By: ABP Desam | Updated at : 30 Aug 2021 10:56 AM (IST)
ఉడిపి శ్రీకృష్ణుడి విగ్రహ రహస్యం..
ఉడిపిలో స్వామివారు బాలుని రూపంలో కొలువై ఉండండ వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు సముద్ర తీరంలో తపోదీక్షలో ఉండగా అటుగా వస్తున్న ఓ నావ అలలకు పైపైకి లేచి ప్రమాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో మధ్వాచార్యులు తన ఉపవస్త్రాన్ని (కండువా) విసిరి ఆ నావను ఒడ్డుకి చేర్చారు. నావలోని వారంతా కిందకు దిగి స్వామివారికి నమస్కరించి… నావలో ఏదైనా విలువైన వస్తువుని తీసుకోమని కోరారు. అందుకు చిరునవ్వు నవ్విన మధ్వాచార్యులు పడవలో ఉన్న గోపీచందనపు గడ్డలు ఉన్నాయి… అవి ఇవ్వమని అడిగారు. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎందుకూపనికిరాని మట్టిగడ్డలు అడుగుతున్నారెందుకని ప్రశ్నించారు. అప్పుడు వాటిని చేతిలోకి తీసుకున్న మధ్వాచార్యులు చప్పున నీటిలో ముంచారు. ఆ మట్టంతా కరిగి లోపల నుంచి శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలు బయటపడ్డాయి.
ఈ విగ్రహాలకున్న ప్రాముఖ్యత ఏంటంటే… ఒకసారి దేవకీదేవి కృష్ణునితో నీ బాల్య లీలను చూసే అదృష్టం యశోదకు కలిగించినట్టు తనకూ కలిగేలా చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు చిన్న బాలుడిలా మారి అన్న బలరాముడితో కలసి ఆడుకున్నాడు. బలరామకృష్ణుల ఆటపాటలు చూసి దేవకితో పాటూ రుక్మిణీదేవి కూడా మురిసిపోయింది. చిన్ని కృష్ణుని రూపాన్ని ప్రపంచానికి చూపించాలని భావించిన రుక్మిణి దేవి విశ్వకర్మ ను పిలిచి వారి రూపాలతో విగ్రహాలను తయారు చేయించింది. కృష్ణావతారం ముగిసి ద్వారకా నగరం సముద్రంలో కలిసింది. ఆ తర్వాత కాలంలో ఇలా మధ్వాచార్యుల చెంతకు చేరిన కృష్ణుని విగ్రహం ఇప్పుడు ఉడిపిలో పూజలందుకుంటోంది.
Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం
ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే మధ్వాచార్యులు ఆరోజు తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తన శిష్యులతో ప్రక్షాళన చేయించి… తర్వాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం… మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ, సామాన్య శకం 1236లో ఉడిపిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచీ మధ్వాచార్యులు అవలంభించిన పూజా విధానాన్నే అనుసరిస్తున్నారు.
Also read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!
ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో మారుమోగే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఒకప్పటి శ్రీకృష్ణమఠంగా,ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిలిచే ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ఆలయం బయట ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం. నిమ్నజాతికులస్థుడైన కనకదాసు భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిచ్చినట్టు స్థలపురాణం. అందుకే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తాడు. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది. అలనాటి దేవాలయ సంస్కృతి, సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపం నిర్మించారు. ఉత్సవాలు, పండుగల సమయంలో ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, అలనాటి పనితనానికి నిదర్శనంగా కొయ్యశిల్పాలు… ఇవన్నీ భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లిపోతాయి. గర్భాలయం ముందుభాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం, దానికి సమీపంలో తీర్థ మండపం ఉంది. ఈ తీర్థ మండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకలపొడి తదితరాలను ఉంచుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు.
కృష్ణ పరమాత్మ భక్తుడైన మధ్వాచార్యులు కృష్ణతత్వ వ్యాప్తి కోసం నిరంతరం కృషి చేశారు. ఈ దేవాలయ ప్రాంగణంలో తన ఎనిమిది మంది శిష్యుల కోసం 8 పీఠాలను ఏర్పాటు చేశారు. పిజ్జావారు, కుటికి, పాలిమర్, క్రిష్ణపుర , సిరూర్కానీ, ఎవరుసోదే, ఆడవారు, అనే ఎనిమిది మఠాలను మధ్వాచార్యులు ఏర్పాటు చేశారు వీటిని అష్ట పీఠాలు అని అంటారు. దేవాలయంలో పూజలు ఇతర వ్యవహారాలను ఈ అష్టాదశ పీఠాలు చూసుకుంటాయి. దేవాలయం బాధ్యతలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కో పీఠం చూసుకుంటుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే పర్యాయ ఉత్సవాలలో బాధ్యతల మార్పిడి జరుగుతుంది. మకర సంక్రాంతి, హనుమాన్ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, మహాశివరాత్రి మహోత్సవం, దసరా, నరక చతుర్దశి, దీపావళి, గీతాజయంతి, ఇలాంటి పండుగలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.
కృష్ణ తత్వాన్ని బోధిస్తూ భక్తి కేంద్రంగా వెలుగొందుతునన ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుడు స్వయంగా కొలువుదీరి ఉన్నాడని భక్తుల నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా భక్తులు దర్శించుకుంటూ తన్మయత్వాన్ని పొందుతున్నారు.
Horoscope7th July 2022: ఈ రాశివారు కెరీర్లో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు, జులై 7 గురువారం రాశిఫలాలు
Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు
Panchang 7th July 2022: జులై 7 గురువారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, జ్ఞానసంపదనిచ్చే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ
Ashada Masam 2022 : ఆషాడాన్ని శూన్య మాసం అని ఎందుకంటారు!
TRS Again Sentiment Plan : ఈ సారి అదే బ్రహ్మాస్త్రాన్ని వాడనున్న టీఆర్ఎస్ ! అదొక్కటే మార్పు - మిగతా అంతా సేమ్ టు సేమ్ !
Cooking Oil Prices: గుడ్ న్యూస్! భారీగా తగ్గనున్న వంట నూనెలు, పప్పుల ధరలు!
India vs WI: టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ - ఈసారి చాన్స్ ఎవరికంటే?
Naga Chaitanya: చైతు ఎమోషనల్ థాంక్యూ నోట్ - అందులో సమంత హ్యాష్ కూడా!