Medaram Jathara 2024: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం - గద్దెపై కొలువుదీరిన సమ్మక్క, నేడు దర్శించుకోనున్న గవర్నర్, సీఎం
Medaram Jathara: వన దేవతల పండుగ మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం రాత్రి సమ్మక్కను పూజారులు గద్దెపై ప్రతిష్టించడంతో భక్తజనం పరవశించిపోయారు.
![Medaram Jathara 2024: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం - గద్దెపై కొలువుదీరిన సమ్మక్క, నేడు దర్శించుకోనున్న గవర్నర్, సీఎం key moment in medaram sammakka entered in jathara Medaram Jathara 2024: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం - గద్దెపై కొలువుదీరిన సమ్మక్క, నేడు దర్శించుకోనున్న గవర్నర్, సీఎం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/5aee693e8aa06337f1676ed7c6b64a091708651225693876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sammakka Entered In Medaram: భక్తకోటి పులకించింది.. మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కనుల నిండుగా జయ జయ ధ్వానాల మధ్య తమ ఇలవేల్పు, వనదేవత సమ్మక్క అమ్మవారు మేడారం గురువారం రాత్రి గద్దెపైకి చేరుకున్నారు. చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరిణె రూపంలో అమ్మను ఆదివాసీ పూజారులు తీసుకొచ్చే ఘట్టాన్ని చూసిన భక్త జనం పరవశించిపోయారు. శివశక్తుల పూనకాలు, భక్తుల నినాదాల మధ్య సమ్మెక్క గద్దెపై ఆశీనులయ్యారు. పూజా క్రతువులు పూర్తైన అనంతరం ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఇప్పటికే సారలమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం, భక్తులు పెద్దమ్మగా కొలిచే సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతరకు నిండుదనం వచ్చింది. ఎటు చూసినా భక్తజన సంద్రమే కనిపిస్తోంది. వనం నుంచి జనంలోకి వచ్చిన తమ ఇలవేల్పును చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
కాల్పులతో ఘన స్వాగతం
సమ్మక్క ఆగమనంతో గురువారం మొత్తం సాగింది. గురువారం తెల్లవారుజామునే మేడారానికి సమీపంలోని పడిగాపూర్ సమీప అడవిలోకి వెళ్లిన పూజారులు వెదురువనాన్ని ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పూజారులు సిద్ధబోయిన మునీందర్, మహేశ్, లక్ష్మయ్య, జగ్గారావు, వడ్డె కొక్కెర కృష్ణయ్య తదితరులు చిలకలగుట్టపైకి వెళ్లి రహస్య పూజలు చేశారు. చిలగలగుట్ట మీద నుంచి కిందికి వచ్చే సమయంలోనే సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఉత్సవ కమిటీ ఛైర్మన్ అర్రెం లచ్చుపటేల్, ఎస్పీ శబరీశ్ తో పాటు ముఖ్య అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు సాయంత్రం 4 గంటల నుంచే గుట్ట కింద వేచి ఉన్నారు. అనంతరం సాయంత్రం పూజా క్రతువులు పూర్తైన తర్వాత 6.51 గంటలకు పూజారులు గుట్ట దిగుతుండగా ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు వైభవంగా ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఊరేగింపు గుట్ట దిగిన తర్వాత మరోసారి గాల్లోకి కాల్పులు జరిపారు.
ఉత్సాహంగా ఊరేగింపు
వనం సమ్మక్క తల్లి ఆగమనం ఆద్యంతం అందమైన ముగ్గుల మధ్య ఉత్సాహంగా సాగింది. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకూ దారి పొడవునా భక్తులు అందమైన ముగ్గులు వేయగా.. వాటి మధ్య నుంచి వన దేవత వేంచేశారు. చెలపెయ్య చెట్టు వద్ద ఉన్న పూజా మందిరంలో ఊరేగింపును ఆపి అమ్మవారికి కాసేపు విశ్రాంతి ఇచ్చారు. ఆ సమయంలో ఎస్పీ మరోసారి గాల్లోకి కాల్పులు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మళ్లీ ఊరేగింపు మొదలై మేడారం గద్దెల వరకూ సాగింది. ఈ క్రమంలో ఇరువైపులా దారి పొడవునా భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. ఎదురుకోళ్లు సమర్పిస్తూ నిండు కుండలతో నీళ్లారబోస్తూ హారతులు పట్టారు. రాత్రి 9.23 గంటల సమయంలో డోలీ వాయిద్యాలు.. భక్తుల జయ ధ్వానాలు.. మహిళల నృత్యాలు.. ఆధ్యాత్మిక సంబురంలో భక్తులు పరవశించగా.. పుణ్య ఘడియల్లో సమ్మక్క అమ్మవారిని పూజారులు గద్దెపై ప్రతిష్టించారు.
నేడు గవర్నర్, సీఎం రాక
మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వస్తారని మంత్రి సీతక్క తెలిపారు. ఉదయం 10 గంటలకు గవర్నర్ తమిళిసై, మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ గద్దెలను దర్శించుకుంటారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)