Sri Sri Ravi Shankar On Life: ఒంటరితనం పోగొట్టుకోవాలంటే ఒంటరిగానే ఉండాలి: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్
ఒంటరితనం అంటే ఏంటి? తాము ఒంటరి అనుకుంటున్నవాళ్లంతా నిజంగానే ఒంటరిగా ఉన్నారా? ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఒంటరితనం గురించి ఏం చెప్పారు?
నిన్నెవరూ ప్రేమించటం లేదనే ఆలోచన నీకు వస్తే... నువ్వు ఖచ్చితంగా ప్రేమను పొందుతున్నావనే అర్థం. భూమి నిన్ను ప్రేమిస్తోంది కాబట్టే నిన్ను స్థిరంగా నిలిపి ఉంచుతోంది. భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తే దాని ప్రేమ. గాలి నిన్ను ప్రేమిస్తోంది కనుకే....నువ్వు నిద్రపోతున్నా సరే నీ ఊపిరితిత్తులలోకి వస్తూపోతూ ఉంది. దైవం నిన్ను అత్యధికంగా, ప్రగాఢంగా ప్రేమిస్తోంది. ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడినని భావించవు.
ఎవరో ఒకరు నీ పక్కన ఉన్నంత మాత్రాన వాళ్లు నీ ఒంటరితనాన్ని దూరంచేయలేరు. అలా చేసినా అది కేవలం తాత్కాలికమే అవుతుంది. ఎంతమందితో కలిసి ఉన్నప్పటికీ నువ్వింకా ఒంటరితనాన్ని అనుభవిస్తూనే ఉండి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఒంటరితనాన్ని పోగొట్టుకోవడమనేది ఒంటరిగా ఉండటం ద్వారానే సాధ్యమవుతుంది. కొద్దిసేపు ఒంటరిగా కూర్చోవటం నీకు సౌకర్యంగా అనిపించినప్పుడు, ఒంటరిగా ఉన్నానని భావించవు. ఒంటరిగా ఉన్నానని ఎప్పుడైతే అనుకోవో, అప్పుడు నీచుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచి ఇవ్వగలవు. వాస్తావానికి నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను చూసేవారికి కూడా బోర్ కొడుతుంది. దానివల్ల మరింత ఒంటరిగా ఫీల్ అవుతారు. అయినా నీతో నువ్వు ఉండడానికి నీకే బోర్ కొడితే...నీ పక్కన ఉన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ..నిన్ను చూసేవారికి ఎంత చికాకుగా ఉంటుందో తెలుసా? అందుకే ఎవరి స్థితిని వారు ఎంజాయ్ చేస్తే... చుట్టుపక్కల వారికి కూడా చికాకు ఉండదు.
సాధారణంగా ఒంటరి తనాన్ని భరించలేక పార్టీలు, ఉత్సవాలు, వేడుకలకు పరుగులు తీస్తుంటారు. అంటే నీతోపాటూ ఒంటరితనాన్ని కూడా తీసుకెళుతున్నారన్నమాట. అదే నువ్వు ఆత్మ సాన్నిధ్యంలో ఒంటరిగా ఉండగలిగితే, పార్టీలు, ఉత్సవాలు నీచుట్టూ చేరుతాయి. ఎప్పుడూ ఎవరో ఒకరితో కలిసి ఉండేవారు ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఉండేవాళ్ళేమో ఎవరో ఒకరితో కలిసి ఉండాలని అనుకుంటారు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది పదునైన కత్తి అంచులాంటిది. అది కేవలం ఆత్మలో మాత్రమే దొరికేది. నీ క్యాలెండర్లో కొంచెం సమయాన్ని..అంటే...ఏడాదికి ఓ వారం రోజులైనా నీతో నువ్వు గడిపేందుకు కేటాయించు. నీ సొంత ఆలోచనలను, భావాలను గమనిస్తూ వారం రోజులైనా గడిపినప్పుడు నిశ్శబ్దం అంటే ఏంటో నీకు తెలుస్తుంది.
ఉదయం లేచిన దగ్గర్నుంచీ మనుషులతోనే కలసి ఉంటున్నావు. నీ మనసు ప్రాపంచికమైన ఆలోచనలలో చిక్కుకుపోయి ఉంటోంది. కాబట్టి రోజూ ఏదో ఒక సమయంలో కొద్ది నిమిషాల పాటు ఒక్కడివే కూర్చుని నీ హృదయపు లోతుల్లోకి వెళ్ళిపో. అప్పుడిక ఒంటరిగా ఉండాల్సివచ్చినా, ఒంటరితనాన్ని అనుభవించవు. జీవితాన్ని చక్కగా జీవించు. ప్రజలకు ఉపయోగపడేలా నీ జీవితం ఉన్నప్పుడు, నీ గురించి శ్రద్ధ తీసుకోవడానికి కోట్లాది ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకు మదర్ థెరెసా, ఆచార్య వినోబాభావే - వీరిద్దరూ చాలాకాలం అనారోగ్యంతో మంచంపైనే ఉన్నారు. మరి వారిని గురించి పట్టించుకునేవారు ఎవరూ లేరంటావా? వారికి సేవ చేయటానికి ప్రతీక్షణం వందల మంది సిద్ధంగా ఉండేవారు. మరి అంత మందిని ఆకర్షించటానికి వారు చేసిన పనల్లా, తమ చుట్టూ ఉన్నవారికి ఉపయోగకరంగా జీవితాన్ని గడపడమే.
సేవని జీవితలక్ష్యంగా చేసుకుంటే....అది నీలోని భయాన్ని తొలగిస్తుంది. మనస్సును ఏకాగ్రం చేసి, నువ్వు చేస్తున్న పనికి ఒక ప్రయోజనాన్ని కల్పించి, దీర్ఘకాలంపాటు ఆనందాన్నిస్తుంది. నువ్వు ఆనందంగా లేని ప్రతిసారీ, కష్టంలో, ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడల్లా...నీ సొంత సరిహద్దులను తాకుతున్నావని గమనించు. ఆ క్షణంలో కృతజ్ఞతతో శాంతికోసం ప్రార్థించటమే నువ్వు చేయగలిగే పని. అలాచేసిన మరుక్షణం నీ ముఖంపై చిరునవ్వు చిగురిస్తుంది. పరిస్థితులు ఎంత నిరాశాజనకంగా ఉన్నా వాటన్నింటినీ దాటుకుని ముందుకు సాగగలవు.