Subrahmanya Shasthi 2022:నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి
Subrahmanya Shasthi 2022: ఈనెల 29 మంగళవారం సుబ్రమణ్య షష్టి..ఈ రోజు నాగ పంచమి, నాగుల చవితి రోజు ఎవరికైనా పుట్టలో పాలుపోయడం కుదరకపోతే ఈ రోజు ఆ మొక్కులు చెల్లించుకోవచ్చు...ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే
Subrahmanya Shasthi 2022
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యంయే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి
శివుని రెండో కుమారుడైన కుమారస్వామే సుబ్రమణ్యస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రమణ్య స్వామి షష్టి జరుపుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవర షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు స్కంద షష్టి అని అంటారు. ఇద
Also Read: మార్గశిర మాసం ఈ ఆలయంలో చాలా ప్రత్యేకం, నేరుగా మూలవిరాట్టుకే పూజలు చేసుకోవచ్చు
కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టలేదు
కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. శివుడి స్కలనంతో జన్మించిన కుమారస్వామిని పుత్రుడిగా స్వీకరించారు. దీనివెనకున్న కథనం ఏంటంటే..ముల్లోకాలను పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుడి బారి నుంచి రక్షణ కోసం దేవతలంతా బ్రహ్మదేవుడిని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంటే " తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు కావున తనని సంహరించడం మనవల్ల కానిపని..కానీ ఈశ్వర సంభూతుడి వల్లనే మరణం ఉంటుంది' అని చెప్పాడు.
ఆ తర్వాత శివపార్వతులు ఏకాంత సమయంలో ఉండగా..శివుడి నుంచి వచ్చి ఆ తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగానదిలో విడచి పెడతాడు..ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగులు కృత్తికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు... ఆ పొదల నుంచి ఆరుముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాశం తీసుకెళ్లారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, ఆరుముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని, కార్తీకేయుడని...గౌరీశంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు... దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకారుసుర సంహారం చేయిస్తారు.
Also Read: నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభం, ఆధ్యాత్మికంగా ఈ నెల చాలా ప్రత్యేకం
వివాహం, సత్సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం
సుబ్రమణ్య స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం.ఈ రోజు భక్తులు సూర్యోదయానికి ముందు స్నానమాచరించి సుబ్రమణ్య స్వామిని దర్శించుకుని, పాలు-పండ్లు-పూలు-వెండి పడగలు-వెండి కళ్లు..మొక్కుబడుల ఆధారంగా సమర్పిస్తారు. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, సకాలంలో వివాహం కానివారు...సుబ్రమణ్య షష్టి రోజు జరిగే కళ్యాణం చేయించినా, చూసినా శుభం జరుగుతుందని పండితులు చెబుతారు. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కుమారస్వామి ఆలయాలకు కావడిలు సమర్పిస్తారు. కావడి కుండల్లో పంచదార, పాలతో నింపుతారు.ఈ రోజు నాగప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||
ఒకచేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు.