Spirituality: అష్టకష్టాలు పడ్డాం అంటారు కదా, అవేంటో తెలుసా అసలు!
Spirituality: అష్టకష్టాలు అనే మాట వినని వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందేమో కదా..ఇంతకీ అవేంటో తెలుసా మరి...
Asta Kastalu: నిత్యం మనం వాడే పదాల్లో చాలావాటికి పూర్తిస్థాయిలో అర్థం తెలియకపోయినా వాడేస్తుంటాం. ఆ మాట విన్నవారికి కూడా అర్థం తెలియకపోయినా ఉద్దేశం మాత్రం అర్థమవుతుంది. అలాంటి పదాలో ఒకటి అష్టకష్టాలు. ఈ మాట అనని వారు, వినని వారు దాదాపు ఉండరు.జీవితంలో కష్టాలనేవి ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిపడుతుంటాయి. అలాంటప్పుడు వాటిని తట్టుకుంటూనే ముందుకు అడుగేయాల్సిందే. అయితే ఒక్కోసారి కష్టాలన్నీ ఒకేసారిగా వచ్చి మీదపడుతుంటాయి. అలాంటప్పుడు వాటిని ఎదిరించి నిలవడం మరింత కష్టమవుతుంది. సహనానికి పరీక్షగా మారుతాయి. పట్టి కుదిపేస్తుంటాయి. జీవితంపై నిరాశ నిస్పృహని కలిగిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పొరపాటున పలకరించినా చాలు..అష్టకష్టాలు పడుతున్నాం అంటారు. అసలు అష్టకష్టాలంటే ఏంటో తెలుసా..వాస్తవానికి అవన్నీ ఎదురైతే నిజంగా ఎదుర్కోగలమా...
Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!
ఆ అష్టకష్టాలు ( ఎనిమిది కష్టాలు) ఏంటో చెప్పే శ్లోకం
ఋణం చయాచ్నా వృద్ధత్వం జారచోర దరిద్రతా !
రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టాః ప్రకీర్తితాః !!
అష్టకష్టాలు
1. అప్పు
అష్టకష్టాల్లో మొదటిది అప్పు తీసుకోవడం. అప్పు తీసుకునే దుస్థితి వచ్చిందంటే ఆర్థికంగా బలంగా లేవనే కదా అర్థం. ధనమేరా అన్నిటికీ మూలం అన్నట్టు..ధనం లేకపోవడాన్ని మించిన సమస్యేముంటుంది.
2. యాచన- అడుక్కోవడం
జానెడు పొట్ట కోసం గుప్పెడు మెతుక్కులు అడుక్కునే స్థితి వచ్చిందంటే అంతకు మించిన కష్టం ఏముంటుంది. కోట్లకు పడగలెత్తినా, పూట కూలికోసం పనిచేసినా పొట్టనింపుకునేందుకే..ఆ అవకాశం లేనివారి కన్నా దురదృష్టవంతులెవరుంటారు
3. ముసలితనం
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అల్లరి..యవ్వనంలో దూకుడు..గృహస్థులయ్యాక బాధ్యతలు..ఇలా పుట్టినప్పటి నుంచీ మలిసంధ్యలో అడుగుపెట్టేవరకూ క్షణం తీరిక లేకుండా గడిపిన జీవితం ముసలితనం రాగానే ఒక్కసారిగా పూర్తిగా ఖాళీ అయిపోయాం అనిపిస్తుంది.ఏ పనీ చేయరు, ఎక్కడికీ వెళ్లలేరు, ఇప్పుడున్న ఉరకల పరుగుల జీవనంలో కనీసం పలకరించే నాధుడే ఉండడు..ఇంతకన్నా కష్టం ఏముంటుంది..
Also Read: ఇలాంటి కల వస్తే ఆరునెలల్లో చనిపోతారట!
4. వ్యభిచారం
కుటుంబ కష్టాలు, ఆర్థిక నష్టాలు, మోసపోయిన మనసు, ఖరీదైన జీవితం.. వీటిలో కారణం ఏదైనా కావొచ్చు... చాలామంది మహిళలు ఈ కూపాల్లోకి కావాలని అడుపెట్టేవారు కొందరైతే..అందులోకి నెట్టబడేవాళ్లు ఇంకొందరు. తెలిసో తెలియకో అందులో అడుగుపెడితే చాలు..అక్కడి నుంచి ఎప్పటికీ బయటపడలేని అగాథంలోకి కూరుకుపోతారు...తనకంటూ ఓ కుటుంబం, గౌరవం కోల్పోవాల్సి వస్తుంది..ఇది కదా కష్టం అంటే..
5. చోరత్వం-దొంగతనం చేయడం
64 కళల్లో చోర కళ కూడా ఉంది. కానీ సరదాగా చెప్పుకుంటే ఇది కళ అయితే..వాస్తవంగా మాట్లాడుకుంటే కష్టం అనే చెప్పాలి.
6. దారిద్య్రం-పేదరికం
నిత్య దారిద్ర్యం అనుభవించే వారెందరో ఉన్నారు. కనీస అవసరాలైన తిండి, బట్ట,గూడు కూడా ఉండదు. కానీ ముప్పూటలా తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నప్పటికీ ఏవో కష్టాలు అనుభవిస్తున్నాం అనుకున్నవారంతా..అసలు కష్టం ఏంటో, బతుకు ఎంత భారమో ఇలాంటి వారిని చూస్తే తెలుస్తుంది.
7. రోగం
కోట్ల సంపాదన ఉండి ఏ లాభం..ఆరోగ్యం లేనప్పుడు. డబ్బుతో వైద్యాన్ని కొనుక్కోవచ్చేమో కానీ అది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. జీవచ్ఛవంలా మంచంలో పడిఉన్నవారిని అడిగితే తెలుస్తుంది కష్టం అంటే ఏంటో..
8. ఎంగిలి భోజనం
ఎంగిలి తినడం నేటి జనరేషన్ కి సర్వసాధారణ విషయం. ఇంకా చెప్పాలంటే అదో ట్రెండ్ అని ఫిక్సైపోయారు. ఎవరైనా ఎంగిలి తినను అని చెబితే వింతగా చూసే పరిస్థితులున్నాయి. ఏదో ఆ మధ్య కరోనా భయానికి కాస్త తగ్గినా.. మళ్లీ వైరస్ భయం తగ్గాక ఎప్పటిలా ఫాలో అయిపోతున్నారు. వాస్తవానికి ఎంగిలి భోజనం అంటే అష్టకష్టాల్లో భాగమే అని చెబుతారు పెద్దలు.
ఇవే కాకుండా మరికొన్నింటిని కూడా అష్టకష్టాల జాబితాలో చేర్చారు...
దేశాంతరగమనం , భార్యావియోగం, ఆపత్కాలబంధుదర్శనం, ఉచ్చిష్ఠభక్షణం
శతృస్నేహం, పరాన్నప్రతీక్షణం, భంగం, దారిద్ర్యం
ఇవి కూడా అష్టకష్టాలే
దాస్యం, దారిద్ర్యం,భార్య లేకుండుట, స్వయంకృషి
యాచించుట, అడిగిన లేదనుట, ఋణం, దారి తప్పుట
అయితే ఎంతటి కష్టమైనా మన సంకల్పబలంతో పాటూ భగవంతుడి అనుగ్రహం ఉంటే తీరిపోతుందంటారు. అందుకే ఇష్టదేవతారాధన చేయాలని చెబుతారు పండితులు.