YSRCP Leaders personal image: పాలిటిక్స్‌లో పర్సనల్ ఇమేజ్.. వైసీపీ నేతల్లో అంతర్మథనం.. వీరికి దెబ్బేనా?
ఎన్నికల్లో.. నాయకులకు పార్టీ పరంగా ఎంత బలం ఉన్నా వ్యక్తిగత ఇమేజ్ కవచంగా పనిచేస్తుంది. అయితే, అధికార పార్టీలో కొందరు నాయకులు దీనిని కోల్పోయారనే వాదన వినిపిస్తోంది. మార్పు కారణం ఇదేనట.
YSRCP Leaders Personal Image: ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సెగ పెరిగింది. ఒకవైపు.. టీడీపీ-జనసేన కూటమి(TDP-Janasena Alleance) దూకుడు చూపిస్తోం ది. ఓట్లు చెదిరిపోయి.. వైసీపీకి ఇబ్బంది పెరిగే అవకాశం ఉందనే లెక్కలు వస్తున్నాయి. అదేసయమంలో నిన్న మొన్నటి వరకు ఏమీ లేదు అనుకున్న కాంగ్రెస్ పార్టీ(Congress Party).. జూలు విదుల్చుతోంది. సీఎం జగన్ సోదరి షర్మిల(YS Sharmila)ను రంగంలోకి దింపి రాజకీయాలను వేడెక్కించింది. ఇలా.. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఇది సేఫ్ అని వైసీపీ అనుకునే పరిస్థితి లేకుండా పోయింది.
దీంతో నాయకులకు, ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YSRCP) తరఫున టికెట్ దక్కించుకున్న వారికి. వ్యక్తిగత ఇమేజ్ చాలా ముఖ్యంగా మారిపోయింది. ఏ వ్యతిరేకత ఎటు నుంచి వచ్చినా.. దానిని తట్టుకుని.. ముందుకు సాగడం కోసం. నాయకులు తమ వ్యక్తిగత ఇమేజ్(Personal image) ను కూడా .. ఎన్నికల్లో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పటి వరకు సీట్లు దక్కించుకున్న నాయకులను గమనిస్తే.. వ్యక్తిగతంగా వారి సొంత నియోజకవర్గాల్లో విమర్శలు ఎదుర్కొన్నవారే కనిపిస్తున్నారు.
అంతేకాదు.. అవినీతి ఆరోపణలు(Allegations) చుట్టుముట్టిన వారు కూడా వైసీపీలో ఉన్నారు. అందుకే.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి కూడా మార్పులు చేశారు. ఉదాహరణకు విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్‌కు మారిన వెల్లంపల్లి శ్రీనివాసరావు(Vellampalli SrinivasaRao)పై లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు ఉన్నాయని ప్రతిపక్షాలతోపాటు స్వపక్ష నాయకులు కూడా ఆరోపించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు.. ఆలయాల్లో పోస్టులకు సంబంధించి చేతులు తడుపుకొన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇక, నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా.. డబ్బులతోనే పని అని పేరు పడ్డారని సొంత నేతలే విమర్శలు గుప్పించారు.
అలాగే .. పెడన నుంచి పెనమలూరుకు మారిన మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) చుట్టూ ఇంతకు మించిన అవినీతి ఆరోపణలే వచ్చాయి. తన మన తేడా లేకుండా.. ఆయన వసూళ్లు చేశారని ప్రతిపక్షాలు బహిరంగ విమర్శలు చేశాయి. అదేవిధంగా మంత్రి ఉషశ్రీచరణ్‌పై.. కళ్యాణ దుర్గం(Kalyan durgam)లో ఏకంగా బోర్డులు వెలిశాయి. ఆమె భూమి కబ్జాలు చేశారని.. ప్రతి పనికీ రేటు పెట్టారని.. వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక, మరో మంత్రి తానేటి వనిత(Thaneti vanitha) సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకతను కూడగట్టుకున్నారు.
ఇలా అనేక మంది వ్యక్తిగత ఇమేజ్‌ను కోల్పోయారని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఆరోపణలు వచ్చిన వారినే నియోజకవర్గాల నుంచి షిఫ్ట్ చేసినట్టు తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి( Jagan Mohan Reddy)కూడా చెప్పడం గమనార్హం. అదే విధంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ పొందిన గొట్టేటి మాధవి(Gotteti Madhavi)కి అవినీతి ఆరోపణలు లేకున్నా.. వ్యక్తిగతంగా ఆమె తమకు ఏమీ చేయలేదన్న విమర్శలు ఎస్టీల్లో వినిపిస్తోంది. దీంతో ఇలాంటివారు ఏ మేరకు సక్సెస్ అవుతారు? అనేది ప్రశ్న. కేవలం పార్టీపైన, జగన్‌పైనే ఆధారపడితే.. నెగ్గుకు రాగలరా? ఇదే నిజమైతే.. అసలు మార్పులే ఉండవు కదా? అనే చర్చ సాగుతోంది. కానీ, మార్పులు జరిగాయంటే.. ఆయా నియోజకవర్గాల్లో నేతలు వ్యక్తిగతంగా తమ ఇమేజ్‌ను కోల్పోబట్టే కదా అని అంటున్నారు పరిశీలకులు.
ఒకప్పుడు నాయకులు.. ఎవరైనా తమ పర్సనల్ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకునేవారు. అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండేవారు. కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. పైగా సామాజిక వర్గాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో నాయకులు ఏం చేస్తున్నారనేది ఆయా వర్గాలు గమనిస్తున్నాయి. దీంతో సహజంగానే పర్సనల్ ఇమేజ్‌పై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మంత్రులుగా ఉన్నవారికి.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి ఇప్పుడు ఇమేజ్ ఏమేరకు కాపాడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి.. ఏం జరుగుతుందో.