Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో ఏ మూల చీకటిగా ఉండకూడదు - ఇంకా ఈ నియమాలు పాటించండి!
Karthika Pournami: కార్తీక పౌర్ణమినే దేవ్ దీపావళి అంటారు..దేవతలంతా ఈ రోజు భూమ్మీదకు దిగి వస్తారని విశ్వాసం. అందుకే ఈ రోజు దీపాల వెలుగులతో వారికి ఆహ్వానం పలుకుతారు.
Karthika Pournami 2024: అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కొన్ని నియమాలు పాటించాలి..కొన్ని పనులు అస్సలు చేయకూడదు. చేయాల్సిన పనులు చేయకపోయినా పర్వాలేదు కానీ చేయకూడనివి అనుసరించకపోవడం మంచిదంటున్నారు పండింతులు.
కార్తీక పౌర్ణమి రోజు గంగాస్నానం చాలా ముఖ్యం. ఈ రోజు చేసే దాన ధర్మాలు రెట్టింపు పుణ్యఫలాన్ని అందిస్తాయి.
కార్తీకం శివకేశవవుల మాసం. చీకటికి తొలగించి వెలుగును ప్రసాదించే పౌర్ణమి రోజు శివారాధన అత్యుత్తమం. ఈ రోజు ఆలయాల్లో , ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే ఆ ఇంట సకల శుభాలు కలుగుతాయి.
పౌర్ణమి రోజు సూర్యాస్తమయం తర్వాత శివాలయం లేదంటే రావిచెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు..
కార్తీక పౌర్ణమి రోజు శివుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఈశ్వరుడి అనుగ్రహం సిద్ధిస్తుందంటారు.
వివాహం కానివారు ఉసిరి-తులసి మొక్కను ఒకేదగ్గర చేర్చి ఆ పక్కనే రాధాకృష్ణుల విగ్రహం పెట్టి పూజిస్తే కోరిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభిస్తారట
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి కాయలు దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ రోజు శివార్చన, విష్ణు సహస్రనామపారాయణతో పాటూ లలితా పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా పఠిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుంది.
పేదలకు అన్నదానం, వస్త్రదానం, అనారోగ్యంతో ఉండేవారికి పండ్లు దానం చేయాలి
నదీ సమీపంలో కానీ ఆలయంలో కానీ దీపదానం చేయాలి
చంద్రుడిని పూజించి అర్ఘ్యం సమర్పించాలి
Also Read: కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి
కార్తీక పౌర్ణమి రోజు ఇవి చేయకండి
కార్తీక పౌర్ణమి రోజు వెండి పాత్రలు లేదా పాలను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. ఈ రోజు ఇంట్లో ఏ మూలా చీకటి కనిపించకూడదు. ఇల్లంతా పండు వెన్నెలెలా ఉండాలి. అయితే దీపాలు లేదంటే లైట్లతో ఇల్లంతా వెలుగులు నిండి ఉండాలి. ఈ రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి, కేవలం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉపవాసం ఉంటూ నియమాలు పాటిస్తే ఇంకా మంచిది. ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను ఆకలితో పంపించవద్దు.
కార్తీకమాసంలో పాటించే ప్రతి నియమం వెనుకా ఓ ఆరోగ్య రహస్యం ఉంటుంది. ఉపవాసం ఈ కోవకే చెందుతుంది. కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ పండ్లు మాత్రమే తీసుకోవాలి. మర్నాడు పూజ నైవేద్యం అనంతరం ఉపవాసం విరమించాలి.
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
ఓం నమఃశివాయ
ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితంలో వెలుగులు నింపాలని శివ కేశవులను ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
Also Read: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఏ సమయంలో వెలిగించాలి , ఎక్కడ వెలిగిస్తే మంచిది!