తులసి పూజలో ఈ నియమాలు పాటించండి లక్ష్మి కటాక్షిస్తుంది
తులసి పూజకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. నియమానుసారం తులసి పూజ చెయ్యకపోతే ఫలితాలు ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉంటుంది.
తులసి మనకు చాలా పవిత్రమైన మొక్క. తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీ కొలువై ఉంటుందని నమ్మకం. తులసిని పూజించడం ద్వారా తల్లి లక్ష్మీ, నారాయణులిద్దరు ప్రసన్నలు అవుతారు. ప్రతి హిందూ ఇంట్లో తులసి తప్పకుండా పెంచుకుంటారు. పూజిస్తారు కూడా. అయితే తులసి పూజకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. నియమానుసారం తులసి పూజ చెయ్యకపోతే ఫలితాలు ప్రతికూలంగా ఉండే ప్రమాదం ఉంటుంది.
తులసికి నీళ్లెప్పుడు పోయాలి?
తులసిని నిత్యం పూజిస్తారు చాలా మంది. పూజాసమయంలో నీటిని కూడా సమర్పిస్తారు. అయితే ఈ మొక్కకు నీరు పెట్టడానికి కూడా సమయం ఉంటుంది. ఇలా సమయపాలన చెయ్యకపోతే లక్ష్మీ నారాయణులకు కోపం రావచ్చు. ఎప్పుడైనా ఉదయాన్నే తులసికి నీళ్లు పొయ్యాలి. ఇది ఆ కుటుంబానికి శుభప్రదం. స్నానం చేసిన తర్వాత లేదా సూర్యోదయ సమయంలో తులసికి నీళ్లు పొయ్యడం మంచి ఫలితాలు ఇస్తుంది.
తులసికి ఎప్పుడు నీళ్లు పొయ్యకూడదు?
ఆదివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పెట్ట కూడదని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఏకాదశిరోజున కూడా తులసికి నీరు పెట్ట కూడదు. ఏకాదశి రోజున లక్ష్మీ దేవి నిర్జల ఉపవాసంలో ఉంటుందని నమ్మకం. అటువంటి స్థితిలో తులసికి నీరు పెడితే అది ఆమె వ్రతభంగానికి కారణం అవుతుందని శాస్త్రం ఉద్దేశ్యం. కనుక ఏకాదశి రోజున, ఆదివారం రోజున తులసికి నీళ్లు పెట్టకూడదు.
తులసి ఏ దిక్కున ఉండాలి?
తులసికి నీళ్లు నైవేద్యంగా పెట్టడం మాత్రమే ముఖ్యమైంది కాదు. మరి కొన్ని నియమాలు కూడా పాటించాలి. వాస్తు ప్రకారం తులసి మొక్క ఎప్పుడూ ఇంటికి ఉత్తరం వైపు లేదా ఈశాన్యం వైపు మాత్రమే నాటాలి. ఉత్తరం దిక్కున దేవతలు కొలువై ఉంటారని నమ్మకం.
తులసి గురించి జ్యోతిషం ఏం చెబుతోంది?
- పనుల్లో జాప్యం జరుగుతుంటే ఇంట్లో శ్యామ తులసి మొక్క నాటాలి.
- ఈ మొక్క దగ్గర ప్రతి రోజూ సాయంత్రం నేతి దీపం వెలిగించాలి
- ఇంట్లో పెంచుకునే తులసి మొక్కతో పాటు ఒక అరటి మొక్కను కూడా నాటవచ్చు. రెండు మొక్కలు ఎంత దగ్గరగా పెంచితే అంత మంచిదని గుర్తుంచుకోవాలి. రెండు మొక్కలకు ఉదయం సాయంత్రం నీళ్లు పోసి దీపం వెలిగించాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి సులువైన మార్గంగా శాస్త్రం చెబుతోంది.
- కార్తిక మాసంలో ప్రతి రోజు తులసి మొక్క దగ్గర నేతి దీపం వెలిగించాలి. నెల రోజుల పాటు వీలు కానీ పక్షంలో కనీసం దేవోత్ధాన ఏకాదశి నుంచి కార్తిక పౌర్ణమి వరకు కనీసం ఐదు రోజుల పాటు తప్పకుండా నేతి దీపం వెలిగించాలి. తులసిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు కుబేరానుగ్రహం కూడా లభిస్తుంది.
Also read : ఇలాంటి వారితో కలిసి భోజనం చేస్తున్నారా? పాపం చుట్టుకుంటుంది జాగ్రత్త!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial