Sri Kanaka Mahalakshmi Temple: మార్గశిర మాసం ఈ ఆలయంలో చాలా ప్రత్యేకం, నేరుగా మూలవిరాట్టుకే పూజలు చేసుకోవచ్చు
Sri Kanaka Mahalakshmi Temple: విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన మహిమాన్విత తల్లే శ్రీకనకమహాలక్ష్మి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమృతమూర్తిగా పూజలందుకుంటోంది. ఈ ఆలయంలో మార్గశిరమాసం మరింత ప్రత్యేకం
Sri Kanaka Mahalakshmi Temple: బంగారం కొన్నా, వెండి కొన్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా ముందుగా కనకమహాలక్ష్మి ఆశీస్సులు అందుకోవడం ఉత్తరాంధ్ర వాసులకు ముఖ్యంగా విశాఖవాసులకు చాలా సెంటిమెంట్. గోపురం లేని ఈ ఆలయంలో భక్తులు నేరుగా అమ్మవారికే పూజలు చేసుకోవడం ఇక్కడి విశిష్టత..పైగా 24 గంటలూ ఆ ఆలయం తెరిచే ఉంటుంది. మరీ ముఖ్యంగా మార్గశిర మాసం గురువారం భక్తజనంతో కనకమహాలక్ష్మి సన్నిది కళకళలాడుతుంది
రాజుల ఇలవేల్పు: శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల ఇలవేల్పు. అమ్మవారు కొలువైన ఈ ప్రాంతంలో ఒకప్పుడు రాజుల కోటబురుజు ఉండేదట..అందుకే బురుజుపేటగా పిలుస్తారు. ఒకసారి శత్రురాజులు దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందుకు విగ్రహాన్ని బావిలో పడేశారని ఆ తర్వాత బయటకు తీసి ప్రతిష్టించాలని ఓ కథనం. మరో కథనం ప్రకారం కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. మధ్యాహ్న సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్నానమాచరించేందుకు బావి దగ్గరకు వెళ్లాడట. సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి స్వరం వినిపించింది...తాను బావిలో ఉన్నానని బయటకు తీసి ప్రతిష్టించమని చెప్పింది. తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నానని ఆ బ్రాహ్మణుడు చెప్పడంతో అమ్మ ఆగ్రహించారని...ఆ ఆగ్రహాన్ని తగ్గించేందుకు పరమేశ్వరుడు ఆమె చేతిలో ఆయుధాన్ని నిర్వీర్య పరిచి వామహస్తాన్ని ఖండించాడట. అప్పుడు ఆ తల్లి శాంతస్వరూపిణిగా మారి శంకరుడికి నమస్కరించగా..కలియుగంలో కనకమహాలక్ష్మిగా సిరులు కురిపించే తల్లిగా పూజలందుకోమని అనుగ్రహించాడని కథనం...ఈ కథనం నిజమే అనేందుకు నిదర్శనంగా అమ్మవారి మూలవిరాట్టు వామహస్తం మోచేతి వరకూ ఖండించి ఉండడం చూడొచ్చు
Also Read: నవంబరు 24 నుంచి మార్గశిరమాసం ప్రారంభం, ఆధ్యాత్మికంగా ఈ నెల చాలా ప్రత్యేకం
శక్తివంతమైన తల్లి
1912లో రోడ్డు వెడల్పు చేసేందుకు అమ్మవారి విగ్రహాన్ని 30 అడుగుల పక్కకు జరిపారు..ఆ ఏడాది విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలింది. అమ్మవారి విగ్రహం జరపడం వల్లే అలా జరిగిందని భయానికి గురైన విశాఖ వాసులు తిరిగి యథాస్థానంలో ప్రతిష్టించి పూజలందించడంతో ముప్పు తప్పిందట. మరోవైపు ఈ గుడికి పైకప్పు కట్టడానికి జరిగిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అంటే అమ్మకు అది ఇష్టం లేదని గ్రహించి ఆ తర్వాత ఆ ప్రయత్నాలను విరమించారు.
మార్గశిర మాసం ప్రత్యేకం
ఈ ఆలయంలో శరన్నరవాత్రుల వేడుకలు, మార్గశిర మాసం చాలా ప్రత్యేకం. ఐదోతనాన్ని ప్రసాదించే కనకమహాలక్ష్మికి ఏటా మార్గశిరమాసంలో మాసోత్సవాలు నిర్వహిస్తారు. సాధారణంగా అమ్మవారికి గురువారం ప్రీతికరమైన రోజు..మార్గశిర మాసంలో వచ్చే గురువారం మరింత ప్రత్యేకమైన రోజు. అందుకే ఈ రోజు ఆలయం పసుపు కుంకుమ సమర్పించే భక్తులతో నిండిపోతుంది. ముఖ్యంగా అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన, లక్ష చేమంతుల పూజ, లడ్డూల పూజ, క్షీరాభిషేకం, కలువల పూజ, లక్ష తులసిపూజ, లక్ష గాజుల పూజ, పసుపుకొమ్ములతో పూజ… ఇవన్నీ కన్నుల పండువగా జరుగుతాయి. మార్గశిర మాసోత్సవాల్లో నెలరోజులు నిత్యకల్యాణం, పచ్చతోరణంగా అమ్మవారి సన్నిధి వెలిగిపోతుంది
Also Read: మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తథ్యం
మాల ధరించవచ్చు
అయ్యప్ప మాల, కనకదుర్గ మాల, శివమాల ఉన్నట్టే కనకమహాలక్ష్మి మాత మాల కూడా ఉంది. అమ్మవారికి ఇష్టమైన మార్గశిర మాసంలో ఈ మాల ధరిస్తారు.దీక్ష చేపట్టిన భక్తులు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి, ఆకుపచ్చని మాలలను వేసుకుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు దీక్షను పాటించవచ్చ. దీక్ష విరమించే వరకు నిత్యం రెండు పూటలా తలకు స్నానమాచరించి కుంకుమపూజ చేయాలి. దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటిస్తూ మాంసాహారం, మత్తు పానీయాలు, ధూమపానానికి దూరంగా ఉండాలి. పాదరక్షలు ధరించకుండా ఒక్కపూటే భోజనం చేయాలి.