Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు పునఃప్రారంభం
దాదాపు ఏడాదిన్నర తర్వాత చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా కల్లోలంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోయారు. అదే సమయంలో ఆలయాల్లోనూ భక్తులకు ప్రవేశం నిలిపేసిన అధికారులు, అర్చకులు.. స్వామి,అమ్మవార్లకు ఏకాంత సేవలు నిర్వహించారు. కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత నిబంధనల మేరకు భక్తులను అనుమతించడం ప్రారంభించారు. ఇప్పటికే తిరుమలలో మళ్లీ సర్వదర్శనం టోకెన్లు పంపిణీ మళ్లీ మొదలుపెట్టారు టీటీడీ అధికారులు. ఇంకా పలు ఆలయాల్లో పాత సేవలను పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణల సందడి మళ్లీ ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించారు ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్.
కరోనా కట్టడిలో భాగంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో దాదాపు ఏడాదిన్నర పాటూ నిలిచిపోయిన ప్రదక్షిణలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయానికి వచ్చే భక్తులకు మహా ప్రాకార ప్రదక్షిణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు అర్చకులు రంగరాజన్. గతంలో ఆలయ గర్భగుడి చుట్టు భక్తులు, 11 లేదా 108 ప్రదక్షిణలు చేసేవారని, కరోనా కారణంగా ఏడాదిన్నర నుంచి ప్రదక్షిణలు పూర్తిగా నిలిపివేశామని పేర్కొన్నారు. చాలామంది భక్తుల పదే పదే ప్రదక్షిణల గురించి అడుగుతున్నారని..అందుకే వారి కోరిక మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు రంగరాజన్.
Also Read: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...
అయితే ఇక్కడ కూడా కొన్ని నిబంధనలు అనుసరించాలని సూచించారు. ఆలయ ప్రకారం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే 11 ప్రదక్షిణలు చేసినట్లే అని తెలిపారు. 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కుకునే భక్తులు ఒక మహా ప్రాకార ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని అన్నారు. అలాగే 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులు 11 మహా ప్రాకార ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకోవచ్చన్నారు. కరోనా పూర్తిస్థాయిలో తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ మహాప్రాకార ప్రదక్షిణలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు భక్తులు సహకరించాలని రంగరాజన్ విజ్ఞప్తి చేశారు.
Also Read: ఇవాళ్టీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
చిలుకూరు బాలాజీ ఆలయంలో మొక్కుకుని ప్రదక్షిణలు చేస్తే వీసా తొందరగా వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామిని 'వీసా బాలాజీ' అని పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే దేవుడి విగ్రహాన్ని కళ్లు మూసుకోకుండా చూడాలి. మొదటిసారి భక్తులు స్వామిని దర్శించుకుని 11 ప్రదక్షిణలు చేస్తారు. మొక్కు తీరాక 108 ప్రదక్షిణలు చేస్తారు. ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత మళ్లీ భక్తులకు ప్రదక్షిణలు చేసే అవకాశం కల్పించారు.
Also Read:ఈ రాశులవారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయం
Also Read:నేడే ఈఏపీసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..