Deepa Danam In Karthika Masam: కార్తీకమాసంలో దీపదానం ఎలా చేయాలి - ఎన్ని వత్తుల దీపాన్ని దానం ఇవ్వాలి!
Deepa Danam In Karthika Masam: కార్తీకమాసంలో దీపదానం చేస్తుంటారు. అయితే ఎవరికి తోచినట్టు వాళ్లు దీపాన్ని దానం ఇచ్చేస్తారు. దీపదానం విశిష్టత ఏంటి? అసలు ఎలా దానం ఇవ్వాలో తెలుసా?
Karthika Masam Deepa Danam : దీపదానం ఏ నెలలో అయినా చేయొచ్చు..కార్తీకమాసంలో చేస్తే విశిష్టమైన ఫలితం పొందుతారని పండితులు చెబుతారు. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నరోజు పౌర్ణమి కావడంతో ఈనెలకు కార్తీకమాసం అనే పేరొచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం..అందుకే ఈ మాసంలో దీపదానం అత్యుత్తమం.
ఈ నెలంతా ఇంట్లో, తులసి మొక్క దగ్గర, ఉసిరి చెట్టు కింద, ఆలయాల్లో దీపారాధన చేస్తుంటారు. సూర్యోదయానికి ముందు మాత్రమే కాదు సంధ్యాసమయంలోనూ దీపారాధన చేస్తుంటారు. అయితే దీపాలు వెలిగించడమే కాదు..దీపదానం చేయడం పుణ్యఫలం.
పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణ దానం ఇలా వివిధ రకాల దానాల గురించి ప్రస్తావన ఉంటుంది...వాటిలో దీపదానం ఒకటి. ఈ దానం ఎలా చేయాలంటే...బియ్యంపిండి లేదా గోధుమపిండిని ఆవుపాలతో కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో దీపం వెలిగించి దానం ఇవ్వాలి.
Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!
బియ్యంపిండితో దీపం చేయనివారు మట్టి ప్రమిదలో దీపాన్ని , స్వయంపాకం, కొంత దక్షిణగా పెట్టి దీపాన్ని దానం ఇవ్వొచ్చు. దానం ఇచ్చేముందు పసుపు, కుంకుమ,పూలతో దీపాన్ని అందంగా అలంకరించి ఇవ్వాలి. సంధ్యాసమయంలో దీపదానం చేస్తే మంచిది. ఇచ్చే స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో బంగారు వత్తిని వేసి దీపదానం చేయొచ్చు.
దీపదానం సమయంలో సంకల్ప పూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా పంచ మహాపర్వాలు..అంటే.. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఉండే ఐదు రోజుల్లో దీపదానం అత్యుత్తమం.
Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!
ఈ శ్లోకాన్ని చెబుతూ దీపదానం చేయాలి
సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం
దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ
సర్వ జ్ఞాన స్వరూపమైన, సర్వ సంపదలు, ఐహిక సుఖాలు కలిగించే ఈ దీపాన్ని దానం ఇస్తున్నాను. దీని వల్ల ఎప్పుడూ శాంతి కలుగుగాక అని అర్థం.
స్త్రీలు, పురుషులు, విద్యార్థులు..ఎవరైనా కానీ దీపదానం చేయొచ్చు.
వ్యాసమహర్షి చెప్పిన దీపదాన మహిమ ఇదే!
కార్తీక శుద్ధ ద్వాదశి తులసికోట దగ్గర అయినా, శివాలయం, వైష్ణవఆలంయంలో అయనా దీపదానం చేయాలి. ఓ వత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. నాలుగు వత్తులు వేస్తే రాజు, పది వత్తులు వేస్తే విష్ణుసాయుజ్యం, వేయివత్తులు వేస్తే విష్ణురూపుడు, ఆవునేతితో దీపం వెలిగించి ఇస్తే జ్ఞానం - మోక్షం కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి పెరుగుతుంది. ఇప్పనూనె, అడవినూనె, ఆముదం, అవిసెనూనె,ఆముదం, బర్రె నెయ్యితో దీపారాధన తగదు..ఒకవేళ వీటితో దీపారాధన చేయాల్సి వస్తే వాటిలో ఆవునెయ్యిని కలిపితే దోషం ఉండదు. ఈ దీపదానములవలననే ఇంద్రుడు పదవులు పొందాడు.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేసినా, దీపాల వరుస చూసినా సకలపాపాలు నశిస్తాయి. ఈ దీపదాన మహిమ విన్నవారు, చదివిన వారు మోక్షం పొందుతారు.