Shodasa Samskara In Telugu:పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!
Shodasa Samskaras: సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా అంటారు. పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకూ ఉండే ఆ 16 సంస్కారాలేంటో చూద్దాం...
![Shodasa Samskara In Telugu:పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే! Hindu Sanskaram:What are the Shodasa Samskaras and Significance, know in telugu Shodasa Samskara In Telugu:పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/11/f25db5a9bac79dcd12610c51462dd55b1683802302361217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shodasa Samskara In Telugu: హిందూ ధర్మంలో అనేక సంప్రదాయాలు , విశ్వాసాలను పాటిస్తారు. ఎన్ని పద్ధతులు పాటించినా ప్రాణి భూమ్మీద పడినప్పటి నుంచి మరణించి మరుభూమికి చేరుకునేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలను అనుసరిస్తారు. అవేంటంటే...
1. గర్భాదానం
అత్యంత పవిత్రమైన కార్యం ఇది..మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్ నైట్. స్త్రీ పురుషులు (భార్యభర్తలు) ఇద్దరూ కలసి ఓ కొత్తప్రాణికి జీవం పోయడాన్ని గర్భాదానం అంటారు. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండం..పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవికి జన్మనిస్తుంది. వివాహిత స్త్రీ స్వచ్ఛమైన ఆలోచనలతో, శారీరక ఆరోగ్యంతో గర్భం దాల్చినప్పుడు.. ఆమె ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనిస్తుంది. హిందూమతంలో ఈ ఆచారం కుటుంబ వృద్ధిని సూచిస్తుంది.
2. పుంసవనం
ఇప్పటితరంలో ఆడపిల్ల, మగపిల్లడు అంటూ ఎవరూ ఎలాంటి వ్యత్యాసం చూపించడం లేదుకానీ..అప్పట్లో మగపిల్లాడు పుట్టేవరకూ కంటూనే ఉండేవారు. వారసుడు తప్పనిసరిగా ఉండాలనుకునేవారు. అందుకే గర్భందాల్చిన తర్వాత పుంసవనం చేయించేవారు. ఈ క్రతువు చేస్తే మగపిల్లాడు పుడతాడని విశ్వశించేవారు. ఇది జరిపించిన తర్వాత కూడా ఆడపిల్ల పుట్టిన సందర్భాలున్నాయి.
3.సీమంతం
16 ముఖ్యమైన సంస్కారాల్లో సీమంతం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు మంచి గుణాలు, మంచి స్వభావం ఉంటుందని విశ్వసిస్తారు.ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని నమ్మకం
4.జాతకకర్మ
బిడ్డ పుట్టిన తర్వాత జరిపే సంస్కారం జాతకర్మ. గర్భంలో ఏర్పడిన దోషాలను తొలగించే ఈ వ్రతంలో నవజాత శిశువుకు ఉంగరపు వేలు నుంచి లేదా..బంగారు స్పూన్ నుంచి తేనె , నెయ్యి ఇస్తారు. నెయ్యి ఆయుష్షును పొడిగించగలదని పిత్త వాతాలను నాశనం చేస్తుందని నమ్ముతారు. తేనెను కఫ నిరోధకం కోసం వినియోగిస్తారు.
Also Read: అక్రమ సంబంధాలకు కూడా గ్రహస్థితే కారణమా, జాతక చక్రంలో ఈ గ్రహాలు అస్సలు కలసి ఉండకూడదు!
5. నామకరణ వేడుక
నామకరణ మహోత్సవం గురించి అందరికీ తెలిసినవిషయమే. అప్పట్లో ఏదో అలా పేరు పెట్టేసేవారు కానీ ఇప్పుడు భారీ భారీ వేడుకలే నిర్వహిస్తున్నారు.
6. ఇల్లు దాటించడం
బిడ్డ జన్మించిన తర్వాత మొదటి సారిగా ఇల్లు దాటించడాన్ని నిష్క్రమణ అంటారు. అమ్మ కడుపులోంచి భూమ్మీద పడినతర్వాత మొదటి సారిగా ఇల్లు దాటేందుకు మంచి రోజు చూసి తీసుకెళతారు..అదికూడా మొదటిసారిగా ఆలయానికి తీసుకెళ్లడం హిందూ సంప్రదాయం.
