Hindu Marriage System: పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!
హిందువుల పెళ్లిళ్లలో పాటించే సంప్రదాయాలు, పద్దతుల వెనుక ఆంతర్యం ఉంది. వాటిలో ఒకటి జీలకర్ర, బెల్లం. ఇంతకీ పెళ్లిలో ఈ రెండే ఎందుకు పెడతారు...
Hindu Marriage System: ఇప్పుడంటే పెళ్లి చూపులు అయినప్పటి నుంచీ అమ్మాయి, అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు, కలుస్తున్నారు కానీ అప్పట్లో పెళ్లికి ముందు కలవడం, మాట్లాడుకోవడమే కాదు కనీసం చూసేవారు కూడా కాదు. వాస్తవానికి పెళ్లిచూపులు అయి సంబంధం నిశ్చయం అయిన తర్వాత మండపంలో జీలకర్ర బెల్లం పెట్టేవరకూ ఒకర్నొకరు చూసుకోరు. అందుకే అడ్డుగా తెర పట్టుకుని నిల్చుంటారు. ఇంతకీ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు, దానివెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా..
Also Read: శుక్రుడు-కుజుడి సంచారం ఈ 4రాశులవారికి అస్సలు బాలేదు!
ఒకటి కరిగేది-మరొకటి తనలో ఇముడ్చుకునేది!
మండపంలోకి పెళ్లికూతుర్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటికే పెళ్లికుమారుడిని అక్కడ కూర్చోబెట్టి ఇద్దరి మధ్యా తెరపట్టుకుని నిల్చుంటారు. ఒకరి తలమీద మరొకరు జీలకర్ర బెల్లంపెట్టిన తర్వాతే వారి మధ్య ఉన్న తెరనితొలగిస్తారు. అప్పుడు వెంటనే ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ భృకుటిని చూసుకుంటారు. ఆ సమయంలో వధూవరుల స్పర్శ, చూపు...రెండూ కూడా శుభ్రప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టారు పెద్దలు. జీలకర్ర, బెల్లం రెండింటికీ వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషమూ మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పూ లేకుండానే అంటిపెట్టుకుని ఉన్న పదార్థానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహబంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే, ఎవరి అస్తితత్వాన్ని వారు నిలుపుకోవాలనీ..తనలో సద్గుణాలని ఎదుటివారికి అందించాలనీ ఈ రెండు పదార్థాల కలయిక వెనుకున్న అర్థం.
సహస్రార, ఆజ్ఞా చక్రాలను మేల్కొలిపే ప్రయత్నం
జీలకర్ర, బెల్లం ఈ రెండూ పూర్తి భిన్నమైన పదార్థాలు. కానీ రెండింటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నోరకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒంటికి చలవచేయడం దగ్గర్నుంచీ, రక్తహీనతని తగ్గించడం వరకూ జీలకర్ర, బెల్లం చాలా సమస్యలని పరిష్కరిస్తాయి. భార్యా, భర్తా కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగినవారైనప్పటికీ...ఎలాంటి సమస్యనైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. జీలకర్ర, బెల్లం రెండింటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందనీ కొందరు నమ్ముతారు. వధూవరులు ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టి ఉంచడంతో, వారిద్దరూ మధ్యా ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుందని చెబుతారు. జీలకర్ర, బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణం అంటారు. యోగశాస్త్రం ప్రకారం జీలకర్ర, బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలనీ మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందన్న మాట! ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిల్చిపోతుందని చెబుతారు.
Also Read: పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!
జీలకర్ర, బెల్లం పెట్టే ఆచారం హిందూ పెళ్లిళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మన దగ్గర సుముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టడమే. అందుకే
‘’ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః
ధ్రువంత ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాజ్యం ధారయతాం ధ్రువమ్"
వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు. దీని అర్థం ఏంటంటే..ధ్రువం అంటే శాశ్వతం, రాజులకు శ్రేష్టడైన ఇంద్రుడు, జలానికి అధిష్టుడైన వరుణుడు, వేదానికి అధిష్టాన పురుషుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని ....ఈ జంటకు శాశ్వతత్వాన్ని ప్రసాదంచండి అని అర్థం.
జీలకర్రకి ముసలితనం రాకుండా చేసే గుణం ఉంటుంది. బెల్లమేమో అమృతంతో సమానం అనే అర్థం ఉంది. ఈ రెండూ కలిస్తే నిత్య యవ్వనమే. అంటే కలకాలం నిత్యయవ్వనవంతుల్లా ఉండాలని దీవించడమే దీనివెనుకున్న ఆంతర్యం.