Dussehra 2023: దుర్గాదేవి చేతిలోని 8 ఆయుధాలు మనకు చెప్పే 8 జీవిత పాఠాలు ఏమిటో తెలుసా!
Dussehra 2023: దుర్గాదేవి తన 8 చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి దుర్మార్గులను సంహరించి భక్తులను కాపాడుతుంది. అమ్మవారి చేతిలో ఉన్న ప్రతి ఆయుధం వెనుక ఒక పరమార్థం ఉంది. వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు.?
Dussehra 2023: దసరా హిందూ సంస్కృతిలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీనిని జరుపుకుంటారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ శరన్నవరాత్రులు విజయదశమితో ముగుస్తాయి. హిందూధర్మంలో దుర్గాదేవిని శక్తి దేవతగా భావిస్తారు. ఆమె దుష్టులను నాశనం చేస్తుంది, రాక్షసులను సంహరిస్తుంది, సజ్జనులను రక్షిస్తుంది. దుర్గామాత అష్టభుజి, భయంకరమైన సింహంపై స్వారీ చేస్తుంది. అమ్మవారి ఈ 8 చేతులలో వివిధ ఆయుధాలను మనం చూడవచ్చు. ఆమె ఆయుధాలు, శక్తి చిహ్నాలు, మనకు అనేక విషయాలు బోధిస్తాయి.
శంఖం
దుర్గా దేవి తన ఎగువ ఎడమ చేతిలో శంఖాన్ని పట్టుకుని ఉంది. ఇది ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఆమె చేతిలోని శంఖం ధ్వనికి సర్వ ప్రాణుల అన్ని చెడు గుణాలు, సృష్టిలోని అన్ని చెడు అంశాలు భయపడతాయి. దుర్గామాత వరుణదేవుని నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది.
Also Read : శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం నివేదించాలి!
విల్లు-బాణం
దుర్గాదేవి తన రెండవ ఎడమ చేతిలో విల్లు, బాణం ధరించి ఉంటుంది. ఇది శక్తికి చిహ్నం. రాక్షసులతో పోరాడేటప్పుడు అమ్మవారు దీనిని ఉపయోగించింది. దుర్గాదేవి ఈ ఆయుధాన్ని వాయుదేవుడి నుంచి పొందిందని చెబుతారు. దుర్మార్గులను చంపడానికి ఆమె ఈ ఆయుధాన్ని తన చేతుల్లో పట్టుకుంది.
తామర పువ్వు
దుర్గాదేవి తన ఎడమ వైపు మూడవ చేతిలో తామరపువ్వును పట్టుకుంది. ఇది పరిత్యాగానికి సంకేతం. అంటే మనుషులు బాహ్య ప్రపంచంతో అనుబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి. బురదలో వికసించిన తామరపువ్వు లాగా, మానవులు లోకంలో జీవించడం ద్వారా తమ గుణాన్ని పెంపొందించుకోవాలని, ప్రాపంచిక మాలిన్యం, మోహం, దురాశకు దూరంగా ఉండాలని చెబుతోంది.
Also Read: మహా చండీదేవిగా కనక దుర్గమ్మ, ఈ అలంకారం విశిష్ఠత ఏంటో తెలుసా!
త్రిశూలం
దుర్గాదేవి తన ఎడమ వైపు నాల్గవ చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటుంది. అది ఆమెకు అత్యంత శక్తిమంతమైన ఆయుధం. ఈ త్రిశూలంతోనే అమ్మవారు మహిషాసురుడిని సంహరించింది. శివుడు తన త్రిశూలాన్ని దుర్గామాతకు ఇచ్చాడు, ఇది ధైర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. త్రిశూలంలోని మూడు భాగాలు మనకు సత్వ, తమో, రజో అనే మూడు గుణాల గురించి బోధిస్తాయి.
సుదర్శన చక్రం
దుర్గామాత కుడి చేతి చూపుడు వేలుపై సుదర్శన చక్రం ఉంటుంది. శ్రీ కృష్ణ భగవానుడు దుర్గామాతకు తనకు ఇష్టమైన ఈ ఆయుధాన్ని ఇచ్చాడు. ఇది ప్రపంచం మొత్తం ఆమె ఆధీనంలో ఉందని, మొత్తం సృష్టిని ఆ తల్లే నియంత్రిస్తోందని సూచిస్తుంది. అంతేకాకుండా, సుదర్శన చక్రం.. ధర్మానికి చిహ్నం, ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాఠాన్ని బోధిస్తుంది.
ఖడ్గం
దుర్గాదేవి తన కుడివైపు రెండవ చేతిలో ఖడ్గాన్ని కలిగి ఉంటుంది. ఇది చెడు, అజ్ఞానం నిర్మూలనకు చిహ్నం. గణేశుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చాడని చెబుతారు.
గద
దుర్గా దేవి తన కుడి వైపు మూడవ చేతిలో గదను ధరించి ఉంటుంది. దుర్గాదేవికి ఈ గదాయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్లు చెబుతారు. దీనినే కలానందం అంటారు. దీనిని బలం, విధేయత, ప్రేమ, భక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.
Also Read : నవరాత్రి ఉత్సవాల్లో నవదుర్గలకు ఏ రోజు ఏ రంగు వస్త్రాలు, పూలు సమర్పించాలి
ఓంకారం
దుర్గాదేవి ఒక చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది. భక్తులను అనుగ్రహించే అమ్మవారి చేతిలో 'ఓం' చిహ్నాన్ని మనం చూడవచ్చు. ఓం అంటే భగవంతుని గురించిన జ్ఞానం మనలో విత్తుతుంది, అన్ని శక్తులు అందులో ఉన్నాయి.
సింహం
ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు సింహంపై స్వారీ చేస్తుంది. క్రూరత్వం, హింసాత్మక ధోరణులకు చిహ్నంగా సింహాన్ని పరిగణిస్తారు. అలాంటి సింహంపై స్వారీ చేయడం ద్వారా దూకుడు లేదా హింసాత్మక ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అమ్మవారు తెలియజేస్తోంది.
Also Read: ఐదోరోజు కాలస్వరూపిణి 'స్కందమాత'గా శ్రీశైల భ్రమరాంబిక
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.