కడపలో మళ్లీ ఆ పరిస్థితి రావొద్దనే పోరాటం- వైఎస్ వివేక కేసులో దోషులకు శిక్ష పడాలన్న సునీత
కడపలో అరాచకాలు తగ్గాయని తాను సంతోష పడ్డానని చెప్పారు సునీత. సంపద బాగా పెరిగే సరికి తాను అలా అనుకున్నట్టు వివరించారు. విద్యావ్యవస్థ కూడా బాగుపడ్డాయని భావించానన్నారు. కానీ హత్యతో అభిప్రాయం మారిందన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకనంద రెడ్డి చనిపోయి నేటికి నాలుగేళ్లు. ఈ సందర్భంగా ఆయన సమాధిని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సందర్శించి నివాళి అర్పించారు. వారి వెంట వివేక సోదరుడు సుధీకర్ రెడ్డి, అభిమానులు కూడా ఉన్నారు. తన తండ్రి హత్య కేసులో నిజాలు వెలుగులోకి రావాలనే పోరాడుతున్నట్టు సునీతి తెలిపారు.
వివేక హత్య కేసులో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారని వారందరికి కృతజ్ఞత తెలిపారు సునీత. ఎవరో ఒకరి మీద కక్షతో తాను న్యాయపోరాటం చేయడం లేదని నిజం బయటకు తెలియాలన్న ఉద్దేశంతోనే పోరాడుతున్నట్టు చెప్పారు సునీత. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటలు చాలా సాధారణమే ఎందుకు ఆరాటపడుతున్నావని చాలా మంది తనకు సలహా ఇచ్చారని... అయినా తాను వెనక్కి తగ్గడం లేదన్నారు. నిజమైన నిందితులు న్యాయవ్యవస్థ ముందు దోషులుగా నిలబెట్టాలన్నారు.
దర్యాప్తు సంస్థలకు స్వేచ్చ ఇవ్వగలిగితే నిజాలు బయటకు వస్తాయన్నారు సునీత. కాని కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇంతకు మించి ఈ కేసుపై మాట్లాడితే మంచిది కాదన్నారు. కచ్చితంగా తనకు తెలిసిన ఎలాంటి సమాచారాన్ని అయినా దర్యాప్తు సంస్థలకు చెబుతానని... అంతేకానీ బయట మాట్లాడబోనన్నారు.
తనపై తన ఫ్యామిలీపై కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారని ఇది బాధగా ఉందన్నారు సునీత. అయినా తాను ధైర్యం కోల్పోబోనని.. తనకు తెలిసిన ప్రతి విషయాన్ని సీబీఐకి చెబుతున్నట్టు వివరించారు. హత్య జరిగిన తర్వాత చాలా మంది చాలా తేలికగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. ఓ హత్య జరిగిన తర్వాత ఎవరు చేశారో తెలియకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారామె.
వివేక హత్య కేసులో నిజాలు బయటకు రావాలని... ఇలాంటి ఘటనలు మరో వ్యక్తికి జరగకుండా ఉండేందుకే తాను పోరాటం చేస్తున్నానని అన్నారు సునీత. దర్యాప్తు సంస్థలను, వ్యవస్థలను తాను కోరేది అదే అన్నారు. చిన్న పిల్లలు తప్పు చేస్తే కొట్టే మనం... పెద్దలు తప్పు చేస్తే ఎందుకు వదిలేయాలని ప్రశ్నించారు. అలా తప్పు చేసిన వాళ్లంతా బయటకు రావాలని అన్నారు.
తాను వేరే ప్రాంతాల్లో చదువుకునేటప్పుడు కడప అంటే రెండే అంశాలు అందరికీ గుర్తుకు వచ్చేవన్నారు సునీ.. ఒకటి ఆ ప్రాంతంలో జరిగే అరాచకాలు... రెండోది మద్రాస్ మెయిల్‌కు వెళ్లేటప్పుడు తినే భోజనం. ఈ రెండే ఎక్కువమందికి తెలుసని అన్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఆ ప్రాంతంలో అరాచకాలు తగ్గాయని తాను సంతోష పడ్డానని చెప్పారు సునీత. సంపద బాగా పెరిగే సరికి తాను అలా అనుకున్నట్టు వివరించారు. విద్యావ్యవస్థ కూడా బాగుపడ్డాయని భావించానన్నారు.
కానీ తన తండ్రి హత్య తర్వాత మార్పు రాలేదని గ్రహించానన్నారు సునీత. మళ్లీ 30 ఏళ్ల వెనక్కి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే పోరాటానికి సిద్ధపడినట్టు వివరించారు. హింస ఆగిపోయి అభివృద్ధి జరగాలన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడితేనే తప్పు చేయాలనుకునే వారికి భయం పుడుతుందని... లేకుంటే తప్పు చేసేవారి సంఖ్య పెరిగిపోతుందన్నారు. అందుకే తాను పోరాడుతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రయత్నంలో తనకు సపోర్ట్ చేస్తున్న వారికి కృతజ్ఞత తెలిపారు.