Sangameshwara Temple: ఎనిమిది నెలల పాటు గంగమ్మ ఒడిలోనే సంగమేశ్వరుడు - జంగమయ్యకు ఒడ్డునుంచే హారతి!
Sangameshwara Temple: శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన కర్నూలు జిల్లాలోనే మరో ప్రసిద్ధి చెందిన ఆలయం సంగమేశ్వర దేవాలయం. ఏడాదికి 8 నెలల పాటూ నీటిలోనే ఉండే ఈ శివయ్య ఆలయానికి ఎన్ని విశిష్టతలున్నాయో..
Sangameshwara Temple: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరంలో ఉంది సంగమేశ్వర స్వామి దేవాలయం. వేలఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఏడాదిలో దాదాపు 8 నెలల పాటూ గంగమ్మ ఒడిలోనే ఉంటుంది. ఎగువ నుంచి కురిసే భారీ వర్షాలకు వరదనీరొచ్చి కృష్ణానదిలో చేరుతుంది. ఈ ఏడాది కూడా భారీగా వరదనీరు చేరడంతో ఎప్పటిలానే సంగమేశ్వరఆలయం నీటమునిగింది. సంగమేశ్వరుడు కృష్ణానదిలో నిరంతర అభిషేకం చేయించుకుంటున్నాడా అన్నట్టుంది ఈ దృశ్యం. ఒడ్డునుంచే హారతి ఇస్తున్నారు పూజారి...
Also Read: ఆగష్టు 09 నాగపంచమి రోజు పుట్టలో పాలుపోసే ముహూర్తం - చదువుకోవాల్సిన శ్లోకాలివే!
ధర్మరాజు ప్రతిష్టించిన వేప శివలింగం
ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం ఇది. సప్తనదులు సంగమించే ప్రదేశంలో ఉన్న సంగమేశ్వరాలయంలో పూజలందుకుంటున్న శివలింగం అత్యంత విశిష్టమైనది . వేల ఏళ్లక్రితం ధర్మరాజు ప్రతిష్టించిన వేప శివలింగం ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడి సూచన మేరకు ధర్మరాజు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఏడు నదులు సంగమించే సంగమేశ్వరంలో శివపూజ చేయమని శ్రీకృష్ణుడు చెప్పడంతో..ఇక్కడ వేపచెట్టును నరికి శివలింగం చేసి పూజించాడట ధర్మరాజు. వేలఏళ్లక్రితం ప్రతిష్టించిన ఇక్కడ శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. సంగమేశ్వరాలయం మాత్రమే కాదు.. మహా మునులు తపస్సు చేసిన ప్రదేశం ఇది...అగస్త్యుడు , విశ్వామిత్రుడు లాంటి మహర్శులు ఇక్కడ తపస్సు ఆచరించారని చెబుతారు.
Also Read: ఏటా శ్రావణమాసంలో నాగపంచమి ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది!
ఈ సంగమేశ్వరం ప్రదేశంలో పితృదేవతలకు తర్పణాలు విడిచినా, అస్తికలు కలిపినా వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని స్కాందపురాణంలో ఉంది. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, మలపహరిని, భవనాసిని, భీమరది వంటి ఏడు నదులు కలసి ప్రవహించే ఈ ప్రదేశంలో స్నానమాచరిస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ నదిలో స్నానమాచరించిన తర్వాత ఒడ్డున కూర్చుని గాయత్రి మంత్ర జపం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందంటారు.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని 200 ఏళ్ల క్రితం స్థానిక ప్రజలంతా కలసి పునర్నిర్మించారి చెబుతారు. ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించి ఉండేవి కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం అందరూ దర్శించుకుంటున్న ప్రధాన ఆలయం సాదాసీదాగా ఉంటుంది. ముఖ మండపై పూర్తిగా శిథిలమైపోయింది. అంతరాలయం మాత్రమే దర్శమనిస్తోంది. గతంలో లలితాదేవి, వినాయకుడికి వేర్వేరు ఆలయాలుండేవి..కానీ ఆ ఆలయాలు శిథిలం అయిపోవడంతో ఈ విగ్రహాలను తీసుకొచ్చి శివుడి సమీపంలోనే దర్శనానికి ఉంచారు. ఇక ఉపాలయాల్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలను కర్నూలు జిల్లాలో వివిధ ఆలయాలకు తరలించారు.
కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే సంగమేశ్వరం చేరుకోవచ్చు. తెలంగాణ నుంచి వెళ్లేవారు అయితే మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకూ బస్సు...అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం వెళ్లొచ్చు. ప్రస్తుతం ఈ ఆలయం నీటిలో మునిగిఉంది...మళ్లీ శంకరుడిని దర్శించుకోవాలంటే...మళ్లీ 8 నెలల వరకూ ఆగాల్సిందే...
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః
Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!