Shravana Masam 2025: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవికి ఈ నైవేద్యాలు సమర్పిస్తే ..అమ్మవారి అనుగ్రహం మీ సొంతం!
Naivedyam Recipes For Shravana Masam: జూలై 25 శుక్రవారంతో శ్రావణమాసం ప్రారంభం.. ఈ నెల రోజులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలి ఇక్కడ తెలుసుకోండి..

Shravana Masam Nivedana 2025: జూలై 25 శుక్రవారం నుంచి శ్రావణమాసం మొదలైంది. ఈ నెల రోజులు తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. గుమ్మానికి తోరణాలు, దీప ధూపాలు, ప్రత్యేక పూజలతో ఇల్లు కళకళలాడిపోతుంది. శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం అమ్మవారి ఆరాధనకు అత్యంత ప్రత్యేకం. అయితే శుక్రవారం లక్ష్మీ పూజకు ఏం నైవేద్యం పెట్టాలి? శ్రావణమాసంలోనే కాదు లక్ష్మీదేవి పూజ కొందరు ప్రతి శుక్రవారం చేస్తారు. ఈ సమయంలో ఏ పదార్థాలు నివేదిస్తే అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు? ఈ వివరాలు లలితా సహస్రంలో శ్లోకం రూపంలో స్పష్టంగా ఉన్నాయి
గుడాన్నప్రీతి మానసా
గుడం అంటే బెల్లం. నిత్యపూజలో కూడా బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు. బెల్లం నైవేద్యంగా పెడితే కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. బెల్లంతో చేసిన అన్నం అంటే అమ్మవారికి ప్రీతి. బెల్లానికి నిలువ దోషం ఉండదు అందుకే బెల్లం-బియ్యంతో పరమాన్నం చేసి శ్రీ మహాలక్ష్మికి నివేదిస్తారు.
స్నిగ్ధౌదన ప్రియా
స్నిగ్ధ అంటే తెల్లని - ఓదనం అంటే అన్నం... తెల్లటి కొబ్బరి అన్నాన్ని చేసి అమ్మవారికి నివేదించవచ్చు
పాయసాన్నప్రియా
పాలు - బియ్యం కలపి వండిన పాయసాన్నం అంటే అమ్మవారికి మాహా ప్రీతి. దీనినే క్షీరాన్నం అంటారు
మధుప్రీతా
మధు ప్రీతి అంటే తేనె లాంటి తియ్యని పదార్థాలను ఇష్టపడే అమ్మ అని ఆంతర్యం. అందుకే శుక్రవారం గారెలు చేసి తేనెలో ముంచి అమ్మకు నివేదిస్తారు
దద్ధ్యన్నాసక్త హృదయా
దధి అంటే పెరుగు - అన్నం- ఆసక్త అంటే ఇష్టం చూపేది- హృదయా అంటే మనసు కలిగినది. అంటే పెరుగుతో చేసిన పదార్థంపై ఇష్టం కలిగినది అని అర్థం.
ముద్గౌదనాసక్త హృదయా
ముద్గ అంటే పెసలు. పెసలతో వండిన అన్నమంటే లక్ష్మీదేవికి ప్రీతి. అందుకే పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి నివేదించవచ్చు లేదంటే పెసరపప్పు పాయసం చేసి నివేదించవచ్చు
హరిద్రాన్నైక రసికా
పసుపు - అన్నం.. పులిహోర లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరకీ పంచి పెడితే ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం.
సర్వౌదనప్రీతచిత్తా (కదంబం)
సర్వోదనప్రీత అంటే వివిధ రకాల కూరగాయలతో కలసి వండిన అన్నం. దీనినే కదంబం అంటారు. కూరగాయలను కడిగి ముక్కలుగా కట్ చేసి బియ్యం, కందిపప్పు కడిగి ఉడికించాలి. కూరగాయల ముక్కలన్నీ ఉడికించాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ పోపు , పచ్చి మిర్చి, కరివేపాకు పోపు వేసి ఉడికిన కూరగాయల ముక్కలు వేయాలి. ఆ తర్వాత టమోటా వేసి మగ్గిన తర్వాత అందులో చింతపండు గుజ్జు, బెల్లం పొడి వేసి కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు బియ్యం, కందిపప్పు మిశ్రమాన్ని జోడించాలి కాసేపు స్టౌ పై ఉంచాలి. కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి నేతిని జోడించి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి.
ఇవి నైవేద్యంగా సమర్పిస్తేనే అమ్మవారి కరుణం లభిస్తుందనే ప్రచారాలను నమ్మవద్దు. మీరు చేసే పూజలో, సమర్పించే నివేదనలో భక్తి ప్రధానం. వండే ఆహారంలో భక్తి కలిపినప్పుడే అది ప్రసాదంగా మారుతుంది
లక్ష్మీ గాయత్రి మంత్రం
ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్






















