Mahavatar Vamana: ఆంధ్రాలో వామనుడికి ఉన్న ఏకైక గుడి ఇదే.. దీని వయసు 1000 ఏళ్ళు!
Vamana Temple: శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటి వామనావతారం..ఈ అవతారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక ఆలయం ఉంది. వెయ్యేళ్ల కాలంనాటి ఆ ఆలయం గురించి తెలుసుకుందాం

Mahavatar Vamana Temple: దశావతారాల్లో "వామనుడి " కి ఉన్న ప్రత్యేకత వేరు. మరుగుజ్జు బాలుడుగా బలి చక్రవర్తికి వద్దకు వచ్చి అతడ్ని మెప్పించి 3 అడుగుల నేలను అడిగి త్రివిక్రముడై మూడో అడుగుతో బలిని పాతాళానికి పంపేసిన అవతారం ఇది. అయితే దశావతారాల్లోని వరాహ, నరసింహ,రామ, కృష్ణ అవతారాలకి ఉన్నట్టు వామనుడికి పెద్దగా గుళ్లు కనపడవు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వామునుడికి ఒకే ఒక గుడి ఉంది. వెయ్యేళ్ళ క్రితం నాటి ఈ ఆలయం బాపట్ల సమీపంలోని చెరుకూరు గ్రామం లో ఉంది.

త్రివిక్రమ రూపంలో పూజలు అందుకునే మహా విష్ణువు
పూర్తిగా చాళుక్యుల శైలిలో కనిపించే ఈ ఆలయం అరుదైన శిల్పకళకు నెలవు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలోని చెరుకూరు గ్రామంలో ఉన్న ఈ పురాతన దేవాలయం గుంటూరుకు 63 కిమీ దూరంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న శాసనాల ప్రకారం తూర్పు చాళుక్య రాజు విష్ణువర్ధన (1079-1102) కాలంలో నిర్మించారు. ఆయన తరువాత కొంతకాలనికే తూర్పు చోళ - చాళుక్య రాజ్యాలు ఒకటిగా కలిసి పోయాయి. అందుకే ఈ ఆలయంలో కొంత చోళ శైలి కూడా కనిపిస్తుంది అంటారు.

తొమ్మిదిన్నర అడుగుల త్రివిక్రమ విగ్రహం ప్రధాన ఆకర్షణ
ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుతో నాలుగు అడుగుల వెడల్పుతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సాధారణంగా దేవతా విగ్రహాలు సాలగ్రామ శిలతో ఏర్పాటు అవుతాయి. కానీ ఇక్కడ ఉన్న విగ్రహం మాత్రం లేత గులాబీ రంగులో ఉండే ఏకశిలతో రూపొందడం విశేషం. అలాగే ఆలయం చుట్టూ వైష్ణవ, శైవ పురాణాలకు సంబంధించిన అనేక ఘట్టాలు దేవతలకు సంబంధించిన రూపాలు చెక్కి ఉన్నాయి. ఆనాటి పరిస్థితుల ప్రకారం ఇలా రెండు విభిన్న సంప్రదాయలకు సంబంధించిన చిహ్నాలు ఒకే ఆలయం లో ఉండడం విశేషం అనే చెప్పాలి. ఈ ఆలయం లో కృష్ణాష్టమి,దీపావళి, వామన జయంతి ఘనంగా జరుపుతారు. వైశాఖమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్య లో భక్తులు హాజరవుతారు.ఈ ఆలయ సమీపంలోనే మరొక పురాతన ఆలయం అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది.

ఆలయానికి వందల ఎకరాలు దానం చేసిన చిలకలూరిపేట జమీందార్
త్రివిక్రమ స్వామి ఆలయానికి 1712 లో చిలకలూరిపేట జమీందా రు రాజా మానూరు వెంకట కృష్ణరాయణం బహద్దూర్ 499 ఎకరాల 16 సెంట్లను దానం చేసారు. దానితో ఆలయ పోషణకు ఇబ్బంది లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఏకైక వామన ఆలయాన్ని వీలు కుదిరినప్పుడు చూడడం మర్చిపోకండి.

మహావతార్ వామన (Mahavatar Vamana)
మహావతార్ వామనుడు శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారం. వామనుడినే త్రివిక్రముడు అని పిలుస్తారు. బలి చక్రవక్తిని అంతం చేసేందుకు శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చాడు. బలి చక్రవర్తి తన తపోఫలంతో మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నాడు . అందుకే వామనుడుగా వచ్చిన విష్ణువు..బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల అడిగి..మొదటి అడుగు భూమ్మీద, రెండో అడుగు ఆకాశంలో మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళానికి పంపించేశాడు.





















