Mahabharat: ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం
Mahabharat: మహాభారతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం, కురుక్షేత్ర సంగ్రామానికి దారితీయడానికి కారణం అయిన ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం. ఈ ఘట్టం తర్వాత అత్యంత బాధలో ఉన్న ద్రౌపదితో శ్రీ కృష్ణుడి సంభాషణ ఆసక్తికరం..
Mahabharat: ద్రౌపది వస్త్రాపహరణ జరిగిన సందర్భం..ఆ సమయంలో ఐదుగురు భర్తలు ఎదురుగా ఉన్నా ఏమీచేయలేని దుస్థితిలో ఉండడం.. నిండు సభలో నిస్సహాయురాలిగా నిల్చుండిపోయిన ద్రౌపదిబాధ అంతులేనిది. ఇలాంటి సమయంలో తానున్నానంటూ శ్రీకృష్ణుడు కాపాడతాడు. ఈ సన్నివేశం తర్వాత ద్రౌపది మానసికంగా కృంగిపోతుంది. ఎదురుగా ఐదుగురు భర్తలున్నా నిస్సహాయరాలిగా నిల్చున్న తన పరిస్థితి తల్చుకుని బాధలో కూరుకుపోతుంది..ఆ సమయంలో ఓదార్చేందుకు వచ్చిన శ్రీ కృష్ణుడిని తాను చేసిన తప్పేంటని అడుగుతుంది.. అప్పుడు ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం
Also Read: పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు
ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత కృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ
శ్రీ కృష్ణుడు: సత్కార్యం అధిక సత్కార్యాలను, దుష్కార్యము అధిక దుష్కార్యాలను జయిస్తుంది. దుష్కార్యములు చేసిన వాళ్ళ హృదయాలు ఎల్లప్పుడూ సంకోచిస్తూ ఉంటాయి
ద్రౌపది: దుష్కార్యము కౌరవులు చేసినా బాధ మొత్తం నేను అనుభవిస్తున్నాను
ద్రౌపది మాటలకు శ్రీ కృష్ణుడు సుదీర్ఘ వివరణ ఇచ్చాడు
మన తప్పు లేకపోయినా మనపైన ఏదైనా నింద పడితే అది మన కర్మ అవుతుంది కానీ తప్పు కాదు. అలా తప్పుడు నింద మనపై పడినప్పుడు, ఆ ఘటన కి మనము ఎలా స్పందిస్తాం అనే దానిని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన తప్పు లేకుండా మన మీద నింద పడినప్పుడు, మనం కృంగిపోతే మనకి కూడా నరకం అనేది అనుభవంలోకి వస్తుంది. అందుకని అన్నిటికన్నా ముందు మన మీద తప్పుడు నింద వేసిన వారిని మనం క్షమించాలి. మనం మన మనసుని దుఃఖంతో నింపుకుంటే నరకం అనుభవించాల్సి వస్తుంది. ఎవరో చేసిన దుష్కార్యాలకి మనం నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. ఎలాగైతే నది తనలో కలిసిన మాలిన్యాన్ని సముద్రం లోకి నెట్టి వేస్తుందో, మనం మన బాధలు అన్నింటిని ఆ పరమేశ్వరుడుకి అంకితం చెయ్యాలి. ఈ క్రమంలో మనం ధర్మ మార్గాన నడవడం అత్యంత అవసరం. ఎప్పుడైతే మనం వారి మీద పగ పట్టి కోపం తీర్చుకుంటామో అప్పుడు సమాజానికి మనం న్యాయం చేయలేము. ఎందుకంటే ప్రతీకారంతో మనం రగులుతున్నప్పుడు మన మనసు ఆలోచనలు మన అదుపులో ఉండవు. ద్రౌపదికే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజ్యంలో ఎందో మంది సామాన్య స్త్రీల పరిస్థితి ఆలోచించు. ఎప్పుడైతే మనం బాధ పడడం మానేసి, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తామో మనం ధర్మ మార్గంలో నడిచి మోక్షాన్ని చేరుకోడానికి అదే మొదటి మెట్టు అవుతుంది. అందుకు కోపం, ప్రతీకారంతో రగిలిపోకుండా, మనం ధర్మ మార్గాన్ని అనుసరిస్తే విజయం మన సొంతం అవుతుంది. ఈ సమాజంలోని బాధలు మన బాధలుగా అనుకున్నప్పుడు మనకి ఎక్కడలేని బలం చేకూరి విజయం మన సొంతం అవుతుంది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రీకృష్ణుడు
శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు మాటిస్తాడు..నీకు ఏ కష్టమొచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటానని. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను కాపాడుతాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.