ఇంటి గుమ్మాన్ని ఇలా అలంకరించండి సంపద మీ ఇంట్లోనే
ఇంటికి రాగానే ముందుగా కనిపించేది ఇంటి ముఖద్వారమే. గుమ్మం ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ముఖ ద్వారం అందంగా ఉంటే ఇల్లు మరింత శోభాయమానంగా కనిపిస్తుంది.
వాస్తు జీవితంలో సుఖశాంతులను తెచ్చే శాస్త్రం. కొత్త సంవత్సరం అతి దగ్గరలో ఉంది. ఈ శుభవేళ కొన్ని వాస్తు నియమాలు జీవితంలోకి ఆనందాన్ని తెస్తాయని పండితులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
ఇంటి ముఖద్వార నాణ్యత, అది నిలిపిన దిశ ఆ ఇంట్లో నివసించే వారి జీవితాలనే మార్చేంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ప్రహరీ గేటు దాటి ఇంట్లోకి నేరుగా ప్రవేశించే వీలు లేనపుడు ప్రహరీ లోపలికి ప్రవేశించిన తర్వాత కుడి వైపుక తిరిగి ఇంటి ముఖద్వారంలోకి ప్రవేశించేలా ఉండాలి. ఇందుకు భిన్నంగా ఉంటే అది కచ్చితంగా వాస్తు దోషం అవుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువుల అలంకారం వల్ల ఇంటి వైబ్రేషన్ మారుతుంది.
తులసి మొక్క
తులసి ఇంట్లోకి ఆనందాన్ని, శాంతిని తెస్తుంది. తులసి మొక్క నాటేందుకు ముందు ఆ స్థలం శుభ్రంగా ఉందని నిర్ధారించుకోవాలి. ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్శిస్తుంది. తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రసరించే గాలి శుద్ధి చెయ్యబడుతుంది. గాలిలోని హానికారక కెమికల్స్ ను శోషణ చేస్తుంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రాకుండా తులసి కాపాడుతుంది. ఇంట్లోకి సౌబాగ్యం తెస్తుంది. ధనవృద్ధికి దోహదం చేస్తుంది. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగు పడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి.
కలశం
ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి. కలశం పవిత్రమైందని సనాతన ధర్మం చెబుతోంది. రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి, దాంట్లో పసుపు, కుంకుంమ, గంధం, పచ్చకర్పూరం వేసి అందులో పువ్వులు లేదా మామిడి ఆకు వేసి ద్వారానికి ఒక వైపున ఉంచాలి. పురాణాలు వివరించిన దాన్ని బట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి కలంలో ఉంటుంది. పూజలో ముందుగా అందుకే కలశ స్థాపన చేస్తారు.
స్వస్తిక
ఇంటి ముఖద్వారం దగ్గర లేదా గుమ్మానికి స్వస్తిక్ గుర్తు ఉండడం చాలా ముఖ్యం. ఒక వేళ లేకపోతే కనీసం ముగ్గులోనైనా స్వస్తిక్ వేసి పెట్టాలి. స్వస్తిక్ అదృష్టానికి సంకేతం. స్వస్తిక్ ఇంట్లోకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఆకర్శిస్తుందని నమ్మకం. కనుక తప్పనిసరిగా గుమ్మానికి లేదా గుమ్మం దగ్గర స్వస్తిక్ ఉండేలా చూసుకోవాలి.
పూవ్వులు, పూమాలలు
సనాతనంగా పువ్వులు పూజలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. పూ మాలలు ప్రేమకు, గౌరవం, భక్తి, స్వచ్ఛతకు చిహ్నాలు. దేవతార్చనలో పువ్వుల స్థానం ప్రత్యేకం. పువ్వులు దేవుడితో అనుసంధానం చేసే సాధనాలు. ఇంటి గుమ్మాన్ని కూడా పవిత్రంగా చూసుకోవడం మన ఆచారం. ఇంటి గడపను ఇంటి ఆడపడుచుగా భావించే సంప్రదాయం కూడా ఉంది. కనుక గడపకు పసుపు కుంకుమతో అలంకరించి గౌరవప్రదంగా చూసుకుంటారు. ఇంటి గుమ్మానికి పచ్చని మామిడాకుల తోరణాలతో పాటుగా తాజా పూమాలలో అలంకరిచడం పరిపాటి. కొత్త సంవత్సర శుభవేళ పువ్వులు, తోరణాలతో ముఖద్వారాన్ని అలంకరించుకోవాలి.