Navratri 2022: శరన్నవరాత్రుల్లో పూజించాల్సిన నవదుర్గల ప్రాముఖ్యత
NavaDurga: దుష్టశిక్షణ, లోక సంరక్షణ కోసం శక్తిస్వరూపణి ఎత్తిన అవతారాలే నవదుర్గలు. ఆ తొమ్మిది రూపాలను షోడశోపచారాలతో పూజించి ఆరాధించే పర్వదినాలే శరన్నవరాత్రులు
NavaDurga: సెప్టెంబరు 26 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి... ఈ సందర్భంగా నవదుర్గలపై ప్రత్యేక కథనం
శ్లోకం:
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్
నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః
శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)
శరన్నవరాత్రుల్లో పాడ్యమి రోజు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక, తలపై చంద్రరేఖని ధరించి శూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది.
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
బ్రహ్మచారిణి ( గాయత్రి )
దుర్గమ్మ రెండో అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. కన్యాకుమారి అనే మరోపేరుంది.
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
చంద్రఘంట ( అన్నపూర్ణ )
అమ్మవారి మూడో అవతారం చంద్రఘంట. శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది..అందుకే ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు.
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
కూష్మాండ ( కామాక్షి )
నవదుర్గల్లో అమ్మవారి నాల్గవ అవతారం కూష్మాండ. కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజాదేవి’ అని కూడా అంటారు.
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
స్కందమాత ( లలిత )
నవదుర్గల్లో ఐదో అవతారం స్కందమాత. స్కంధుడు అంటే కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. కమలాసనంపై పద్మాసనంతో శోభిల్లుతుంది. నమ్మిన భక్తులకు విజయాన్నందిస్తుంది.
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||
కాత్యాయని (లక్ష్మి)
అమ్మవారి ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తపస్సుకి మెచ్చి ఆయన కోరిక మేరకు కుమార్తెగా జన్మించింది పార్వతీదేవి. కొత్స కుమార్తె కనుకే కాత్యాయని అనే పేరు వచ్చింది.
శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
Also Read: చదువు, సంపద కోసం ఈ పద్యం చదవండి పిల్లలకు నేర్పించండి, మీరు దుర్గమ్మ ఉపాసన చేస్తున్నట్టే!
కాళరాత్రి ( సరస్వతి )
దుర్గమ్మ ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
మహాగౌరి ( దుర్గ )
అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. ఆమె తపస్సుకుమెచ్చి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||