Happy Mother's Day 2025: తనయులని వీరులుగా తీర్చిదిద్దారు.. అమ్మ అంటే ఇలా ఉండాలి!
Happy Mothers Day: అమ్మ..ఈ రెండక్షరాలవెనుకున్న ప్రేమని వర్ణించడం ఏ కలానికి , కుంచెకు సరిపోదు. ఆ ప్రేమకు సాటెవరూ రారు. అలాంటి అమ్మలు కొందరు పురాణాల్లో ఉన్నారు..వారి గురించి ప్రత్యేక కథనం

Legendary Mothers of Mythology: కుటుంబంలో అన్నీ బావున్నప్పుడు అమ్మా-నాన్న కలసి పిల్లల్ని తీర్చిదిద్దడం వేరు. సింగిల్ మదర్ గా సవాళ్లను ఎదుర్కొంటూ పిల్లల్ని వీరులుగా మలచడం వేరు. సింగిల్ మదర్ అనే మాట చెప్పుకున్నంత ఈజీ టాస్క్ కాదు. ప్రతి క్షణం పోరాటమే..ప్రతి అడుగులోనూ సవాళ్లే.. అయినప్పటికీ అమ్మ గెలుస్తుంది..అమ్మగా ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది.
ప్రేయసి అందాన్ని వర్ణించగలరు, రాజుల్లో వీరత్వం పొడగగలరు కానీ అక్షరానికి, ఉపన్యాసానికి అందనిది అమ్మ ప్రేమ గురించి ఎవరు చెప్పగలరు, ఏం చెప్పగలరు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు... ఆమె పంచిన ప్రేమ, పెంచిన జ్ఞానం, నేర్పించిన సంస్కారానికి కళ్లుమూసుకుని కృతజ్ఞతలు తెలియయడం కన్నా.
అమ్మకు ఏం ఇస్తే రుణం తీరుతుంది..పిల్లల నుంచి ఏమైనా ఆశిస్తే కదా ఆమెకు ఏం ఇవ్వాలో ఆలోచించడానికి. అందుకే ఆదిశంకరాచార్యులు అన్నారు “కు పుత్రో జాయేత క్వచిదపి కు మాతా న భవతి ” ... అంటే చెడ్డ కుమారులు ఉండొచ్చు కానీ చెడు తల్లి ఎక్కడా ఉండదు అని అర్థం . తామున్న పరిస్థితులు ఏమైనా కానీ, అండగానిలవాల్సిన కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సినా,జీవితం ఊహించని మలుపు తిరిగినా అమ్మ ఎన్ని కష్టాలైనా పడుతుంది..కానీ..పిల్లలను తన గుండెలపై పెంచుతుంది. ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని తనయులని వీరులుగా తీర్చిదిద్దిన మాతృదేవతలు పురణాల్లో ఎందరో ఉన్నారు. వారిలో కొందరు లెజెండరీ మదర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సీతమ్మ - లవకుశలు
జనకుడి కుమార్తె అయిన సీత అల్లారుముద్దుగా పెరిగింది..ఏ క్షణం మెట్టినింట అడుగుపెట్టిందో అప్పుడు తన జీవితం ఊహించని మలుపులు తిరిగింది. హారతిచ్చి ఘనంగా స్వాగతం అయితే లభించింది కానీ మరుక్షణమే అడవులకు వెళ్లిపోవాల్సి వచ్చింది. వనవాసంలో అయినా భర్తతో సంతోషంగా ఉందా అంటే అదీ లేదు.. శూర్పణఖ, బంగారు మాయాలేడి, రావణుడు వచ్చి తీసుకెళ్లిపోవడం ఈ కథంగా మీకు తెలిసినదే. ఎట్టకేలకు రామరావణ యుద్ధం తర్వాత తిరిగి అయోధ్యకు చేరుకుంది సీతాదేవి. అప్పుడైనా రాజమాతగా భోగాలు అనుభవిస్తుంది సంతోషంగా ఉంటుంది అనుకుంటే.. లోకుల నిందకు తలొంచి రాముడు మళ్లీ అడవిలో విడిచిపెట్టేశాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుశలకు జన్మనిచ్చిన సీతాదేవి..వారిని వీరులుగా తీర్చిదిద్ది తండ్రి వద్దకు పంపించింది. తండ్రికి దూరంగా ఉన్న ఆ పిల్లలకు తండ్రి అయిన రాముడి గొప్పతనం చెబుతూ విలువిద్యలు నేర్పిస్తూ తండ్రిని మించిన తనయులిగా తీర్దిదిద్దింది.
