Mahashivratri 2024: మహాశివరాత్రి పర్వదినాన ఏపీలో దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలు ఇవే
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో ప్రముఖ శివాలయాలు పూజలు అందుకుంటున్నాయి. వీటిలో మహాశివరాత్రి రోజు దర్శించదగిన ఆలయాలు కొన్ని ఉన్నాయి.
Shiva Temple Near Me: మహాశివరాత్రి.. శైవ భక్తులతోపాటు ప్రతి ఒక్కరికి అత్యంత పవిత్రమైన రోజు. అటువంటి పవిత్రమైన రోజున ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించాలనుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో ప్రముఖ శివాలయాలు పూజలు అందుకుంటున్నాయి. వీటిలో దర్శించదగిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. శివ భక్తుల తప్పక దర్శించాల్సిన కొన్నిసైవ క్షేత్రాల గురించి సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.
కోరిన కోర్కెలు తీరుస్తాడన్న విశ్వాసం
ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే.. కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. శివ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహా పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజున ఈశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులు విశ్వాసం. అటువంటి విశ్వాసంతో ప్రముఖ శివాలయాలకు వెళ్లి పూజలు చేసే భక్తుల ఎందరో ఉన్నారు. అటువంటి కొన్ని ఆలయాలను మీరు దర్శించడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ ఆలయాల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి(Srisailam Mallikarjuna Swamy Temple) వారి ఆలయం ఒకటి. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయాన్ని శ్రీశైలం దేవాలయం అంటారు. శ్రీశైలం మల్లికార్జున ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పార్వతీ దేవి 18 శక్తి పీఠాల్లో శ్రీశైలం కూడా ఒకటి. నల్లమల కొండల అద్భుతమైన దృశ్యాలు ఈ ఆలయం ఉన్న ప్రాంతాల్లో కొనవిందు చేస్తాయి. ప్రధానమంత్రి అనేక చిన్న దేవాలయాలు ఉంటాయి. ఆలయ సముదాయంలో అనేక మందిరాలు మండపాలు ఉన్నాయి. ఏటా ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు.
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం
శ్రీకాళహస్తిలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం(Sri Kaleswara Mukteshwara Swamy Temple) కూడా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని శ్రీకాళహస్తి ఆలయం అని అంటారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఉంది. శివుని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయం పరిగణించబడుతోంది. ఈ ఆలయాన్ని కాళా ఋషి నిర్మించాడని చెబుతారు. శ్రీకాళహస్తి ప్రత్యేకత స్పటిక లింగం. ఈ స్పటిక లింగం సహజంగా ఏర్పడిందని చెబుతారు. దక్షిణ భారత్ లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఇది విరాజిల్లుతోంది.
ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం
తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లోని ద్రాక్షారామం(Draksharamam)లో గల శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం(Sri Bhimeswara Swamy Temple) కూడా అత్యంత ప్రసిద్ధి చెందినది. ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన శైవ క్షేత్రంగా వెలుగుతోంది. పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం కూడా ఒకటి. పురాణాల ప్రకారం భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టగాంచింది. ఏటా వందలాది మంది భక్తులు శివరాత్రి రోజున స్వామి వారిని దర్శించుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని మరో శైవ ఆలయం నీలకంఠేశ్వర స్వామి ఆలయం(Neelakantheswara Swamy Temple.). అంతర్వేదిలోని ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు. అంతర్వేది వద్ద ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుంది. ఇక్కడి ప్రాణహిత పుష్కరిణి చాలా ప్రసిద్ధి చెందినది. ఎక్కడి పుణ్యస్నానాలు ఆచరించి తమ కోర్కెలు నెరవేరాలని శివుడిని ప్రార్థిస్తుంటారు.
తిరుమలలోని కపిల తీర్థం..
