారని చరిత్రకారులు భావిస్తున్నారు. మొదట్లో జైనులు కట్టారు కాబట్టి తర్వాత కాలంలో వారినే రాక్షసులు, భూతాలు కట్టారని వర్ణించారా అనేది తేలాల్సి ఉంది. జైన సంప్రదాయం పేరుమీదు గానే ఆ ఊరికి జైనాథ్ అనే పేరు ఆలయానికి జైనాధ్ లక్ష్మీ నారాయణ స్వామి టెంపుల్ అనే పేరు వచ్చాయి. ఈ ఊరు ఆదిలాబాద్ కు 21 కి మీ దూరం లో ఉంది.
కార్తీక మాసం ఉత్సవాలు ఇక్కడి స్పెషల్- మూల విరాట్టు ను తాకే సూర్య కిరణాలు
ఆంధ్ర ప్రాంతంలో అరసవిల్లి లానే తెలంగాణ లోని జైనాథ్ ఆలయం లోనూ స్వామి వారిని సంవత్సరంలో కొన్ని రోజులు సూర్య భగవానుడి కిరణాలు తాకుతాయి. కార్తీకమాసంలో అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి నవంబర్ 10 వ తేదీ వరకూ, అలాగే ఫిబ్రవరి లో రథ సప్తమి రోజుల్లో స్వామి వారిని సూర్యుడి కిరణాలు తాకుతాయి. కార్తీక పౌర్ణమి రోజున కనీసం 800 సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ జరుగుతాయి. ఈ ఆలయం తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధి లో ఉంది. ఇక్కడ బ్రహ్మో త్సవాలు ఘనంగా జరుగుటాయి. ఈ ఆలయానికి జై నాథ్ చుట్టు పక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.ఆలయం లో స్వామి వారి ఒక పక్కన గదాధరుడు మరో పక్కన చెన్న కేశవ స్వామి విగ్రహాలతో పాటు గుడి లో ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి విగ్రహాలు ఉన్నాయి. చూడడానికి చాలా అద్భుతం గా ఉండే ఈ వెయ్యేళ్ళ నాటి జైనాథ్ లక్ష్మి నారాయణ ఆలయం మరింత అభివృద్ధి లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఎలా వెళ్ళాలి
తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్ (చర్లపల్లి ) మీదుగా ప్రతీ రోజూ ఆదిలాబాద్ కు కృష్ణా ఎక్స్ ప్రెస్ వెళుతూఉంటుంది. ఉదయం 6:15కి ఈ ట్రైన్ ఆదిలాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుండి జై నాథ్ 21కిమీ మాత్రమే. తిరుగు ప్రయాణం లో అదే ట్రైన్ మళ్ళీ రాత్రి 9 కి ఆదిలాబాద్ లో బయలుదేరుతుంది. ఇది కాక బస్సు రూట్ లోనూ ఆదిలాబాద్ వెళ్లొచ్చు.





















