Maha Shivaratri 2023: తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం మీరు పూజించే రూపం ఏది - శివతత్వం ఏం చెబుతోంది!
దేవుళ్లంతా నిండుగా అలంకారాలతో కలర్ ఫుల్ గా కనిపిస్తుంటారు..కానీ శివుడు మాత్రం ఓ సారి నిరాకారుడిగా, మరోసారి అర్థనారీశ్వరుడిగా,ఇంకోసారి ఒళ్లంతా విభూది చారలతో కనిపిస్తాడు. ఇంతకీ శివతత్వం ఏం చెబుతోంది
Maha Shivaratri 2023: పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన రోజే శివరాత్రి. ఈ ఏడాది ఫిబ్రవరి 18 శనివారం శివరాత్రి. ఈ సందర్భంగా శివతత్వం గురించి ప్రత్యేక కథనం
లింగరూపంలో ఉద్భవించిన శివుడు
ఓసారి శ్రీ మహావిష్ణువు- బ్రహ్మ మధ్య నేనెక్కువ అంటే నేనెక్కువ అనే అహంకారం తలెత్తింది. ఎవరెంత గొప్పవారో తేల్చుకోవాలనే స్థితికి చేరుకుంది. వారిని వాస్తవంలోకి తీసుకొచ్చేందుకు మాఘమాసం చతుర్దశినాడు వారిద్దరి మధ్యా "జ్యోతిర్లింగంగా" రూపుదాల్చాడు శివుడు. లింగానికి ఆద్యంతాలు తెలుసుకునేవారే గొప్పవారని చెప్పడంతో...శ్రీ మహావిష్ణువు అడుగు భాగాన్ని వెతుకుతూ , బ్రహ్మ పై భాగాన్ని వెతుకుతూ వెళ్లారు. బ్రహ్మకు మధ్యలో కామధేనువు కనిపించింది. ఎక్కడినుంచి వస్తున్నావ్ అని ప్రశ్నించగా అభిషేకం చేసి పైనుంచి వచ్చానంది. ఆ తర్వాత కనిపించిన మొగలిపువ్వు కూడా లింగంపై నుంచి కిందకు జారానని చెప్పింది. అయితే తాను జ్యోతిర్లింగం పై భాగం చూశానని సాక్ష్యం చెప్పమని కోరాడు బ్రహ్మ. అంతం కనుక్కోలేకపోయానని విష్ణువు చెప్పగా తాను మాత్రం ఆది చూశాను సాక్ష్యం ఇదిగో అని బ్రహ్మ చెప్పాడు. ఆగ్రహించిన శివుడు బ్రహ్మ శిరస్సు ఖండించాడు. అలా ఖండించిన శిరస్సు పడిన క్షేత్రమే బ్రహ్మ కపాలం. అదే సమయంలో అబద్ధం చెప్పిన మొగలిపువ్వు పూజకు పనికిరాదని, ఆవు ముఖం చూస్తే మహాపాపం అని శాపం ఇచ్చాడు పరమశివుడు. ఇలా పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన రోజే శివరాత్రి పర్వదినం.
Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!
శివుడి రూపాలు
దేవుళ్లంతా నిత్య అంలంకరణలో కనిపిస్తారు కానీ శివుడు మాత్రం ఎప్పుడూ అలా కనిపించడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం
తత్పురుషం
తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా కనిపిస్తూ..తూర్పుముఖంగా కూర్చుని ఉండే ఆ ముఖాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడట. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే అంటారు.
అఘోరం
దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూతప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయంకంపితంగా ఉంటుంది.
సద్యోజాతం
శివుడంటే లింగరూపమే. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే. అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోగాతం అంటారు. లింగ రూపంలో ఉన్న శివయ్యను యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు.
Also Read: శివుడు-పార్వతి ఇద్దరిలో తమ ప్రేమను ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు
వామదేవం
పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే అని చాటిచెప్పే రూపమే వామదేవం. శివుడు కుటుంబంతో సహా కనిపించే రూపంలో సర్వాలంకార భూషితుడిగా ఉంటాడు. మిగిలిన రూపాల్లో కనిపించని విధంగా శివుడు అలంకారాలతో, పక్కన అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి, నంది తో కన్నులపండువగా కనిపిస్తాడు. సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతానంతో తులతూగాలని మానవాళిని ఆశీర్వదించే రూపం ఇది. ఆలయాల్లో మినహా ఇంట్లో ఎక్కువగా పూజించేది ఈ రూపాన్నే.
మరో ముఖంగా చెప్పే ఈశాన్యంలో పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట.