Sri Mookambika Temple : ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన అమ్మవారు, ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే మహా మేధావులవుతారు
కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాల్లో మూకాంబిక ఆలయం ఒకటి. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించటంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. ఈ ఆలయం ప్రత్యేకతలు మీకోసం..
Sri Mookambika Temple : కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది. ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించటంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది.
మాట తప్పిన శంకరులు
కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షం అయ్యారట. ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. శంకరాచార్యుల కోరిక మన్నించిన అమ్మవారు.. షరతు విధించింది. నీ వెంట వస్తాను కానీ వెనక్కి తిరిగి చూడకూడదని...అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని చెప్పింది అమ్మవారు. ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మ ఆయన్ని అనుసరించింది. అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు ఠక్కున వెనక్కు తిరిగి చూశారట. అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పి శిలగా మారిపోయంది.
శ్రీచక్రంతో పాటూ మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించారని చెబుతారు. గర్భాలయం లో ''శంకర సింహాసనం'' ఉంది. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. అప్పటి నుంచీ అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు.
అమ్మవారు కొలువైన కుడజాద్రి పర్వతం మీదనే ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలున్నాయి. కర్ణాటకను పాలించిన రాజులంతా అమ్మవారికి విశేషమైన కానుకలు సమర్పించి భక్తిశ్రద్ధలతో అర్చించారు. నగర, బెద్నూర్ రాజులకు ఈ దేవాలయమే ''రాజ దేవాలయం'' వారి యిలవేల్పు మూకాంబికయే. మహారాష్ట్ర విజయనగర ప్రభువుల పాలనలో కూడా వైభవం కొనసాగింది. ఆ తర్వాత తురుష్క పాలనలో కోట్ల రూపాయలు విలువచేసే సంపద అంతా దోపిడీకి గురైందని చెబుతారు.
Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!
ఆలయ విశిష్టత
మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని ప్రతీతి. కేరళవాసులు ఎక్కువశాతం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో వుంది. మూకాంబిక ఆలయంలో తేనెని ఉపయోగించి తయారు చేసే "పంచకడ్జాయం' అనే ప్రసాదం ప్రత్యేకం. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత, ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. ఇదంతా చూసిన చదువురాని కేరళ నివాసి ఒకడు ఆ ప్రసాదం తినాలన్న కోరికతో బావిలో దాక్కుని ఆ ప్రసాదం తిన్నాడట. ఆ తర్వాత అతడు మహా పండితుడు అయ్యాడని చెబుతారు. అందుకే ఈ ఆలయం కర్ణాటకలో ఉన్నప్పటికీ కేరళవాసులకు అపారమైన నమ్మకం. ఇక్కడ నిత్యం జరిగే అక్షరాభ్యాసాలే ఇందుకు నిదర్శనం.
Also Read: వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!
పండితులు అవడమే కాదు..ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి వ్యసనాలు అయినా దూరం అయిపోతాయని చెబుతారు. ఆ తల్లికి నివేదించిన ప్రసాదం స్వీకరిస్తే మహాపండితులు అవుతారని, అనారోగ్యం తొలగిపోతుందని విశ్వాసం. కొల్లూరులో కొలువైన ఆ అమ్మ సన్నిధి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య నెలకొని ఉంది.ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుడజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి.