Shani Pradosh 2023: ఆషాఢ శనివారం ప్రదోష సమయం, పూజా విధానం, విశిష్టత తెలుసా.?
Shani Pradosh 2023: చవితి తిథిని సంకష్ట చతుర్థిగా జరుపుకున్నట్లే, త్రయోదశి తిథి రోజు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. జూలై 1వ తేదీ ఆషాఢ శని ప్రదోష వ్రతం శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకుందాం.
Shani Pradosh 2023: ప్రదోష వ్రతాన్ని అత్యంత పవిత్రమైన, కోరికలను తీర్చే వ్రతంగా గ్రంధాలలో వర్ణించారు. ప్రదోష వ్రతాన్ని ప్రతినెలా త్రయోదశి తిథి ఉన్న రోజు ఆచరిస్తారు. ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలలో చెప్పారు. ఈసారి ప్రదోష వ్రతాన్ని జూలై నెల మొదటి రోజున అంటే జూలై 1వ తేదీన శుభ సంయోగంతో జరుపుకొంటారు. ఈ ప్రదోష వ్రతం శనివారం నాడు వచ్చింది కాబట్టి దీనిని శని ప్రదోష వ్రతం అంటారు. సంతానం కలగాలనే కోరికతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శని ప్రదోష వ్రతం శుభ సమయం, పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకుందాం..
ALso Read: ఈ రోజు శని త్రయోదశి, పాటించాల్సిన కొన్ని నియమాలివే!
శని ప్రదోష వ్రత శుభ యోగం
శని ప్రదోష వ్రతం రోజున మూడు అత్యంత పవిత్రమైన యోగాలు ఏర్పడతాయని వేద పంచాంగంలో చెప్పారు. ఈ రోజు శుభ యోగం, శుక్ర యోగం, రవియోగం కలయిక ఉంటుంది. శుభ యోగం రాత్రి 10.44 గంటల వరకు ఉంటుంది, ఆపై శుక్ర యోగం ప్రారంభమవుతుంది. మరోవైపు, రవి యోగం మధ్యాహ్నం 3:04 నుంచి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 05:27 వరకు ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం, ఈ పవిత్రమైన కలయికల సమయంలో భగవంతుడిని పూజించడం విశేష ప్రయోజనాలను ఇస్తుంది.
శని ప్రదోష శుభ ముహూర్తం
ఆషాఢ మాసం శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి జూలై 1వ తేదీ శనివారం మధ్యాహ్నం 01:16 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది జూలై 1వ తేదీ రాత్రి 11.07 గంటలకు ముగుస్తుంది. ప్రదోష సమయంలో భగవంతుడిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. ఈ రోజు రాత్రి 7:23 నుంచి 9:24 వరకు శివపూజకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో పరమేశ్వరుడిని తప్పకుండా పూజించాలి.
శని ప్రదోష వ్రతం ప్రాముఖ్యం
ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల పరమశివుడు ప్రసన్నమవుతాడు. ఆయన అనుగ్రహాన్ని మీపై కురిపిస్తాడు. అలాగే సంతానం లేని వారు కూడా శని ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతాన భాగ్యం పొందుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుని అనుగ్రహంతో సంతానం కలుగుతుందని చెబుతారు.
Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది
శని ప్రదోష పూజా విధానం
- ప్రదోష కాలం అంటే శని ప్రదోష వ్రతం రోజున సాయంత్రం వేళ పూజకు శుభప్రదంగా భావిస్తారు.
- సూర్యాస్తమయానికి ఒక గంట ముందు భక్తులు స్నానాలు చేసి పూజకు సిద్ధం కావాలి.
- స్నానం తర్వాత, సాయంత్రం శుభ ముహూర్తంలో పూజ ప్రారంభించండి.
- ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలం మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయండి.
- తర్వాత శివలింగానికి చందనం పూసి బిల్వపత్రం, పూలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని సమర్పించాలి.
- అనంతరం శాస్త్రోక్తంగా శివ పూజ చేసి, మహాదేవునికి హారతి ఇవ్వాలి.
ఈ రాశి వారికి చాలా ప్రత్యేకం
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం నాలుగు రాశుల వారు సప్తమ శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. కుంభం, మకరం, కర్కాటకం, వృశ్చిక రాశి జాతకులు ని ప్రదోష వ్రతం రోజున శనైశ్చరుడితో పాటు, పరమ శివుడిని పూజించడం ద్వారా విశేష ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజున శనికి ఆవనూనె నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తగ్గుతాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.