Rathasapthami 2022: రథసప్తమికి- జిల్లేడు ఆకులకు ఏంటి సంబంధం .. పురాణాల్లో ఏముంది, సైన్స్ ఏం చెబుతోంది..
పండుగల సమయంలో పాటించే సంప్రదాయాలు, అనుసరించే పద్ధతులకు పురాణాల్లో చెప్పే కారణం ఒకటైతే.. సైన్స్ పరంగా అంతకు మించి ఉపయోగాలున్నాయంటారు. మరి రథసప్తమి రోజు పాటించే నియమాల వెనకున్న ఆరోగ్య రహస్యాలేంటంటే..
భూమిపై జీవరాశుల మనుగడకు కారణమైన సూర్యుడిని ప్రత్యక్షదైవంగా ఆరాధిస్తాం. అందుకే సూర్యారాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు హిందువులు. అన్నదాత, ఆరోగ్య ప్రధాత అయిన సూర్యభగవానుని ఆరాధించే రోజే రథసప్తమి. ఈ ఏడాది ఫిబ్రవరి 8 మంగళవారం రథసప్తమి జరుపుకుంటున్నారు. వేదాలు, పురాణ-ఇతిహాసాల్లో సూర్యారాధనకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. రామాయణంలో రాముడు, రావణుడిని వధించడానికి ముందు సూర్యోపాసన చేశాడని చెబుతారు. ధర్మరాజు వెంట అడవికి వచ్చిన వారి ఆకలి తీర్చేందుకు సూర్యోపాసన చేసి అక్షయపాత్రను పొందాడంటారు. మరోవైపు వినాయకచవితి రోజు చెప్పుకునే కథలో కృష్ణుడు దొంగిలించాడని నిందవేసిన సత్యభామ తండ్రి సత్రాజిత్తుడు కూడా ఆ మణిహరం సూర్యోపాసన ద్వారానే పొందుతాడు. అత్యంత విశిష్టమైన ఈ రోజున స్నానం చేసే సమయంలో తలపై జిల్లేడు ఆకు పెట్టుకుని చేస్తే చాలా మంచిది అని చెబుతారు.
పురణాల్లో ఏముంది
పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవ విమానం చూసిన ఆనందంలో ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అదే సమయానికి పెద్ద గాలి రావడంతో వేడిగా ఉన్న నెయ్యి పక్కనే ఉన్న మేకపై పడి, చర్మ ఊడి మరణించింది. వీరికన్నా ముందే ఆ మేక ఆత్మ వెళ్లి దేవవిమానంలో కూర్చుంది. ఊడిన మేక చర్మ పక్కనే ఉన్న జిల్లేడు చెట్టుపై పడి..ఆ చెట్టు ఆకులు కూడా మేకచర్మంలా మెత్తగా మారిపోయాయట. ఇలా జరిగిందేంటని అగ్నిష్వాత్తులు బాధపడగా... అప్పుడు ఆకాశవాణి... మీరు చేసిన యజ్ఞఫలం మేకకి, జిల్లేడు చెట్టుకి కూడా దక్కిందని చెప్పిందట. ఆ రోజు మాఘశుద్ధ సప్తమి కావడంతో ఈ రోజున స్నానం ఆచరించే వారు జిల్లేడు ఆకుల్ని తలపై పెట్టుకుని చేస్తే వారికి కూడా యజ్ఞఫలం లభిస్తుందనే వరం ఇచ్చారట దేవతలు.
సైంటిఫిక్ రీజన్
జిల్లేడు ఆకులను తలపై, శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయి. ఈ ఆకు నుంచి వచ్చే రసాయనాలు జుట్టు ఊడకుండా చేయడంతో పాటూ మెదడుని చల్లబరుస్తాయి. కొన్ని ఆయుర్వేద మందుల తయారీలోనూ తగిన మోతాదులో అర్క పత్రాన్ని, ఆ బెరడుని ఉపయోగిస్తారని చెబుతారు ఆయుర్వేద నిపుణులు.
స్నానం అనంతరం సూర్య కిరణాలు పడేదగ్గర పిడకలపై క్షీరాన్నం చేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెడతారు. కొందరైతే చిక్కుకు కాయలతో రథాన్ని తయారు చేస్తారు. ముఖ్యంగా రథసప్తమి రోజు చేయలేకపోయిన వారూ ఆదివారం రోజైనా పూజించవచ్చు.
బ్రహ్మ స్వరూప ముదయే, మధ్యాహ్నేతు మహేశ్వరమ్
సాయం ధ్యాయేత్ సదా విష్ణుం, త్రిమూర్తించ దివాకరమ్
సూర్యుడు ఉదయం బ్రహ్మస్వరూపుడు, మధ్యాహ్నం శివస్వరూపుడు, సాయంకాలం విష్ణు స్వరూపుడు. అందుకే సూర్యుడు 'త్రిపురుషమూర్తి". అలాగే సూర్యుడు ఉదయం రుగ్వేద స్వరూపుడు, మధ్యాహ్నం యజుర్వేద స్వరూపుడు, సాయంకాలం సామవేద స్వరూపుడు...అంటే సూర్యుడు "త్రీవేదమయుడు" అని పురాణాలు వర్ణించాయి. అందుకే సూర్యారాధనకు అంత విశిష్టత ఉంది.