Garuda purana: ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసా, ఎప్పటికీ గొడవపడకూడనిది వీరితోనే!
Garuda Puranam : గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇందులో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి.
Garuda Puranam : గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. అలాంటి ఐదు అంశాలను ఇప్పుడు చూద్దాం.
1.పని విషయంలో అజాగ్రత్త
సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ, ఉదాసీనంగా ప్రవర్తించే వారిపట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది.
Also Read: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
2.అకారణ కోపం చూపే వారిపై
మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలా మందిని చూస్తుంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తుంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే, మీరు అలాంటి వారికి భయపడితే, మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే, వారు మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించే అవకాశముంది. అందువల్ల వీలైతే, వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అయితే అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి, మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే, మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం.
3.ఇతరుల పట్ల గౌరవం
అందరినీ గౌరవంగా చూడాలి. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు, ఎవరినీ అవమానించకూడదు, ఎవరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంధాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది. ఇతరులతో చెడుగా ప్రవర్తించే వారు నరకానికి వెళ్తారని తెలిపింది.
Also Read: గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా!
4.పొరుగువారితో సత్సంబంధాలు
ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన పక్కన మంచి మాటలు మాట్లాడేవారిని, ప్రియమైన వారిని కలిగి ఉండటం కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యం, ప్రేమ.. జీవితానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టి, మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి.
5.తల్లిదండ్రులకు గౌరవం
తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవపడుతూ, అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకోని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుణ పురాణం వెల్లడిస్తోంది.