తీర్థయాత్రలకు వెళ్లాలంటే ఈ రైలెక్కితే చాలు - భారత్ గౌరవ్ ప్రారంభమైంది తెలుసా ?
సికింద్రాబాద్ నుండి మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రయాణం ప్రారంభించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటినీ ఈ రైలు కవర్ చేస్తుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుకుంటూ మొట్టమొదటి భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వేడుకగా బయల్దేరింది. కూచిపూడి నృత్యకళాకారులతో సాంప్రదాయం ఉట్టిపడేలా యాత్రికులకు స్వాగతం పలికారు. ఈ సన్నివేశంతో స్టేషన్ ఆవరణమoతా పండుగ వాతావరణం నెలకొంది. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ యాత్రికులకు స్వాగత కిట్‌లను అందజేశారు.
పుణ్యక్షేత్ర యాత్ర: "పూరి-కాశి-అయోధ్య" అనే పేరుతో ప్రవేశపెట్టిందే భారత్ గౌరవ్ రైల్. ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఈ పర్యాటక రైలులో ప్రయాణించేవారి కోసం ఆద్యంతం అన్నిరకాల సేవలను IRCTC అందిస్తోంది. ఈ ప్యాకేజీలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఉదయం టీ, అల్పాహారం ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉంటాయి. ప్రయాణంలో ఉన్నా, బయట ఉన్నా అందజేస్తారు. అన్ని కోచ్‌లలో సీసీ కెమెరాలను అమర్చారు. అనౌన్స్‌మెంట్ అంతటా వినిపిస్తుంది. ప్రయాణ బీమా సదుపాయం కల్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే యాత్రికులకు ఎండ్ టు ఎండ్ సేవలందిస్తారు.
ఈ పర్యటనలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ లోని ముఖ్యమైన, చారిత్రక ప్రదేశాలను చూపిస్తారు. ప్యాకేజీ వచ్చి 8 డేస్ / 9 నైట్స్! ఈ వ్యవధిలో అన్నీ తిప్పి చూపిస్తారు. ప్రయాణికుల డిమాండ్లకు అనుగుణంగా ఏసీ, నాన్ ఏసీ, కోచులను పెట్టారు. బండి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్దేశించిన 9 స్టేషన్లలో ఆగుతుంది. మొదటి ట్రిప్పులోనే అన్నిసీట్లను (700) జనం బుక్ చేసుకోవడం విశేషం.
పుణ్య క్షేత్రాలను సందర్శించడానికి వ్యక్తిగతంగా వీలుకాని వాళ్లకు ఈ రైలు ద్వారా ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నామని ద.మ రైల్వే తెలిపింది. భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు. పర్యాటకుల ఆసక్తితో పాటు పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మొత్తం ప్యాకేజీని రూపొందించినట్లు IRCTC సీఎండీ రజనీ హసిజ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రదేశాలను చూపించడమే ఈ ప్యాకేజీ కాన్సెప్ట్ అని ఆమె అన్నారు.
భారత్ గౌరవ్ రైలు కవర్ చేసే సందర్శన ప్రాంతాలు ఇవే:
ఒడిషాలోని పూరీ జగన్నాథ ఆలయం
కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్
గయా విష్ణుపాద ఆలయం
వారణాసి కాశీవిశ్వనాథ టెంపుల్, దాని అనుబంధ దర్శనీయ స్థలాలు
కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం
సాయంత్రం గంగా హారతిని చూపిస్తారు
అయోధ్య రామజన్మ భూమి
హనుమాన్ గర్హి, సరయు నది వద్ద హారతి
ప్రయాగరాజ్ త్రివేణి సంగమం
హనుమాన్ మందిర్, శంకర విమాన మండపం
రైలు, రోడ్డు ప్రయాణ సదుపాయాలు ఈ టూర్ ప్యాకేజీలో ఉన్నాయి. అదే విధంగా వసతి సదుపాయాలు, వాష్ అండ్ ఛేంజ్ ఫెసిలిటీస్, కేటరింగ్ ఎరేంజ్‌మెంట్స్ కూడా ఉన్నాయి. ఉదయాన్నే టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సదుపాయాలు కూడా ఈ ప్యాకేజీలో భాగమే. ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్స్, అన్ని బోగీల్లోనూ సీసీటీవీ కెమెరాలు, అన్ని బోగీల్లోనూ బహిరంగ ప్రకటనలు, ప్రయాణ బీమా, ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్ల నిరంతర సహాయం వంటి సదుపాయాలు కల్పిస్తారు.