Mohini Ekadashi 2023: మోహిని ఏకాదశి విశిష్ఠత ఏంటి, ఈ రోజు ఏ నియమాలు పాటించాలి!
వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీమహా విష్ణువుకు సంబంధించినది. శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ధరించడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. ఈ ఏడాది మోహినీ ఏకాదశి మే 1 న వచ్చింది
Mohini Ekadashi 2023:
తిథుల్లో వచ్చే ప్రతి ఏకాదశి తిథీ విశిష్టమే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా, అమావాస్యకి ముందుగా వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా… ప్రతి ఏకాదశి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే ‘మే 1’న వచ్చే ఏకాదశి తిథికి ‘మోహినీ ఏకాదశి’ అని పేరు. మోహినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి, ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకుందా..
మోహినిగా మారిన శ్రీ మహావిష్ణువు
దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం. రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలూ బాధలకు గురవుతున్నాయి. వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. ఇలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు ఓ ఉపాయాన్ని సూచించాడు. క్షీరసాగరమథనం చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందనీ…అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా దానవుల మీద పైచేయి సాధించగలరనీ చెప్పాడు. క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలచి, వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మథనం ప్రారంభించారు. వాటిలోంచి కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం…లక్ష్మీదేవి..ఇవన్నీ ఉద్భవించిన తర్వాత ఆఖర్లో అమృతం వెలువడింది. ఈ క్షీరసాగరమథనంలో దేవతలు-రాక్షసులు సమానంగా పాలుపంచుకున్నారు కాబట్టి అమృతాన్ని ఇద్దరూ సమానంగా పంచుకోవాల్సి వచ్చింది. అదే కనుక జరిగితే సముద్రమథనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా అందుకే సాక్షాత్తు శ్రీ మాహవిష్ణువే రంగంలోకి దిగాడు..కళ్లుచెదిరేంత అందంతో మోహిని అవతారం ధరించాడు
Also Read: ‘విరూపాక్ష’కూ ఓ ఆలయం ఉంది, ఆ రహస్యాన్ని బ్రిటీషర్లు కూడా తెలుసుకోలేకపోయారు - ఏమిటా వింత?
మోహనిని చూసి చలించిన పరమేశ్వరుడు
మోహిని రూపం ధరించిన శ్రీ మహావిష్ణువు రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలా చేసి మాయమైపోయాడు. ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుని మనసే చలించిపోయిందనీ…అలా ఆ హరిహరులను జన్మించినవాడే అయ్యప్పస్వామి అనీ చెబుతారు. ఈ మోహిని అవతరించింది వైశాఖ శుద్ధ ఏకాదశిరోజు..అందుకే ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. అందుకే ఈ రోజు శ్రీ మాహావిష్ణువుని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని...రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతారు.
Also Read: మే 5న చంద్రగ్రహణం ఈ మూడు రాశులవారికి అదృష్టాన్ని తెస్తోంది
ఉపవాసం ఎలా ఆచరించాలి
అన్ని ఏకాదశుల లానే..మోహినీ ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉండి..మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాని శాస్త్రవచనం. ఉపవాసం చేసేందుకు ఆరోగ్యం సహకరించని వారు కనీసం తలకు స్నానం చేసి దీపారాధన చేసి శ్రీ మాహావిష్ణువు శ్లోకాలు చదువుకుంటే మంచిదని చెబుతారు. మోహినిగా మారి దేవతల కష్టాలు ఎలా తీర్చాడో మన కష్టాలు కూడా అలాగే తీర్చాలని , మనిషిలో ఉండే రాక్షస ప్రవృత్తిని చంపేసి సాత్వికతను వెలికితీయాలని ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే తీర్థయాత్రకు వెళ్లి పేదలకు దానం చేయడంతో సమానం. మోహినీ ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలాన్ని పొందుతాడని, ఏకాదశి వ్రతం మోక్ష మార్గం వైపు నడిపిస్తుందని పండితులు చెబుతారు.