Hanuman: హనుమాన్ వాహనం ఒంటెనా? రామభక్తుడి రహస్య కథ, ఆశ్చర్యపరిచే నిజాలు!
Vanara Gita: ఆంజనేయుడు అనగానే రామభక్తుడిగా అంజలి ఘటించిన రూపం, వాయువేగంతో ఆకాశంలో ఎగిరే రూపం కళ్లముందు కనిపిస్తుంది. సీతారాములను తన భుజంపై పెట్టుకుని కనిపించే హనుమాన్ కి వాహనం ఉందని తెలుసా?

The vahana of Lord Hanuman: కొన్ని ఆలయాల్లో ఆంజనేయుడికి వాహనంగా ఒంటె కనిపిస్తుంది. కొన్ని ఆలయాల్లో రామభక్తుడు మాత్రమే కొలువుతీరి ఉంటాడు. అయితే ఈ సంఘటన గురించి వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ దీనికి సంబంధించిన కథ పరాసర సంహితలో ఉంది.
పరాసర సంహిత ప్రకారం
భీకరంగా జరిగిన యుద్ధంలో దుందుభిని వధించాడు వాలి. ఆ మృతదేహాన్ని రుష్యమూక పర్వతంపై విసిరేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటన వాలి-సుగ్రీవుల మధ్య వైరాన్ని రగిలించింది. ఆ మృతదేహాన్ని రుష్యమూక పర్వతంపై వాలి పడేయడాన్ని అక్కడే తపస్సు చేసుకుంటున్న మాతంగ ముని చూశారు. వాలి మరోసారి ఈ పర్వతంపై కాలుమోపితే మరణిస్తాడంటూ శాపాన్నిచ్చాడు. ఆ తర్వాత కాలంలో సుగ్రీవుడిని చంపేందుకు వాలి సిద్ధమయ్యాడు. ఈ శాపం గురించి ముందే తెలిసిన సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడిని చూసేందుకు వచ్చిన హనుమంతుడు..పంపా సరోవరాన్ని చూడాలని ఉందని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు పంపా సరోవరం తిరిగివచ్చేందుకు వీలుగా ఒంటెను సిద్ధం చేశాడు సుగ్రీవుడు. అలా ఆంజనేయుడికి ఆ సమయంలో ఒంటె వాహనం అయింది.
ఆంజనేయుడు మొదట శ్రీ రామచంద్రుడిని కలిసిన ప్రదేశం
అయితే ఆంజనేయుడు శ్రీరాముడిని కలుసుకున్నది మొదట ఈ పంపాతీరంలోనే. ఎందుకంటే.. సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు పంపా తీరానికి చేరుకుంటారు. దనుర్భాణాలు ధరించి వస్తున్న వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని హనుమను పంపిస్తాడు సుగ్రీవుడు. అలా ఆంజనేయుడు మొదటిసారిగా శ్రీరాముడిని పంపాతీరంలో కలుసుకున్నాడు. అందుకే ఈ ప్రాంతం అంటే వాయుపుత్రుడికి అత్యంత ఇష్టం. ఆయన భజనలు కీర్తనల్లోనూ ‘పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే’ అని ఉంటుంది. ఈ నదీతీరంలో దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. అందుకే ఈ ప్రాంతంలో తిరిగేందుకు అనువుగా ఆంజనేయుడికి ఒంటెను ఇచ్చాడు సుగ్రీవుడు.
హనుమంతుడి ధ్వజంపైనా ఒంటె గుర్తే ఉంటుంది మీరు గమనించారా?
రుద్రాంశ సంభూతుడు అయిన హనుమాన్ వృషభం లాంటి బలిష్టమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. అయితే అన్ని హనుమాన్ ఆలయాల్లో ఒంటె ఉండదు. సువర్చలా సహిత ఆంజనేయ ఆలయాల్లో శివుడి ముందు నందిలా ఆంజనేయుడి ముందు ఒంటె విగ్రహం ఉంటుంది.
ఆంజనేయుడి వాహనం ఒంటె అని చెప్పడం వెనుక ఆంతర్యం?
వాయుపుత్రుడైన హనుమాన్ మనోవేగంతో ప్రయాణిస్తాడని చెబుతారు. ఎడారిలో మనిషికి సహాయపడే చివరి ఆశ్రయం ఒంటె. అలా జీవితంలో ఎలాంటి ఆధారం ఇక లేదు, ఎలాంటి ఆశ లేదని భావించేవారు...హనుమంతుడిని ప్రార్థిస్తే కష్టాల నుంచి బయటపడేస్తాడని ఈ కథ వెనకున్న ఆంతర్యం.
హనుమాన్ శ్లోకం
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం॥
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి॥
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్
గమనిక: ఆధ్యాత్మిక వేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పేర్కొన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించండి






















