Ravi Shankar: నువ్వే రాజు - నువ్వే మంత్రి… ఎవరికోసం నువ్వు మారవద్దు: శ్రీశ్రీ రవిశంకర్
నువ్వు ఆది, నువ్వు అరుదైన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకం, నువ్వొక అద్భుతం, నువ్వొక అపూర్వసృష్టివి...నీలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కానీ అవేమీ గుర్తించకుండా.... ఎవరికోసమో నిన్ను నువ్వు మార్చుకుంటావా....!
“అతనికి అరటిపండంటే ఇష్టమని తెలిసి నేను అరటిపండుగా మారిపోయాను” అంది రేగుపండు. కొన్ని నెలలకు అతని ఇష్టం మారిపోయింది. అందుకని నారింజపండుగా మారాను. మారాక నేను చేదుగా ఉన్నానని అన్నారు. అందుకని ఏపిల్ పండుగా మారిపోయాను. అప్పుడు ద్రాక్షపండ్లకోసం వెదికారు అని చెప్పుకొచ్చిన రేగుపండు.... “వాళ్లలా అన్నారని, వీళ్లి అన్నారని, అందరికోసం ఏన్నోసార్లు మారిపోతూవచ్చాను. ఎన్నిసార్లు మారానంటే, ఇపుడు అసలు నేనెవరో నాకే తెలియటం లేదు. ఇంతకన్నా నేను రేగుపండుగానే ఉండి... నన్ను ప్రేమించే, నన్ను ఇష్టపడేవారికోసం ఎదురుచూసి ఉంటే బాగుండేదనిపిస్తోంది అన్నది.
ఎవరో కొంతమంది నిన్ను నిన్నుగా అంగీకరించనంత మాత్రాన నీ సహజ స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీగురించి నువ్వు మంచిగా ఆలోచించాలి... నీ గురించి నువ్వెలా భావిస్తున్నావ్ అనేదానిపైనే ఆధారపడి ప్రపంచం నిన్ను బేరీజువేస్తుంది. కేవలం గుర్తింపు పొందటం కోసం నీ స్థాయిని ఎప్పుడూ తగ్గించుకోవద్దు. అనవసర బంధాలు, సంబంధాల కోసం నీ ఆత్మను, నీ సహజస్వభావాన్ని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. అలాచేసిన రోజు... నీ గొప్పతనాన్ని- నీ ప్రత్యేకతను... తాత్కాలికమైన గుర్తింపుకోసం అమ్మేసుకున్నావని... భవిష్యత్ లో పశ్చాత్తాపపడాల్సివస్తుంది.
అంతెందుకు జాతిపిత మహామత్మా గాంధీని అంటే చాలామందికి ఇష్టం ఉండదు. చాలామంది అంగీకరించలేదు కూడా. కానీ ఆయనపని ఆయన మానేయలేదు. అంటే... నిన్ను నిన్నుగా అంగీకరించని వాళ్లు నీ వాళ్లు కాదు. నీ ప్రపంచంలో వాళ్లకి స్థానం లేదు. మీలో ప్రతీఒక్కరికీ ఒక ప్రపంచం ఉంది. మీరు మీరుగా ఉండటం ద్వారా ఆ ప్రపంచానికి మీరే రాజు.... మీరే రాణిగా ఏలుతున్నారు.
సృష్టి నియమాలంటూ కొన్ని ఉంటాయి... నీరు చేసే పనిని కిరోసిన్, నూనె చేయలేవు. అదే విధంగా రాగి చేసే పనిని బంగారం చేయలేదు. చిన్నగా సున్నితంగా ఉండటంవల్ల చీమ కదలగలుగుతోంది. బలంగా కఠినంగా ఉండటంవల్ల చెట్టు స్థిరంగా నిలబడగలుగుతోంది. ఈ సృష్టిలో ప్రతీదీ, ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేకతతో భూమ్మీద అడుగుపెట్టారు. ప్రతీ ఒక్కరి ఉనికికీ ఓ ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాన్ని పొందడం అనేది.. తమ ప్రత్యేకతను నిలుపుకోవడంపై ఉంది. నువ్వు నువ్వుగా ఉన్నప్పుడే ఆ ప్రయోజనాన్ని పొందగలవని అర్థం.
ఒకసమయంలో ప్రపంచానికి కృష్ణుని అవసరం వచ్చినపుడు కృష్ణుడు వచ్చాడు...క్రీస్తు అవసరమైనప్పుడు క్రీస్తు జన్మించాడు. అలాగే... మీ అవసరం భూమ్మీద ఉంది కాబట్టే మీరు ఇక్కడున్నారు. అందుకే ఎంద బాగా ఉండగలమో అంతబాగా ఉండాలి. ఈ ప్రపంచ చరిత్రలో ఇంతకుముందు నీలాంటివారు ఎవ్వరూ లేరు. రాబోయే అనంతకాలంలో నీలాంటివారు మరొకరు ఉండరు. సృష్టికి నువ్వంటే ఎంతో ప్రేమ ఉంటుంది. నిన్నెంతగా ప్రేమించిందంటే, నిన్ను తయారుచేశాక ఆ మూసను పగులకొట్టేసింది. అందుకే ఆ తర్వాత నీలాంటి వాళ్లు మళ్లీ పుట్టరు.
మరొక్కసారి చెబుతున్నాం... నువ్వు ఆది, నువ్వు అరుదైన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకం, నువ్వొక అద్భుతం, నువ్వొక అపూర్వసృష్టివి... నీలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కానీ అవేమీ గుర్తించకుండా.... ఎవరికోసమో నిన్ను నువ్వు మార్చుకుంటావా...!