Dhanteras 2023 Shani Trayodashi: నవంబరు 11 ధనత్రయోదశి, శనిత్రయోదశి - ఇవి పాటించండి!
నవంబరు 11 ధన త్రయోదశి మాత్రమే కాదు..శని త్రయోదశి కూడా. ఈ రోజు శనికి అత్యంత ప్రీతికరమైన రోజు. కొన్ని నియమాలు పాటించడం ద్వారా శని ప్రభావం తగ్గి శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని చెబుతారు
2023 November 11th Dhanteras and Shani Thrayodashi: నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవి కుమారుడు. మనిషి చేసే పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. బతికి ఉండగా చేసే పాపపుణ్యాలను శని పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తిగా వ్యవహరిస్తే మరణానంతరం ఆ పాపపుణ్యాల ఆధారంగా శిక్షలు అమలు చేస్తారు శని సోదరుడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇద్దరూ న్యాయాధికారులే. వాస్తవానికి శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ శనిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని విశ్వాసం. నవంబరు 11 శనివారం రోజు ధనత్రయోదశితో పాటూ శనిత్రయోదశి కూడా కలిసొచ్చింది. ఈ రోజు మీరు పాటించే నియమాలు శని ప్రభావం తగ్గించి లక్ష్మీదేవి కరుణ లభించేలా చేస్తాయి..
Also Read: ధన త్రయోదశి రోజు కొనుగోలు చేయకూడని 8 వస్తువులు ఇవే!
శని శ్లోకం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం!!
శని త్రయోదశి రోజు ఈ నియమాలు పాటించండి
- సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి..నువ్వులనూనెతో శనీశ్వరుడికి దీపం వెలిగించండి
- ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అనంతరం భోజనం చేయాలి
- శని త్రయోదశి రోజు మద్యం, మాంసాహారం,ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉండాలి
- శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన ద్వారా శని ప్రభావం తగ్గుతుంది
- ఆకలితో అలమటించేవారికి, మూగజీవాలకు భోజనం పెట్టండి
- ఎవరి దగ్గర్నుంచి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె తిసుకోవద్దు
- నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచండి
- కాలవలో కానీ పారే నదిలో కానీ బొగ్గులు ,నల్ల నువ్వులు, మేకు వేసి శనికి నమస్కరించండి
- బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శనిప్రభావం తగ్గుతుంది
- శని త్రయోదశి రోజు మాత్రమే కాదు ప్రతి శని వారం రావి చెట్టుకు ప్రదిక్షణం చేయాలి
- అయ్యప్ప మాల ధరించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇవ్వడం, కాలభైరవ దర్శనం వల్ల కూడా శనిప్రభావం తగ్గుతుంది
Also Read: ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయాలా!
ధనత్రయోదశి
ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. ఐదురోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం||
Also Read: మీ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
ధన్వంతరి గాయత్రీ
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి
తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్
ధన్వంతరి తారకమంత్రం
ఓం ధం ధన్వంతరయే నమః
ధన్వంతరి మంత్రః
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ
త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప
శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా |
Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!