పితృదోషం ఉంటే జీవితం నరకమే - ఈ ఆటంకాలకు అంతే ఉండదు
పితృదోష నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను గురించి శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. ఆవివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హిందు సాంప్రదాయాల్లో జనన మరణాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. చనిపోయిన ఆత్మీయుల ఆత్మ శాంతికి చెయ్యాల్సిన అనేక ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ప్రతి వారు తమ కుటుంబంలోని పూర్వీకుల జ్ఞాపకార్థం అనేక కర్మలు నిర్వహిస్తుంటారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యను పూర్వీకులను స్మరించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఏడాది పితృపక్షాల్లో 15 రోజులు కూడా పెద్దల సంస్మరణార్థం కేటాయిస్తారు. ఈ సమయంలో పిండదానం, తర్పణం, దానధర్మాలు పూర్వీకుల సంస్మరణార్థం చేస్తారు. ఇలా చెయ్యడం వల్ల పితృదేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. పితృదేవతలను తృప్తిపరచకపోతే వారి ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుందని కూడా నమ్ముతారు. ఇలా జరిగితే దాన్ని పితృదోషంగా పరిగణిస్తారు. ఇలా పితృదోషం ఏర్పడితే జీవితంలో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది. పితృదోష నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను గురించి శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. ఆవివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పితృదోషం గురించి జ్యోతిషంలో క్షుణ్ణమైన వివరాలు ఉన్నాయి. జాతకంలో పితృదోషం ఉన్నవారు జీవితంలో చాలా ఒడిదొడుకుల పాలవుతారు. కొంత మందికి వివాహానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. వివాహం జరగడంలో ఆలస్యం జరగడం లేదా వివాహా ప్రాప్తి లేకపోవడం వంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పితృదోషం వల్ల కుటుంబ వృద్ధి కుంటుపడుతుంది. వంశ వృద్ధిలో ఆటంకాలు ఏర్పడుతాయి. సకాలంలో సంతానం కలగకపోవడం లేదా అసలు సంతాన ప్రాప్తి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పితృదోషం వెంటాడుతున్న వారి పిల్లలు విధేయత తప్పిన వారిగా తయారవుతారు. చెప్పిన మాట వినకపోవడం, చెడు మార్గాల్లోకి వెళ్లిపోవడం వంటి కష్టాలు ఆ కుటుంబం ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొన్ని కుటుంబాల్లో ఏం చేసినా కలిసి రాకపోవడం, ఉద్యోగాలు నిలవకపోవడం, వ్యాపారాల్లో నష్టాలు రావడం వంటి ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నింటా అపజయం పాలవడం వంటి కష్టనష్టాలు కలుగుతాయి. క్రమంగా కుటుంబం దారిద్ర్యంలో మునిగి పోతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడుతుంది.
మరి కొన్ని ఇళ్లలో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అకారణంగా ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. భార్యభర్తల మధ్య అనవసరపు అపార్థాలు ఏర్పడుతుంటాయి. చిన్నచిన్న గొడవలు పెద్దపెద్ద సమస్యలకు కారణమవుతుంటాయి. లేదా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతుంటారు.
ఇలాంటి సంకేతాలు ఏవి కనిపించినా పితృదోషం ఉందేమో ఒకసారి పరిశీలించుకోవడం అవసరం. ఇలా పితృదోషం ఏర్పడితే కొన్ని చిన్న చిన్న పరిహారాలతో పరిష్కరించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
పరిహారాలు
పితృదోషం వెంటాడుతుంటే రావి చెట్టుకు నీళ్లు పోయాలి.
నల్లనువ్వులను నీటితో కలిపి దక్షిణ దిక్కున అర్ఘ్యం విడిస్తే పితృదోషం నుంచి విముక్తి దొరుకుతుంది.
ప్రతి నెలా అమావాస్య రోజున, సంవత్సరంలోని పితృపక్షాల్లోనూ శ్రాద్ధం, పిండదానం వంటి కర్మలు నిర్వహించాలి. ఇది పితృదేవతలను శాంతింపజేస్తుంది.
పితృదోషం తొలగాలంటే అవసరంలో ఉన్న వారికి దానధర్మాలు చెయ్యడం కూడా మంచి ఫలితం ఉంటుంది.
Also read : తులసి పూజలో ఈ నియమాలు పాటించండి లక్ష్మి కటాక్షిస్తుంది
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial