Jyeshtha Amavasya 2025: జ్యేష్ఠ అమావాస్య, వటసావిత్రి వ్రతం - ఈ ప్రత్యేకమైన రోజు ఈ పనులు చేస్తే గ్రహ దోషాలు తొలగి, శుభాలు కలుగుతాయి!
Jyeshtha Amavasya 2025: జూన్ 25 బుధవారం జ్యేష్ఠ అమావాస్య, జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేయనివారు అమావాస్య రోజు చేస్తారు. ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి

Jyeshtha Amavasya Special 2025: జూన్ 25 జ్యేష్ఠ అమావాస్య . ప్రతి తిథికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అందులో పౌర్ణమి, అమావాస్య తిథులు మరింత ప్రత్యేకం. జూన్ 25 బుధవారం జ్యేష్ఠ అమావాస్య వచ్చింది. ఈ రోజు పితృదేవతల ఆరాధనకు మంచి రోజు, ఇదే రోజు వటవృక్షాన్ని పూజిస్తే జాతకంలో ఉండే గ్రహదోషాలు తొలగిపోతాయి. జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని నియమాలు పాటిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
నదీస్నానం
జ్యేష్ఠ అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించడం ఉత్తమం. నది వద్దకు వెళ్లలేని వారు నదీ జలం ఏదైనా ఇంట్లో ఉంటే దాన్ని నీటిలో కలుపుకుని స్నానమాచరించినా మంచి ఫలితం ఉంటుంది . స్నానం అనంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
వటసావిత్రి వ్రతం
భర్త సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లిపోతున్న యముడిని పట్టువదలక అనుసరిస్తుంది సావిత్రి. ఆమె పతిభక్తిని మెచ్చి యముడు సత్యవంతుడి ప్రాణాలు తిరిగి ఇచ్చాడు. వటసావిత్రి వ్రతం చేసిన తర్వాత సావిత్రి తన ఐదోతనాన్ని నిలుపుకుందని చెబుతారు. అందుకే వివాహిత స్త్రీలు వటసావిత్రి వ్రతం చేస్తే సౌభాగ్యవంతులవుతారని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. ఈరోజు మర్రిచెట్టును సిందూరంతో అలంకరించి నూలుదారం పోగులను చెట్టుకి కడుతూ 108 ప్రదక్షిమలు చేస్తారు. ఈ సమయంలో నమో వైవశ్వతాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. అనంతరం మర్రిచెట్టుకి పసుపు,కుంకుమ, పూలు, గాజులు సహా సౌభాగ్యానికి చిహ్నాలైన వస్తువులు సమర్పిస్తారు. మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు భక్తులు. అందుకే త్రిమూర్తులను పూజిస్తూ తమ కుటుంబానికి అండగా నిలవాలని ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని పూజిస్తారు. ఈ పూజ పూర్తిచేసి సావిత్రి-సత్యవంతుడి కథ వింటే వ్రత ఫలితం దక్కుతుందని చెబుతారు. రోజంతా ఉపవాసం పాటించి చీకటి పడిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు..ఈ రోజు కుదరని వారు జ్యేష్ఠ అమావాస్య రోజు ఆచరిస్తారు. ప్రత్యేక పూజలు చేయలేకపోయినా మర్రిచెట్టుకి నీళ్లు సమర్పించి, దీపం వెలిగించి నివేదిస్తే.. అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
పితృదేవతలకు ప్రత్యేకం
అమావాస్య రోజు పితృదేవతలను పూజించినా, తర్పణాలు విడిచిపెట్టినా ఆ ఇంట్లో మంచి జరుగుతుంది. పిండ ప్రదానాలు, పితృదేవతలకు తర్పమాలు విడుస్తారు.
శివపూజ
జ్యేష్ఠ అమావాస్య రోజు శివ పూజ ఆచరిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజు ఆలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకోవడం, అభిషేకం చేసుకోవడం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శివాలయానికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు.
రావిచెట్టు పూజ
మర్రిచెట్టు వద్ద మాత్రమే కాదు రావి చెట్టు దగ్గర కూడా అమావాస్య రోజు దీపం వెలిగించి పూజ చేస్తే మంచి జరుగుతుంది. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది
దానాలు
జ్యేష్ఠ అమావాస్య రోజు అన్నదానం, వస్త్రాలు, పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. జాతకంలో శని ప్రభావం ఉన్న వారు జ్యేష్ఠ అమావాస్య రోజు శనికి నూనెతో అభిషేకం జరిపిస్తే మంచిది.
ఉపవాసం
జ్యేష్ఠ అమావాస్య రోజు ఉపవాసం ఉండటం వల్ల శరీరం, మనసు, ఆత్మ శుద్ధి అవుతాయి. వివాహిత స్త్రీల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. ఈ రోజు సంధ్యాసమయంలో దీపదానం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు.
ఏం చేయకూడదు
జ్యేష్ఠ అమావాస్య రోజు మద్యం, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. నూతన వస్తువులు కొనుగోలు చేయొద్దు. ఇనుము వస్తువులు, నూనె కొనుగోలు చేయకూడదు. నువ్వులు చేతికి అందుకోకూడదు.
గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..






















