Murudeswaram Temple: ఆత్మలింగంపై వస్త్రాన్ని రావణుడు విసిరేస్తే ఏర్పడిన క్షేత్రం - ప్రపంచంలో రెండో అతిపెద్ద శివుడి విగ్రహం!
Murudeswaram Temple: ఆత్మలింగంపై వస్త్రాన్ని రావణుడు విసిరేస్తే ఏర్పడిన క్షేత్రం - ప్రపంచంలో రెండో అతిపెద్ద శివుడి విగ్రహం!
Murudeswaram Temple: మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో కర్ణాటకరాష్ట్రం బత్కల్ తాలూకాలో ఉంది. గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రపంచంలో రెండో అతిపెద్ద శివుడి విగ్రహం ఇది. 123 అడుగుల పొడవైన విగ్రహాన్ని శివమొగ్గకు చెందిన కాశీనాథుడు ఇతర శిల్పులతో కలసి చెక్కాడు. అరేబియా సముద్ర ఒడ్డున ఈ విగ్రహం ఉంటుంది. 237 అడుగుల ఎత్తైన ఆలయ గోపుర భారతదేశంలో 2వ ఎత్తైనది.
స్థలపురాణం
రావణాసురుడు కైలాసం నుంచి పరమేశ్వరుడిని వేడుకుని తీసుకొచ్చిన ఆత్మలింగానికి - మురుడేశ్వర క్షేత్రంలోంలోని లింగానికి సంబంధం ఉంది. రావణాసురుడు తీసుకొచ్చి ఆత్మలింగాన్ని కిందపెట్టలేక ఆవైపు వైపు మారువేషంలో వచ్చిన వినాయకుడిని సహాయం అడుగుతాడు. సరే అన్న వినాయకుడు రావణుడు సంధ్యావందనం పూర్తిచేసుకుని వచ్చేసరికి ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేసి వెళ్లిపోతాడు. ఇదంతా గోకర్ణ క్షేత్రంలో జరిగింది. దానిని ఎంత కదిపినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రం, దారం సహా ఇతర వస్తువులు విసిరేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శివలింగాలు ఉద్భవించి మహిమాన్విత పుణ్యక్షేత్రాలుగా వెలుగుతున్నాయి. అవే గోకర్ణక్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు. గోకర్ణక్షేత్రంతో కలిపి వీటిని పంచక్షేత్రాలుగా వ్యవహరిస్తారు. ఆత్మలింగం మీదున్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేసినప్పుడు అది పడిన ప్రదేశమే మురుడేశ్వరం. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని చెబుతారు.
Also Read: జూలై 23 నుంచి 29 వారఫలాలు: ఈ వారం ఈ రాశులవారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి
పంచక్షేత్రాలు
ఈ 5 క్షేత్రాల్లో పార్వతీ పరమేశ్వరులు, సప్తరుషులు పూజలు చేసేవారని చెబుతారు. మురుడేశ్వరక్షేత్రం కందూక పర్వతం మీద అరేబియా సముద్రతీరంలో ఉంది. ఈ పర్వతం బంతిలా (కందూకం అంటే బంతి అని అర్థం) ఉంది కాబట్టి ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది. ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలు నెరవేరుతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మురుడేశ్వరస్వామికి శివరాత్రి రోజు బిల్వపత్రంతో పూజలు చేస్తే వారి మరణభయం లేకుండా స్వర్గప్రవేశం కలుగుతుందని స్థల పురాణం. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం 249 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలు నిజంగా ఏనుగులు నిల్చున్నట్టే కనిపిస్తాయి. ఈ ప్రాకారంలోనే ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, అంజనేయ మందిరాలు ముఖ్యమైనవి.
కమండల తీర్థం
బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూజించాడని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో పోసిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సుగా ఏర్పడిందట.
Also Read: ఈ 3 రాశుల్లో జన్మించినవారి జాతకంలో రాజయోగం, అపారమైన సంపద పొందుతారు!
భీమతీర్థం
అరణ్యవాసంలో భాగంగా ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారని అప్పుడు ధర్మరాజు, భీముడిని మురుడేశ్వరుడికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని తెమ్మన్నాడట. పరమేశ్వరుడిని ధ్యానించినా గంగాజలం లభించకపోవడంతో తన తలని నేలకేసి కొట్టుకున్నాడట భీముడు. అనుగ్రహించిన శివుడు గంగనుతీర్థంగా సృష్టించాడు. అప్పటి నుంచీ ఆ స్థలాన్ని భీమతీర్థంగా పిలుస్తున్నారు. బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడేందుకు ఇంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చి పూజలుచేశాడట.
రోగాలు నయమయ్యే ప్రదేశం
ఇంకా మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం, అందులో ముఖ్యమయినవి. ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, ధీర్ఘకాల రోగాలు నయమయి, తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
నిర్మాణం అత్యద్భుతం
ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేషప్రతిభకు నిదర్శనం మురుడేశ్వర దేవాలయం. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనిపించే ఎత్తైన శివుని విగ్రహం చూపుతిప్పుకోనివ్వకుండా ఉంటుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు రెండు సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు, ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు. ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శిథిలావస్థ దశ నుంచి ఇప్పుడు భక్తులను ఆకర్షించేలా మారిందంటే అందుకు కారణం ఆర్.ఎన్. శెట్టీ అనే భక్తుడు.
Also Read: దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే స్థలం, శివయ్య ధ్యానం చేసిన మహిమాన్విత ప్రదేశం
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.