PM Modi: ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించిన "సప్త పురిలు" ఇవే , ఇక్కడ మరణం కూడా మోక్షమే!
Sapta Puri: ప్రధాని మోదీ జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సప్త పురి, చార్ ధామ్, శక్తి పీఠాలను ప్రస్తావించారు. వీటిలో సప్తపురి ఏంటి? ఏ ఏ ప్రదేశాలో తెలుసా?

PM Modi: అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ కేవడియాలో ప్రసంగిస్తూ, చార్ ధామ్, శక్తి పీఠాలు, సప్త పురిల గురించి ప్రస్తావించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పేర్లపై ఆసక్తి పెరిగింది. చార్ ధామ్ , శక్తి పీఠాల గురించి చాలా మందికి తెలుసు, కానీ సప్త పురిలు ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటన్నది సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
సప్త పురిలు: మోక్షానికి మార్గాలివి
హిందూ గ్రంథాల్లో సప్త మోక్షదాయక క్షేత్రాల గురించి ప్రస్తావన ఉంది. ఈ ఏడు నగరాలు ధర్మం, తపస్సు, జ్ఞానం ,మోక్షం అనే నాలుగు మార్గాలు ఒకదానితో ఒకటి కలిసే ప్రదేశాలుగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం, ఈ నగరాల్లో జీవించడం లేదా మరణించడం ద్వారా ఆత్మకు మోక్షం లభిస్తుంది.
సప్త మోక్షదాయక క్షేత్రాలు ఇవే
అయోధ్య (ఉత్తరప్రదేశ్)
శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రావణసంహారం కోసం శ్రీరాముడిగా జన్మించాడు. రాముడి జన్మస్థలం అయోధ్య. గౌరవం, సత్యం , నీతికి చిహ్నం. ఈ నగరం ధర్మం , ఆదర్శవంతమైన జీవితానికి గొప్ప ఉదాహరణ
మథుర (ఉత్తరప్రదేశ్)
శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణుడు కొలువైన ముఖ్యమైన ప్రదేశాల్లో మధుర ఒకటి. ఇక్కడ ప్రేమ, లీల, భక్తి భావం అత్యున్నతమైనది. ఈ ప్రదేశం భక్తి మార్గానికి కేంద్రం. ఇక్కడ భగవంతుడిని ప్రేమ రూపంలో చూస్తారు.
హరిద్వార్ (ఉత్తరాఖండ్)
గంగా నది ఒడ్డున ఉన్న ఈ నగరం తపస్సు, సాధన,స్నానంతో ముడిపడి ఉంది. కుంభమేళా సంప్రదాయం దీనిని ప్రపంచవ్యాప్తంగా మోక్షానికి ద్వారంగా ప్రసిద్ధి చెందింది.
కాశీ (వారణాసి, ఉత్తరప్రదేశ్)
శివుడు స్వయంగా నిర్మించిన నగరం కాశీ. ఇక్కడ మరణం కూడా మోక్షానికి మార్గంగా మారుతుందని చెబుతారు. ఈ ప్రదేశం జ్ఞానం, ధ్యానం ,సాధనకు కేంద్రంగా పరిగణిస్తారు. ప్రతి హిందువు జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది
కంచి (తమిళనాడు)
దక్షిణ భారతదేశంలోని ఈ పురాతన నగరం కామాక్షి, భగవాన్ విష్ణువును దర్శించుకోవచ్చు. ఇది విద్య, శాస్త్రం, ఆధ్యాత్మికతకు సంగమంగా పరిగణించబడుతుంది.
అవంతిక (మధ్యప్రదేశ్)
మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడే ఉంది. ఇక్కడ కర్మ రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతారు. దీనికి చార్ ధామ్‌లతో సమానమైన ప్రతిష్ట ఉంది.
ద్వారక (గుజరాత్)
భగవాన్ శ్రీకృష్ణుని రాజధాని ద్వారక. ఈ నగరం ధర్మం, నీతి, కర్తవ్యాల సమతుల్యతకు చిహ్నం. ఇది పశ్చిమ దిశలో ఉన్న ధామం, ఇది భారతదేశం మొత్తానికి దిశానిర్దేశం చేస్తుంది.
గ్రంథాలలో ప్రస్తావన
గరుడ పురాణం, వాయు పురాణం , స్కంద పురాణంలో ఈ ఏడు పురిల గురించి విస్తృతంగా ఉంది. ఈ నగరాలను మోక్షదాయక క్షేత్రాలుగా పిలుస్తారు. అంటే మనిషి తన కర్మల నుంచి విముక్తి పొంది ఆత్మశాంతిని పొందగలిగే ప్రదేశాలు.
మతపరమైన అర్థానికి మించి ఐక్యత సందేశం
ప్రధాని మోదీ ఈ నగరాలను ప్రస్తావించడం కేవలం మతపరమైన సందర్భంలోనే కాదు. సప్త పురిలు భారతదేశ సాంస్కృతిక , భౌగోళిక వైవిధ్యానికి కూడా చిహ్నం. ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు, భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర ఒకే భావనతో ముడిపడి ఉందని ఇది చూపిస్తుంది. ప్రతి పురి ఒక సందేశాన్ని ఇస్తుంది. ధర్మం కేవలం పూజ మాత్రమే కాదు, జీవితాన్ని జీవించడానికి ఒక సమతుల్య మార్గం అని ఇది చెబుతుంది. వీటిలో ప్రతి నగరం మోక్షం మరణానంతరం మాత్రమే కాకుండా, సత్యం, ప్రేమ, తపస్సు , జ్ఞానం యొక్క ఆచరణలో కూడా పొందవచ్చని బోధిస్తుంది.





















