Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్టత తెలుసా!
మన దేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాల్లో కట్రా వైష్ణోదేవి ఆలయం ఒకటి. ఇది జమ్మూ కాశ్మీర్‌లో మంచుకొండల్లో ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే 'వైష్ణోదేవి' ఆలయం విశిష్ఠత ఏంటో తెలుసా....
Katra Vaishnodevi: ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ఏడాది పొడవునా అమ్మవారి ఆలయం తెరిచే ఉనప్పటికీ మార్చి నుంచి అక్టోబర్ వరకూ ఉత్తమ సమయం.
గుహలో ప్రయాణం
వైష్ణోదేవి విగ్రహం ఉన్న చోటుకి వెళ్లాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాలి. అయితే ఆ దూరాన్ని తగ్గించేందుకు మరో రెండు గుహల్లో అధికారులు దారులను ఏర్పాటు చేశారు. వైష్ణోదేవి ఆలయం ఉన్న కొండ సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. వైష్ణో దేవి ఆలయం ఉన్న గుహలు కొన్ని లక్షల ఏళ్ల కిందటే ఏర్పడ్డాయట. అలాగే సుమారుగా 10 లక్షల ఏళ్ల కిందటే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుని సూచన మేరకు పాండవులు వైష్ణో దేవిని పూజించారట. అందుకే వారు ఆ యుద్ధంలో గెలిచారని విశ్వాసం.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది
వైష్ణోదేవిగా అవతరించిన దుర్గమ్మ
భైరవుడు అనే ఓ రాక్షసున్ని సంహరించిన తర్వాత దుర్గాదేవే వైష్ణో దేవి రూపంలో ఇక్కడ అవతరించిందని చెబుతారు. అలాగే ఆ రాక్షసుడి తల గుహ నుంచి లోయలోకి పడిపోయిందని స్థలపురాణం చెబుతోంది. రాక్షసుని దేహం కూడా అక్కడే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహలో ఇప్పటికీ ఉందంటారు. అందుకే ఆలయం సమీపంలో ఉన్న కొన్ని గుహలను ఎప్పుడూ మూసే ఉంచుతారు.కొండ ప్రాంతంలో ఉండే వైష్ణో దేవి ఆలయానికి చేరుకోవాలంటే కాలి నడక మార్గం, గుర్రపు స్వారీ, పల్లకి లేదా హెలికాప్టర్ సర్వీస్‌లలో దేన్నయినా ఉపయోగించుకోవచ్చు.
ఉత్తరాదివారి కొంగుబంగారం
ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి... ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి అని చెబుతారు పండితులు. అప్పట్లో అసురుల బాధనుంచి భూలోకాన్ని రక్షించి, ధర్మాన్నికాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుంచి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు. వారి సంకల్పబలంతో అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని...ఆ తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేశారు. తన జన్మం వెనుకున్న ఆంతర్యాన్ని నెరవేర్చుకుని భైరవుడనే రాక్షసుడి సంహారం అనంతరం అమ్మవారు త్రికూటపర్వతంపై గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెబుతారు.
Also Read: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
కాట్రా నుంచే వెళ్లాలి
జమ్మూ రాష్ట్రంలోని కట్రావరకూ రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. అక్కడనుండి యాత్ర మొదలయ్యే మెయిన్ గేట్ వరకూ ఆటోలో వెళ్లొచ్చు . అక్కడనుంచి మాత్రమే డోలీ యాత్ర మొదలవుతుంది.