కుంతీదేవి - పాండవులు
కుంతీ దేవి.. పాండురాజుకి భార్య, పాండవులకు తల్లి, శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడికి సోదరి. దూర్వాస మహర్షి ద్వారా మంత్రోపదేశం పొందిన కుంతీదేవి ఆ మంత్రం పనిచేస్తుందో లేదో పరీక్షించుకుంది. అలా సూర్యభగవానుడి ద్వారా జన్మించినవాడే కర్ణుడు. అప్పటికి కుంతీదేవికి వివాహం జరగలేదు..ఫలితంగా తల్లి ప్రేమను చంపుకుని కర్ణుడిని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పాండురాజుతో వివాహం జరుగుతుంది కానీ పాండురాజుకి ఉన్న శాపం కారణంగా సంతాన యోగ్యం లేదు. అప్పుడు తనకున్న వరం గురించి చెప్పిన కుంతీదేవి..భర్త అనుమతితో యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్వినీదేవతలను ప్రార్థించి పాండువులకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికి పాండురాజు మరణిస్తాడు.. అప్పటి నుంచి పిల్లల్ని వీరులుగా తీర్చిదిద్ది కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించేవరకూ ధైర్యం నూరుపోసి ముందుకు నడిపించింది కుంతి.
శకుంతల - భరతుడు
విశ్వామిత్రుడి తపస్సు భగ్నం చేసేందుకు వచ్చిన మేనక..ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఆమె శకుంతల. పుట్టగానే తల్లిదండ్రులకు దూరమైన శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది. ఆ ప్రదేశంలో వేటకు వచ్చిన దుష్యంతుడు ఆమెను చూసి మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. భరతుడికి జన్మనిస్తుంది శకుంతల. ఆ తర్వాత సకల రాజలాంఛనాలతో నిన్ను రాజ్యానికి తీసుకెళ్తానని వాగ్ధానం చేసిన దుష్యంతుడు శాపం ఫలితంగా శకుంతలను మర్చిపోతాడు. అప్పటి నుంచి తనయుడిని పెంచి వీరుడిగా తీర్చిదిద్దింది శకుంతల.
హిడింబి - ఘటోత్కచుడు
భీముడి ప్రేమలో పడిన హిడింబి..తనతో కలసి ఎప్పటికీ ఉండే అవకాశం లేదని తెలిసినా వివాహం చేసుకుంది. వీరి సంతానమే ఘటోత్కచుడు. హిడింబి కేవలం ఉత్తమ ప్రేమికురాలు మాత్రమే కాదు..ఉత్తమ తల్లి కూడా. భర్త భీముడికి ఇచ్చిన మాటకు కట్టుబడి వారిని అనుసరించకుండా తనయుడితో ఉండిపోయింది. మాయలు, మంత్రాలతో పాటూ యుద్ధవిద్యల్లోనూ వీరుడిగా తీర్చిదిద్దింది. అనుక్షణం పాండవుల గొప్పతనం చెబుతూ వారిపై ప్రేమను పెంచింది. అవసరం అయినప్పుడు సహకారం అందించాలని నేర్పించింది. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన పోరాడి ప్రాణాలు విడిచాడు ఘటోత్కచుడు.
జాబాల-జాబాలి
పిల్లలంతా వేద విద్యను అభ్యసిస్తుంటే జాబాలి అనే పిల్లవాడు కూడా గౌతముడి దగ్గరకు వెళ్లి విద్య నేర్పించమని అడుగుతాడు. నీగోత్రం ఏంటని ప్రశ్నిస్తాడు గౌతముడు..నాకు తెలియదంటూ తల్లిని అడిగాడు.నీ పుట్టుకకు కారణం ఎవరో తనకు కూడా తెలియదు అన్న తల్లి... నా పేరు జాబాల అందుకే నిన్ను జాబాలి అని పిలుస్తున్నా అంటుంది. నిజం నిర్భయంగా మాట్లాడు ఈ రోజు నుంచి నీకు సత్యకామకుడు అనే పేరు పెడుతున్నా అంటుంది. ఇదంతా చెప్పి గౌతముడి దగ్గర పశువుల కాపరిగా చేరి విద్యను అభ్యసించాడు. పురాణాల్లో జాబాలిని రుషిగా గుర్తించి దాన్నో గోత్రంగా సుస్థిరం చేశారు.






















