Dussehra 2025: దుర్గాష్టమి నుంచి త్రిరాత్ర వ్రతం, ఈ మూడు రోజులు ఎందుకు ప్రత్యేకం? ఏం చేయాలి?
Shardiya Navratri 2025: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు చేసే వ్రతం దేవీ త్రిరాత్ర వ్రతం. దుర్గాష్టమి , మహర్నవమి, విజయదశమి.. ఈ మూడురోజులు ఎందుకంత ప్రత్యేకం?

Dussehra 2025 : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ ప్రతిరోజూ పండుగే. చివరి మూడు రోజులను దేవీ త్రిరాత్ర వ్రతం అంటారు. అవే దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి. ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకాలను, శ్రామికులు పనిముట్లను, క్షత్రియులు ఆయుధాలను పూజిస్తారు. ఈ 3 రోజులు ఎందుకు ప్రత్యేకం? దేవీ త్రిరాత్రవ్రతం అంటే ఏం చేయాలి?
'దుర్' అంటే దుఃఖం.. దుర్వ్యసనం ..దారిద్ర్యం
'గ' అంటే నశింపచేసేది
బాధల్ని నశింపచేసేది దుర్గ అని అర్థం. దేవీ ఆరాధన వల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే దుర్గాఆరాధనకు శరన్నవరాత్రుల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం
నవరాత్రుల్లు తొమ్మిది రోజుల్లో...
మొదటి మూడు రోజులు - అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను జయించేందుకు దుర్గారూపాలను ఆరాధిస్తారు
రెండో మూడు రోజులు - దారిద్ర్యం తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందేందుకు లక్ష్మీరూపాన్ని పూజిస్తారు
చివరి మూడు రోజులు - జ్ఞానం , విజయం కోసం సరస్వతి రూపాన్ని ఆరాధిస్తారు
దుర్గాష్టమి - సెప్టెంబర్ 30 ( Durga Ashtami )
లోహుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందట..అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజిస్తారు. దుర్గ అంటే దుర్గతులు తొలగించేదని అర్థం.
మహర్నవమి - అక్టోబరు 1 (Maha Navami 2025)
నవరాత్రి దీక్షలో మహర్నవమి ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఆయుధ పూజ చేస్తారు.
విజయదశమి - అక్టోబరు 2 ( Vijayadashami 2025)
శ్రవణం నక్షత్రంలో కలసిన ఆశ్వయుజమాసంలో వచ్చిన దశమికి విజయం అని సంకేతం. అందుకే విజయ దశమి అంటారు. సాధారణంగా ఏ పని ప్రారంభించాలన్నా.. తిథి, వారం, నక్షత్రం, ముహూర్తం చూసుకుంటారు. కానీ విజయదశమి రోజు ఎలాంటి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. విజయ దశమిరోజు ఏ పని ఆరంభించినా అపజయం ఉండదు.
శమీపూజ
దశమి రోజు సాయంత్రం చేసే శమీపూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శమీవృక్షం అంటే జమ్మిచెట్టు... అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి ఆయుధాలను దాచిఉంచిన వృక్షం ఇదే. కురుక్షేత్ర సంగ్రామంలో అడుగుపెట్టినప్పుడు జమ్మిచెట్టుకి నమస్కరించి వాటిని తిరిగి తీసుకెళ్లి యుద్ధం చేసి విజయం పొందారు. శమీవృక్షం రూపంల ఉండే అపరాజిత దేవిని పూజిస్తే సర్వత్రా విజయం మీ సొంతం. రావణుడిని సంహరించేందుకు ముందు శ్రీరాముడు కూడా అపరాజిత దేవిని పూజించాడు.
శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ శ్లోకం పఠించండి
శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
ఈ శ్లోకాన్ని ఓ చిన్న పేపర్ పై రాసి దాన్ని శమీ వృక్షానికి తగిలిస్తే మంచి జరుగుతుందని, శనిదోషం తొలగిపోతుందని నమ్మకం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















