ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? దిష్టి తగిలిందేమో చూసుకోండి
నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉండి దాని ప్రభావం ఉంటుందని నమ్మినపుడు, ఈర్ష్యా, ద్వేషంతో చూసే చూపుకు, చేసే ఆలోచనకు కూడా కొంత బలం ఉంటుంది.
నరదృష్టికి నాపరాళ్లయినా పగులుతాయని సామేత. అంత శక్తి ఉంటుందట చెడు దృష్టికి. ఏదిష్టి తగిలిందో ఇలా జరిగింది అని అనుకోవడం వింటూనే ఉంటాం. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉండి దాని ప్రభావం ఉంటుందని నమ్మినపుడు.. ఈర్ష్యా, ద్వేషంతో చూసే చూపుకు, చేసే ఆలోచనకు కూడా కొంత బలం ఉంటుంది. ఇది చెడు ప్రభావం పడేట్టు చెయ్యగలుగుతుంది. ఇలాంటి చెడు ఆలోచనతో చూసే చూపునే చెడు దృష్టి లేదా దిష్టి అని అంటారు. చెడు దృష్టి లేదా దిష్టి జీవితంలో రకరకాల ప్రతికూలతలకు కారణం కావచ్చు. దీని వల్ల అనేక రకాలుగా సమస్యలు రావచ్చు. పనులు నెమ్మదించడం నుంచి అనారోగ్యాల వరకు ఎన్నో ఉపద్రవాలు తెచ్చిపెట్టవచ్చు. కుటుంబంలో కలతలు రావచ్చు. అనుకోని అవాంఛితాలు ఎన్నో ఎదురవుతుంటాయి.
దిష్టి వల్ల చాలా రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటుంటారు. కానీ మనకు దిష్టి తగిలిందని తెలుసుకోవడం ఎలా? అనేదే ప్రశ్న. బాగా నడుస్తున్న జీవితం అకస్మాత్తుగా ఒడిదొడుకుల పాలవుతుంది. దిష్టి తగిలినపుడు ఏం జరుగుతుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనేది తెలుసుకుందాం.
- దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలు పెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న పని ఏదీ పూర్తికాదు, ఏం చెయ్యాలన్నా ఒక భయమేదో వెంటాడుతున్న భావన కలుగుతుంది.
- దిష్టి తగిలినపుడు జీవితంలో అవాంఛనీయ సంఘటనలు వరుసగా జరుగుతుంటాయి. తరచుగా అనారోగ్యానికి గురికావడం, అకారణంగా అలసి పోవడం వంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తుంటాయి.
- తరచుగా తలనొప్పి రావడం, తల భారంగా అనిపించడం దిష్టి తగిలిందని చెప్పేందుకు సాక్ష్యాలు. శిరోభారంతోపాటు ఎలాంటి కారణం లేకుండానే గాబరా అనిపిస్తుంటే దిష్టి తగిలినట్టే.
- విశ్రాంతిగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరపు గాబరా, లేదా విపరీతమైన బద్దకం, పనిమీద ఏకాగ్రత లేకపోవడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.
దిష్టి తగిలితే ఏం చెయ్యాలి?
- దిష్టి వల్ల ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతుంటే సముద్రపు నీటిని ఒక శుభ్రమైన బట్టతో వడగట్టి అందులో గోమూత్రం కలిపి ఒకసిసాలో నిల్వ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పౌర్షమి రోజున, పాడ్యమి రోజున ఇంట్లోని అన్ని గదుల్లో కొద్దికొద్దిగా చిలకరించుకోవాలి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన దిష్టి పోతుంది.
- వ్యాపారం చెడు దృష్టి పాలైందని అనుమానం కలిగితే నిమ్మకాయను గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో వేసి అందరూ వచ్చి వెళ్లే చోట పెట్టాలి. ఇందులో నీటిని ప్రతి రోజూ మార్చాలి. నిమ్మకాయను ప్రతి శనివారం మార్చాలి.
- పసి పిల్లలు ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్లిన తర్వాత ఎడతెగకుండా ఏడుస్తుంటే ఉప్పు చేతిలోకి తీసుకొని వారి తలచుట్టూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు తిప్పి ఆ ఉప్పును నీటిలో వేసెయ్యాలి.
- దురదృష్టం వెంటాడుతుంటే ఇంట్లో హాల్ లో పడమటి వైపు అక్వేరియం పెట్టుకుంటే ఫలితం ఉంటుంది.
- గర్భవతులకు దిష్టి తగలకుండా ఉండేందకు బయటికి వెళ్తున్నపుడు రెండు వేపాకులను వెంట తీసుకుని వెళ్లాలి. ఇంటికి తిరిగి రాగానే వాటిని కాల్చేయ్యాలి. ఇలా చేస్తే దిష్టి పోతుంది.
గమనిక: పండితులు, వివిధ ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.