Krishna Janmashtami 2022 : కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!
కృష్ణాష్టమి రోజు లోగిళ్లలో చిన్ని కృష్ణుడి అడుగులు భలే ముద్దుగా కనిపిస్తాయి. ఇంట్లోంచి బయటకు కాకుండా.. ఇంటి బయటి నుంచి లోపలకు వేస్తారు అడుగులు. ఆ అడుగులు వేయడం వెనకున్న ఆంతర్యం ఏంటో తెలుసా..!
కృష్ణుడి అడుగులు వేయడం వెనుక పరమార్థం
సాధారణంగా భగవంతులంతా, విష్ణువు అవతారాలు, యోగులు, మహర్షులు అందరూ ఉత్తరాయణంలోనే జన్మించారు. అందుకే ఉత్తరాయణం పుణ్యకాలం అంటాం. ఇక దక్షిణాయనం విషయానికొస్తే చీకటికి ప్రతీక. దక్షిణాయణం కర్మకి ఆధారం. పైగా శ్రావణమాసం వర్ష రుతువు అంటే వెన్నెల ఉండదు. వర్ష రుతువులో శుక్ల పక్షం-కృష్ణ పక్షంలో కృష్ణ పక్షం పూర్తి చీకటిగా ఉంటుంది. ఇలాంటి చీకట్లో అర్థరాత్రి జన్మించాడు శ్రీకృష్ణుడు.పైగా చెరసాలలో..అంటే ఎక్కడ ఉండకూడదో అక్కడ పుట్టాడు.అందుకే దక్షిణాయణం-కృష్ణపక్షంలో చిమ్మ చీకటి మధ్య జన్మించిన కన్నయ్య.. మన జీవితాల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించాలని..జ్ఞానం అనే వెలుగు వైపు నడిపించాలని కోరుతూ కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తారు.
Also Read: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!
- సాధారణంగా శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి. కానీ రామ, కృష్ణావతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు. పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడిని అని చెప్పలేదు...కానీ కృష్ణావతారంలో తానే దేవుడిని అని స్పష్టంగా చెప్పాడు కృష్ణపరమాత్మ.
- ఎక్కువ మంది కృష్ణుడిని భగవత్ స్వరూపంగా కన్నా గురువుగా భావిస్తారు. గురువు అంటే చీకటి లోంచి వెలుగులోకి, అజ్ఞానం లోంచి జ్ఞానంవైపు నడిపించే మార్గదర్శి. అందుకే తమలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని కన్నయ్యను అడుగులు వేసి లోపలకు ఆహ్వానిస్తారు.
- తానే పరమాత్ముడిని అని చెప్పినప్పటికీ కృష్ణుడు..చతురాశ్రమ ధర్మాలను కూడా పరిపూర్ణంగా పాటించాడు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం...ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లోనూ గురుతత్వాన్ని చూపించిన అవతారం కూడా కృష్ణడొక్కటే. అందుకే కృష్ణడికి ఇంట్లోకి ఆహ్వానం పలకడం ద్వారా సకలదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
- దేవుడిగా కన్నా..గురువుగా, స్నేహితుడిగా నా ఇంట్లోకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ కృష్ణుడి అడుగులు వేస్తారు. ఎందుకంటే కురక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి వెన్నంటే ఉండి దోషాల నుంచి విముక్తి కల్పించి విజయాన్ని అందించినట్టే..తాము తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడామని కన్నయ్యను వేడుకుంటారు.
- కృష్ణుడు వెన్నంటే ఉండి నడిపించాడు కానీ ఎక్కడా నేరుగా రంగంలోకి దిగలేదు. ధర్మం దిశగా మార్గనిర్దేశకత్వం చేశాడు, వేలుపట్టి నడిపించాడు. అలా నిర్వర్తించాల్సిన ధర్మం దిశగా నడిపించని.. వెళుతున్న మార్గంలో అవరోధాలు తొలగించమని.. మనిషిగా పుట్టినందుకు మనిషిగా ప్రవర్తించే నడవడినను నేర్పించమని చెప్పడానికే కృష్ణపాదుకలు వేస్తారు.
- కృష్ణుడిని భగవంతుడిగా పూజించేవారి కన్నా..స్నేహితుడిగా, గురువుగా భావించిన వారినే ఎక్కువగా అనుగ్రహించాడు. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అన్నీ అర్థం కావాలంటే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు.
- ఒక్కమాటలో చెప్పాలంటే బతికేస్తున్నాం అనుకోవడం వేరు బతకడం వేరు...బతుకు నేర్పమని అడుగుతూనే కృష్ణుడి అడుగు వేస్తారు.
Also Read: శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం
ఆగస్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది..తదుపరి అష్టమి వచ్చింది. ఆగస్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది. పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 19 శుక్రవారం జరుపుకోవాలని చెప్పారు పండితులు. హిందువుల పండుగల్లో 90% సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగస్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు.