Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Hyderabad News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Telangana High Court Granted Interim Bail To Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun) పోలీసులు చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. జైలుకు తరలించారు. ఈ క్రమంలో జైలు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. జైలు వద్దకు భారీగా బన్నీ అభిమానులు వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, ఈ కేసులో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బన్నీ వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. కాగా, అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై పీపీ అభ్యంతరం తెలిపారు.
కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా నటుడు అల్లు అర్జున్‌ను శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని తెలిపారు. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను ఆయనకు ఆపాదించాలా అని ప్రశ్నించింది. చనిపోయిన రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని తెలిపింది. అరెస్టైన తర్వాత సీనియర్ లాయర్లను రంగంలోకి దింపిన బన్నీ క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. మొదట 2 గంటలకు.. తర్వాత 2 గంటలకు వాదనలు జరిగాయి. అక్కడ కూడా ప్రభుత్వం తరఫు లాయర్.. బన్నీకి రిలీఫ్ ఇవ్వొద్దని గట్టిగా వాదించారు. తాము కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడం.. అప్పటికి దిగువ కోర్టు ద్వారా రిమాండ్‌కు తరలిస్తారని స్పష్టత వచ్చింది. అయితే హైకోర్టు నిర్ణయం కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీకి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది.
మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతురాలు రేవతి భర్త భాస్కర్ అవసరమైతే తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానని వెల్లడించారు. ఈ ఘటనతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని.. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్‌తో పాటు ఆ రోజు చాలామంది థియేటర్‌కు వచ్చారని అన్నారు. 'నా కుమారుడు పుష్ప 2 సినిమా చూస్తానంటే సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లాను. ఇందులో అల్లు అర్జున్ తప్పేం లేదు. ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రిలో ఉన్న నేను ఫోన్‌లో అరెస్ట్ వార్త చూశాను. కేసు విత్ డ్రాకు సిద్ధంగా ఉన్నా.' అని స్పష్టం చేశారు.