7. అన్నప్రాశన
పెరిగే బిడ్డకు భౌతికావసరాలు తీర్చడానికి ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టే ప్రక్రియ ఇది. ఈ ఆచారం ద్వారా నవజాత శిశువుకు మొదటిసారి ఆహారం అందిస్తారు.
8. కేశ ఖండన
దీర్ఘాయుష్షు, అందమైన రూపం కలగాలని ఆశిస్తూ చేసే సంస్కారం ‘కేశ ఖండనం’..దీనినే పుట్టు వెంట్రుకలు తీయించడం అంటారు. ఈ సంస్కారం ముఖ్య ఉద్దేశం బిడ్డకు బలం, వయస్సు మెరుపు అందించడమే.
9. చెవులు కుట్టించడం
బిడ్డడికి ఐదేళ్ళ లోపు చేయవలసిన సంస్కా రం ఇది. దీనిని ‘కర్ణవేధ’ అంటారు. కర్ణాభరణాలు ధరించడం అందంకోసమే కాక, ఆరోగ్య రీత్యా కూడా అవసరం.
10. అక్షరాభ్యాసం ఉపనయనం
బిడ్డ కొంత మానసిక పరిపక్వత చెంది..కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధపడే సమయంలో చేసే సంస్కారాన్ని ‘అక్షరాభ్యాసం’ అంటారు. ఈ క్రతువును ఏడో సంవత్సరంలో చేయాలని చెప్పారు అప్పటి రుషులు...ఎందుకంటే అదే సమయంలో అక్షరాభ్యాసం, ఉపనయనం జరిపించి గురువుల వద్దకు విద్యకోసం పంపించేవారు.
Also Read: శ్మశానాల్లోకి స్త్రీలు అడుగుపెడితే!
11. కేశాంత
అబ్బాయికి పదాహారేళ్ళ వయసు వచ్చాక మొదటిసారి గడ్డం గీసుకోడానికి సంబంధించిన సంస్కారాన్ని ‘కేశాంత’ అంటారు
12. సమావర్తన
అప్పట్లో విద్యాభ్యాసం ముగించుకుని గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నిర్వహించే సంస్కారాన్ని ‘సమావర్తన’ అంటారు. దీనికే ‘స్నాతకము’ అనే పేరు కూడా ఉంది.
13. సమకాలీన సంస్కృతి
సమావర్తనతో విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన యువకుని ముందు రెండు మార్గాలుంటాయి. ఉద్యోగం చేస్తూ ధనం సంపాదించి పెళ్లి చేసుకుని గృహస్థ జీవితం గడపడం...గడించిన జ్ఞానంతో భౌతిక, మానసిక సంబంధాలకు దూరంగా జపతపాలతో ఆధ్యాత్మిక జీవితం గడపడం
మొదటి మార్గం అనుసరించేవారిని ఉపకుర్వనులు అని, రెండవ మార్గంలో ఉన్నవారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం అనుసరించాలన్నా గురువు అనుమతి తప్పని సరి.
14. వివాహ వేడుక
వరునికి తగిన వధువును చూసి పెళ్లి చేయడం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఆఖరిక్షణం వరకూ ఆమెతోనే కలసి బతకాలన్నది శాస్త్రవచనం
15. వివాహ అగ్ని ఆచారాలు
వివాహం తర్వాత ఇంటికి చేరిన తర్వాత ఇంట్లో మొదటి సారిగా దీపం వెలిగించే సంస్కారం కూడా గొప్పది. ఆ రోజు నుంచి ఆ ఇంటి వెలుగుకి కారణం అవుతానని చెప్పడమే దీనివెనుక ఆంతర్యం
16. అంత్యక్రియలు
మనిషి జీవితంలో ఆఖరి మజిలీ అంత్యేష్ఠి. చనిపోయిన వ్యక్తి కుమారులు..తమవారి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని నిర్వహించే కార్యక్రమాన్ని అంత్యక్రియలు అంటారు. వేద మంత్రాల మధ్య కొడుకుతో తలకు నిప్పు పెట్టిస్తారు. పద మూడు రోజుల కర్మకాండ అయ్యాక అన్న సంతర్పణ చేయడంతో ఆ సంస్కారం పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)