Sri Rama Navami 2022: సీతారాముల కళ్యాణం జరిగిన అసలు ప్రదేశం ఇదే
ఏప్రిల్ 10 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా….శ్రీరామచంద్రుడిపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనాలు. ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశం, సీతాదేవి జన్మస్థలం గురించి ప్రత్యేక కథనం...
రాముడి కథే రామాయణం. కేవలం శ్రీ సీతారాముల చరిత్రే అనుకుంటే పొరపాటే జీవినవిధాన్ని తెలిపే మాహాకావ్యం. రామాయణంలో ప్రధాన ఘట్టాల్లో సీతారాముల కళ్యాణం ఒకటి. అసలు ఈ కళ్యాణం మొదట ఎక్కడ జరిగింది...
అయోధ్యలో జన్మించాడు కౌశల్యా తనయుడు శ్రీరాముడు. సీతమ్మ తల్లి మిథిలానగరంలో జన్మించింది. రాముడి మామగారైన జనకుడు పాలించిన రాజ్యమే మిథిలా నగరం. బీహార్ నుంచి నేపాల్ వరకూ ఈ మిథిలా రాజ్యం విస్తరించి ఉందని చెబుతారు. ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యం అని కూడా పిలిచేవారట. ఆ పేరుమీదే సీతాదేవికి వైదేహి అనే పేరువచ్చింది. అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్ పూర్ అని ప్రజల నమ్మకం. ఈ జనక్ పూర్ లో భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఉద్భవించిన నగరం, రామయ్యను పెళ్లిచేసుకున్న నగరం కూడా మిథిలా నగరమే అంటారు.
Also Read: నారదుడికే షాకిచ్చిన 'రామ' నామం
సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమేణా ప్రజలు మర్చిపోయారు. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో, ఇక్కడి ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. ఆ చరిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఓ ఆలయాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి అప్పట్లో తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయిందట. అందుకనే ఈ ఆలయానికి ‘నౌ లాఖ్ మందిర్’ అన్న పేరు కూడా ఉంది. జానకీమందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివ ధనుస్సుని పూజించిందని చెబుతారు. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ స్థలంలోనే అని భక్తుల విశ్వాసం. అందుకనే జానకీమందిరంలోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. ఏటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకం. కానీ తెలుగువారు శ్రీరామనవమి రోజునే ఆయన కళ్యాణం నిర్వహించుకోవడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది.
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే
నౌ లాఖ్ మందిర్ లో సోదరులు, భార్యతో సహా కొలువైన రామయ్యను దర్శించుకునేందుకు రెండు కళ్లు చాలవ్. శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి , వివాహ పంచమి (మార్గశిర శుక్ల పంచమి) పండుగల సమయంలో అయితే జనం పోటెత్తుతారు. ఈ జనక్ పూర్ కి 18 కిలోమీటర్ల దూరంలో ‘ధనుషధామ్’ అనే ప్రాంతం ఉంది. రాముడు విరిచిన శివుని ధనుస్సు ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం. ఇంతకీ చెప్పేదేంటంటే రాముడి కళ్యాణం జరిగిన ప్రదేశమే జనక్ పురి. నేపాల్ వెళ్లినవారిలో శ్రీరామచంద్రుడి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. నాలుగేళ్ల క్రితం నేపాల్ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు.అప్పడు ఈ ఆలయం ప్రత్యేకత గురించి పెద్ద చర్చే జరిగింది.
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే