Ashtadasa Shakti Peethas: అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం - కామాఖ్యా దేవి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా!
Kamakhya Temple:అష్టాదశ శక్తి ఫీఠాల్లో ఒకటి కామాఖ్యాదేవి ఆలయం. ముక్కలైన సతీదేవి శరీరం నుంచి యోనిభాగం పడిన ప్రదేశం ఇది. అసోం రాజధానికి గువాహటిలో నీలాచల పర్వతశిఖరంపై ఉన్న ఈ ఆలయం విశిష్టత ఏంటంటే..
Kamakhya Temple Mystery in Telugu: అష్టాదశ శక్తి పీఠాలు ఎన్ని అనే విషయంలో చాలా వాదనలున్నాయి...18, 51, 52, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని పిలుస్తారు. పరమేశ్వరుడి అర్ధాంగి అయిన సతీ దేవి శరీరం 18 ముక్కలై..అవన్నీ పడిన ప్రదేశాలనే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. ఇవన్నీ మన దేశం సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ లో కూడా ఉన్నాయి
ఈ అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుతున్న ఆదిశంకరాచార్యులు... ప్రతి క్షేత్రంలోనూ శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. అందుకే ఇవి అత్యంత విశిష్టమైనవిగా చెబుతారు. వీటిలో ఒకటి అసోంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయం. బ్రహ్మపుత్రానది ఒడ్డున గౌహతి సమీపంలో ఉన్న ఈ క్షేత్రాన్ని అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది అత్యంత విశిష్టమైనదిగా చెబుతారు.
Also Read: అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడున్నాయి - అవి ఎలా ఏర్పడ్డాయి -ఎందుకంత పవర్ ఫుల్!
కామాఖ్యదేవి, కామరూపిణి అని ఇక్కడ కొలువైన అమ్మవారిని పూజిస్తారు...కామం అంటే శారీక చిత్త చాంచల్యం అనుకుంటారంతా కానీ.. ఇక్కడ కామరూపిణి అంటే..కావాలి అనుకున్నప్పుడు అనుకున్న రూపాన్ని క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం. అందుకే ఇక్కడ అమ్మవారిని కామరూపిణి అని పిలుస్తారు. కామాఖ్యాదేవిగా ఎన్నో రూపాలు ధరించి భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది త్రిపురశక్తిదాయని కామాఖ్యదేవి.
ఇక్కడ అమ్మవారు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. ఆగ్రహంతో ఉన్నప్పుడు త్రిపురభైరవిగా..ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా.. శివుడిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా దర్శనమిస్తుంది. ఈ మూడు రూపాలను దర్శించుకున్న భక్తుల జన్మధన్యం.
స్వాగతద్వారం దాటి లోపలకు అడుగుపెడితే..లోపలున్న శిల్పసంపద చూపుతిప్పుకోనివ్వదు. లోపల కనిపించే గోపురాల్లో పెద్దగా ఉన్న గోపురం ఉన్న మందిరంలో కామాఖ్య దేవి కొలువుతీరి ఉంటుంది. ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం ఉంటుంది..మిగిలిన గోపురాలపై త్రిశూలాలు కనిపిస్తాయి. ఇక్కడ అమ్మవారు విగ్రహరూపంలో దర్శనమివ్వదు. యోనిరూపంలో ఉంటుంది.
ఒకప్పుడు దక్షుడు యాగం తలపెట్టి అందర్నీ ఆహ్వానిస్తాడు..తనకు నచ్చని శివుడిని వివాహం చేసుకుందనే కారణంతో సతీదేవిని ఆహ్వానించడు. పిలవకపోయినా పుట్టింటికి వెళ్లిన సచీదేవి అవమానాలు ఎదుర్కొంటుంది. అదే బాధతో అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటుంది. ఆగ్రహంతో శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేస్తాడు..సతీ వియోగాన్ని భరించలేక ఆ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయి తన కార్యాన్ని పక్కనపెట్టేస్తాడు. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి..శివుడికి మళ్లీ తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు. అలా సుదర్శనచక్రంతో ముక్కలైన అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలు..అందులో యోనిభాగం పడిన ప్రదేశం ఇది.
Also Read: అమ్మవారి దంతాలు పడిన ప్రదేశం - తెలంగాణలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సి శక్తిపీఠం!
ఇక్కడ అమ్మవారి శిలారూపంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంచుతారు. అమ్మవారిని నెల నెలా మూడు రోజులు రుతుస్రావం వస్తుంది ( ఈవిషయం దేవీభాగవతంలో స్పష్టంగా ఉంది). ఈ రోజుల్లో యోనిశిల నుంచి ఎర్రటి స్రావం వెలువడుతుంది..ఇదంతా శక్తిపీఠం ముందున్న కుండలోకి నీరులా చేరుతుంది. ఈమూడు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. నాలుగోరోజు ఉత్సవం చేసి ఆలయాన్ని తెరుస్తారు. అమ్మవారి శిలపై ఉన్న వస్త్రాలు తీసేసి వేలంలో విక్రయిస్తారు. ఇవి కొనుగోలు చేస్తే రుతుస్రావదోషాలు, రజస్వల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ...అమ్మవారి దర్శనం అనంతరం యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. సకల దేవతలూ పర్వత రూపంలో కొలువై అమ్మవారిని సేవిస్తారని చెబుతారు.
కామాఖ్యాదేవి ఆలయం చుట్టుపక్కల ... కాశి, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తా, భగళీ, ధూమావతి అనే ఏడు అమ్మవారి ఆయాలున్నాయి. వీటితో పాటూ కామేశ్వర, సిద్ధేశ్వర, కోటిలింగ, అఘోర, అమృతేశ్వర అనే పంచశివాలయాలున్నాయి.
12వ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావించలేదు కానీ ఆ తర్వాత శాసనాల్లో ఇక్కడ అమ్మవారు కొలువైననట్టు ప్రస్తావన ఉంది. ఏటా ఆషాఢమాసంలో ఐదురోజుల పాటూ అంబుబాచి మేళా ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళా తరహాలా కన్నులపండువగా ఈ వేడుకలు జరుగుతాయి. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవుడిగా కొలువయ్యాడు. గౌహతికి రైలు, విమానం, యాత్రాట్రావెల్స్ సౌకర్యాలున్నాయి.
Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!