మహాశివరాత్రి పర్వదినాన దర్శించుకోవాల్సిన ఆలయాల్లో తిరుమల(Tirumala)లోని కపిల తీర్థం(Kapila Theertha ) ఒకటిగా చెబుతుంటారు. తిరుమల కొండపై ఉంటుంది కపిలతీర్థం. పవిత్రమైన శైవ పుణ్యక్షేత్రాల్లో కపిలతీర్థం కూడా ఒకటి. ఇక్కడి ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుంది. శివుడు కపిలతీర్థం వద్ద వేల సంవత్సరాల పాటు ధ్యానం చేసినట్లు చెబుతారు.
అనకాపల్లి జిల్లాలోనూ ప్రముఖ శివాలయం
మహాశివరాత్రి రోజు దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాల్లో ఒకటి అనకాపల్లి జిల్లా(Anakapalli)లోనూ ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ దేవాలయాల్లో బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం(Brahma Lingeswara Swamy Temple) ఒకటి. ఎక్కడి శివలింగాన్ని స్వయంగా బ్రహ్మే స్వయంగా ప్రతిష్టించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ లింగేశ్వర ఆలయం విశాఖ జిల్లా(Visakha) నర్సీపట్నం(Narsipatnam) కి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టం(Bhalighattam)లో ఉంది. ఈ దేవాలయం అతి పురాతనమైనది. కృతయుగంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి అనేక యజ్ఞ యాగాలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరహానది ఉత్తరంగా ప్రవహిస్తుండడంతో దక్షిణ కాశీగా ఈ క్షేత్రం కూడా గుర్తింపు పొందింది. ఏటా వేలాది మంది మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు.
కర్నూలు జిల్లాలోనూ ప్రముఖ ఆలయం
కర్నూలు (Kurnool)జిల్లాలో సప్త నదుల మధ్య ఉన్న సంగమేశ్వర ఆలయం (Sangameshwara Temple)ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజుల్లుతోంది. కర్నూలు నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సప్త నది సంగమ ప్రదేశంలో ఏటా ఒకసారి మాత్రమే శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏలనాటి ఈ ఆలయంలో వేప లింగం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. శివరాత్రి వేళ దర్శించుకోదగిన ఆలయాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతుంటారు.
అమరావతి క్షేత్రంలోని అమరేశ్వర స్వామి ఆలయం
అమరేశ్వర స్వామి దేవాలయం (Amareswara Swamy Temple) గుంటూరు(Guntur) నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పాడని చెబుతారు. ఇక్కడి శివుడు అమరేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన వందలాదిమంది భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు.
విగ్రహరూపంలో దర్శనమిచ్చే శివుడు
సాధారణంగా శివుడు లింగ రూపంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. అరుదైన ప్రాంతాల్లో మాత్రమే శివుడు విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అందులోనూ సిద్ధాసనములో శివుడు కొలువై ఉన్న క్షేత్రం అనంతపురం(Anantapuram) జిల్లాలోని అమరాపురం (Amarapuram)మండలం హేమావతి(Hemavathi)లోని సిద్దేశ్వరాలయం(Siddeswaralayam)లో కనిపిస్తాడు. స్వామి వారి శిరస్సుపై చంద్రుడితోపాటు సూర్యుడు కూడా ఉండడం ఇక్కడి విశేషం. ఇక్కడ ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు స్వామి వారి నుదుటను తాకుతాయి. ఈ ఆలయాన్ని కూడా మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం దేవాలయం
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అరుదైన శివలింగం గుడిమల్లం(Gudimallam). ఇది చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం(Yerpedu mandal)లో కలదు. దీనిని క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో ఆంధ్ర శాతవాహనులు నిర్మించారు. ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో వేటకు వెళుతున్న మహా వేటగాని వలె కనిపిస్తుంది. తప్పక దర్శించుకోవాల్సిన శివాలయాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతుంటారు.
కోటప్పకొండ శివాలయం
గుంటూరు జిల్లా నరసారావు పేట(Narasaravupeta)కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటప్పకొండ(Kotappakonda)లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కడి శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కొండను ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు. అందుకే ఈ కోటప్పకొండను కాకులు వాలని కొండగా కూడా పిలుస్తారు. ఈ స్వామి వారిని దర్శించుకున్న వారి కుటుంబ జీవితంలో సిరిసంపదలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకే అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.