Ramanujacharya Statue: స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ.. ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్న జీయర్ స్వామి
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించడానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు ప్రధాని మోదీని ఆహ్వానించారు.
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించడానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చిన్నజీయర్ స్వామి ఆహ్వాన పత్రికను అందించారు. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను ప్రధానికి వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణకి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. చిన్నజీయర్ స్వామితో పాటు మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కూడా ప్రధాని మోదీకి ప్రాజెక్టు విశేషాలను వివరించారు.
సమతాస్ఫూర్తి కేంద్రం విశిష్టతను, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి తెలుగు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నపంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ప్రధాని మోదీ ఆసక్తిగా విని, తెలుసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు. విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.
Also Read: Ganesh Immersion 2021: వినాయక పూజ, నిమజ్జనంతో కలిగే ప్రయోజనాలు తెలుసా!
శంషాబాద్ ముచ్చింతల్‌లో ఈవెంట్..
రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహం కొలువుదీరనున్న శంషాబాద్‌లోని ముచ్చింతల్ ప్రాంతం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రూపును సంతరించుకోనుంది. విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు విచ్చేయనుండటంతో భాగ్యనగరం ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
విశాఖకు శారదా పీఠాధిపతులు..
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సెప్టెంబర్ 20న విశాఖ నగరానికి చేరుకోనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత విశాఖ నగరానికి తిరిగి వస్తున్న పీఠాధిపతులకు భక్తులు ఘన స్వాగతం పలికేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు పీఠాధిపతులు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష కోసం మే 15వ తేదీన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, వేద విద్యార్థులతో కలిసి విశాఖ నుంచి రిషికేష్ వెళ్లడం తెలిసిందే. జూలై 24వ తేదీన ప్రారంభమైన దీక్ష ఈ 20న ముగియనుంది. దీక్షా సమయాన్ని తపోకాలంగా పరిగణించి వేదాంత చింతనతో గడిపారు. రిషికేష్ తో పాటు హరిద్వార్ తదితర హిమాలయ పాద ప్రాంతాల్లో సంచరించారు. 129 రోజుల తర్వాత స్వరూపానందేంద్ర స్వామీజీ తిరిగి విశాఖకు చేరుకుంటున్నారు. అక్టోబరు 7 నుంచి విశాఖ పీఠం నిర్వహించే శ్రీ శారదా స్వరూప రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆయన పాల్గొంటారు.
Also Read: వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర లేనట్లే ! నిమజ్జనంపై కీలక నిర్ణయం తీసుకున్న ఉత్సవ కమిటీ !