Margasira Masam 2025: ఆధ్యాత్మికత, ఆరోగ్యం, మోక్షం.. మీ జీవితంలో మార్పులు తీసుకొచ్చే మార్గశిర మాసం విశిష్టత!
Margasira Masam 2025 Dates: తెలుగు మాసాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. అన్ని మాసాల్లోనే అగ్రగణ్యమైనది మార్గశిరం ఎందుకు?

Margasira Masam Special: మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణిమ కావడంతో మార్గశిరం అని పేరు. మార్గశిర మాసాన్ని ‘మార్గశీర్షం’ అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. తానే మార్గశిరమని అర్జునునికి కృష్ణపరమాత్మ విభూతి యోగంలో చెప్పారు.
హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల ఇది.. ఆధ్యాత్మికంగా ప్రసిద్దమైన ఈ నెల ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని పెంచుతుంది. ఈ నెలలో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా ...ఎలాంటి దైవకార్యం అయినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని చెప్పాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు..అంటే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అన్నమాట..
చంద్రుడు మనః కారకుడు.. జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోతే మానసిక స్థితి సరైనమార్గంలో ఉండదు. అందుకే చంద్రుడు అనుకూలించే కాలంలో చేసే దైవారాధన మనోధైర్యాన్ని పెంచుతుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి.
కార్తీకమాసంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తులు..మార్గశిరంలో భగవంతుడి చింతలో తన్మయత్వం పొందుతారు. నిర్మలమైన ఆకాశంలా మనసులు కూడా ఈ నెలలో నిర్మలంగా ఉంటాయి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో అన్నీ పవిత్రమైనవే అయినా.. వైకుంఠ ఏకాదశి మరింత ప్రత్యేకం. అన్ని ఏకాదశుల్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే వైకుంఠ ఏకాదశిని సౌరమానాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి, మోక్ష ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశి రోజు వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని చెబుతారు. దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన విష్ణువు కార్తిక శుద్ధ ఏకాదశిరోజు మేల్కొంటాడు. ఈ రోజు ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకుంటారు. ఈ రోజు ఉత్తరద్వారం గుండా విష్ణువును దర్శించుకుంటే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. అంటే భగవద్గీత లోకానికి అందిన రోజు ఇది. ఇంత పవిత్రమైన మార్గశిర మాసంలో చేసే ఏ పూజ అయినా, ఏ అభిషేకాలు అయినా, ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణుభగవానుడు తెలియజేశాడు.
కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు నెల రోజుల పాటూ యమధర్మ రాజు కోరలు తెరుచుకుని ఉంటాడు..అందుకే ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో చాలా రకాల వ్యాధులు తొలగిపోతాయని అందుకు కృతజ్ఞత పూర్వకంగా మార్గశిర శుక్ల పౌర్ణమి రోజు యమధర్మ రాజుని ఆరాధిస్తారు. అందుకే కోరల పున్నమి అంటారు.
గమనిక: పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!






















